ముప్పేట దాడితో ‘ఫ్యాన్’ ఉక్కిరిబిక్కిరి!
ABN , First Publish Date - 2023-11-21T03:37:08+05:30 IST
ఇన్నాళ్లూ స్తబ్ధుగా ఉన్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ రోడ్లపైకి వచ్చి జగన్ ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయి.

మద్యం, ఇసుక దోపిడీపై పురందేశ్వరి ధ్వజం
అరాచకాలు, అక్రమ కేసులపై టీడీపీ పోరు
రోడ్ల దుస్థితి, వలంటీర్లపై జనసేన ఫైర్
ఆత్మరక్షణలో ప్రభుత్వ పెద్దలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లూ స్తబ్ధుగా ఉన్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ రోడ్లపైకి వచ్చి జగన్ ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయి. జగన్ అక్రమాదాయ వనరులు, మద్యం, ఇసుక దోపిడీ, అప్పుల కుప్పపై బీజేపీ.. వైసీపీ అరాచకాలు, అక్రమ కేసులు, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ.. వలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగం, రోడ్ల దుస్థితిపై జనసేన.. అగ్రిగోల్డ్, కృష్ణా జలాల్లో అన్యాయం, ఇతర ప్రజాసమస్యలపై వామపక్షాలు మూకుమ్మడిగా విరుచుకుపడుతుండడంతో అధికార పక్షం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఏడాది క్రితం నుంచే ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తోంది. తమ శ్రేణులపై అక్రమ కేసులు.. వైసీపీ గ్యాంగ్‌ల దాడులు.. హత్యలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు.. అరాచకాలన్నింటినీ ఎదుర్కొంటూ ప్రభుత్వాన్ని ఢీకొడుతోంది. చంద్రబాబు అరెస్టు దరిమిలా ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. జనసేనతో పొత్తును ప్రకటించి ఉమ్మడి పోరాటానికి శ్రీకారం చుట్టింది. తొలిగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై రెండు పార్టీలు రెండ్రోజులపాటు ఉద్యమించాయి. జనసేనాని పవన్ కల్యాణ్ అంతకుముందే ‘వారాహి’ యాత్రతో వలంటీర్ వ్యవస్థపై విరుచుకుపడడం ప్రభుత్వ పెద్దలను ఇరుకున పెట్టింది. దీంతో ఆయన వ్యక్తిగత జీవితంపై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎవరెంత దాడి చేసినా బీజేపీ కేంద్ర నాయకత్వం అండ తనకు ఉందని ఆయన ధీమాగా ఉన్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానంలోకి వచ్చిన దగ్గుబాటి పురందేశ్వరి.. ప్రభుత్వానికి ఇప్పుడు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
ఆమెకు ముందున్న నాయకత్వం జగన్ పట్ల సానుకూలంగా వ్యవహరించి విమర్శలపాలైంది. ఆమె మాత్రం ఇసుక, మద్యం అక్రమాలపై నిత్యం విరుచుకుపడుతున్నారు. నాసిరకం మద్యం, దోపిడీలపై క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఉద్యమిస్తున్నారు. వీటి వెనుక ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్‌రెడ్డి ఉన్నారని.. వారిని జైలుకు పంపుతారా అని నిలదీస్తున్నారు. మద్యం, ఇసుక దోపిడీపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకే ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం వరకూ ఎంతో అనుకూలంగా ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఒక్కసారిగా దాడికి దిగడంతో ప్రభుత్వ పెద్దలు ఆత్మరక్షణలో పడ్డారు. వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు. ఆమె హుందాగా ఎదుర్కొంటున్నారు. తాజాగా సోమవారం ఒంగోలులో రాష్ట్ర కమిటీ సమావేశంలో... వైసీపీ ప్రభుత్వ అరాచక, విధ్వంస పాలనకు వ్యతిరేకంగా దశలవారీగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. అవినీతి పాలనపై గ్రామస్థాయి నుంచి ఉద్యమం చేపట్టాలని తీర్మానం చేశారు. మరోవైపు సీఎం బంధువుకు ఇసుక మైనింగ్ కట్టబెట్టేందుకు జరుగుతున్న యత్నంపైనా బీజేపీ కూపీ లాగుతోంది. రాష్ట్ర నాయకత్వం చేస్తున్న పోరాటానికి ఢిల్లీ పెద్దల మద్దతు ఉందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.