తర్వాతి టార్గెట్‌ సూర్యనారాయణ

ABN , First Publish Date - 2023-06-02T04:27:00+05:30 IST

వాణిజ్య పన్నుల శాఖలో నలుగురు ఉద్యోగుల అరెస్టు తర్వాత టార్గెట్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణే! డీలర్లు, ఏజెన్సీలు, ఆడిటర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు

తర్వాతి టార్గెట్‌ సూర్యనారాయణ

● నలుగురు ఉద్యోగుల రిమాండ్‌ రిపోర్టులో ఆయన పేరు

● ఏ5గా పేర్కొన్న పోలీసులు

● వాణిజ్య పన్నుల ఉద్యోగులకు 14 రోజుల రిమాండ్‌

విజయవాడ, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): వాణిజ్య పన్నుల శాఖలో నలుగురు ఉద్యోగుల అరెస్టు తర్వాత టార్గెట్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణే! డీలర్లు, ఏజెన్సీలు, ఆడిటర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారన్న అభియోగాలతో నలుగురిని ఇప్పటికే అరెస్టు చేయడంతో వాణిజ్య పన్నుల శాఖలో ప్రస్తుతం సూపరింటెండెంట్‌ హోదా లో ఉన్న కేఆర్‌ సూర్యనారాయణను త్వరలో అరెస్టు చేయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ1గా బలిజేపల్లి మోహర్‌కుమార్‌, ఏ2గా కొచర్లకోట సంధ్య, ఏ3గా కావూరి వెంకట చలపతి, ఏ4గా మరీదు సత్యనారాయణను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న పోలీసులు.. ఏ5గా కేఆర్‌ సూర్యనారాయణ పేరును చేర్చారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ నలుగురు నిందితులు కేఆర్‌ సూర్యనారాయణతో కలిసి డీలర్లు, ఆడిటర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఆ నలుగురు నిందితులను విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో గురువారం ప్రవేశపెట్టారు. జడ్జి రాజశేఖర్‌ ఆ నలుగురికీ 14 రోజుల రిమాండ్‌ విధించారు. వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. కాగా, కేఆర్‌ సూర్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన వాణిజ్య పన్నుల శాఖలో సూపరింటెండెంట్‌ హోదాలో ఉన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఉన్నారు. అయితే, పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో సూర్యనారాయణ పేరు ప్రస్తావించడం సంచలనంగా మారింది. ‘‘నలుగురు నిందితులు వాణిజ్య పన్నుల శాఖ విజయవాడ 1 డివిజన్‌లో వివిధ హోదాల్లో 2019నుంచి 2021 మధ్య పనిచేశారు. ఆ సమయంలో వారు కేఆర్‌ సూర్యనారాయణతో పాటు రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న మరికొంతమందితో కలిసి జీఎస్టీ చట్టాలను ఉపయోగించుకుని డబ్బుల కోసం డీలర్లు, వ్యాపారులను బెదిరించారు. ఆయా వ్యాపారాలు, సంస్థల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించి నకిలీ సమన్లను తయారు చేశారు. డిస్ట్రిబ్యూషన్‌ రిజిస్టర్లలో తప్పుడు ఎంట్రీలు చేసి పక్కదారిలో డబ్బులు వసూలు చేశారు. దీనివల్ల వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి నష్టం కలిగించారు. డీలర్లు, ఏజెన్సీలు, వ్యాపారుల నుంచి చెల్లించాల్సిన దానికన్నా తక్కువమొత్తంలో జీఎస్టీని వసూలు చేశారు.

ఏపీ జీఎస్టీ యాక్ట్‌–2017ను ఉల్లంఘించి ఈ ఐదుగురు నిందితులు వ్యవహరించారు. తద్వారా స్వప్రయోజనాలను పొందారు. దీనిపై విజయవాడ–1 ఇంటెలిజెన్స్‌ విభాగ జాయింట్‌ కమిషనర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. సాక్షుల నుంచి సీఆర్పీసీ 161 ప్రకారం వాంగ్మూలం తీసుకున్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రికి వైద్య పరికరాలు సరఫరా చేసిన సంస్థకు ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి నోటీసులు జారీ చేశారు. జరిమానాతో కలిపి జీఎస్టీని చెల్లించాలని పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. మోహర్‌కుమార్‌, సంధ్య, చలపతి, సత్యనారాయణతో పాటు సూర్యనారాయణ అనైతిక కార్యకలాపాలు నిర్వహించినట్టు విచారణ కమిటీ నిర్థారించింది. విచారణలో అనేక డాక్యుమెంట్లను పరిశీలించారు. వ్యాపారులు, డీలర్లకు చెల్లించాల్సిన పన్నులను తగ్గించినందుకు భారీగా డబ్బులు డిమాండ్‌ చేశారు. నిందితులు విచారణలో సహకరించలేదు. ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు. నిందితులకు రిమాండ్‌ ఇవ్వడంతోపాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలి’’ అని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

హక్కులనెలా కాపాడుకోవాలో మాకు తెలుసు

● ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు సూర్యనారాయణ

విజయవాడ, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ సంఘాలను, ఉద్యోగులను కట్టడి చేయడానికి ప్రభుత్వం తన అధికారాలను ఉపయోగిస్తే ఉద్యోగుల హక్కులను ఎలా కాపాడుకోవాలో ఉద్యోగ సంఘాల నేతలకు తెలుసని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ చెప్పారు. గురువారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆయనతోపాటు సంఘం నేతలు కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేసినా, మరొకటి చేసినా నేతలను వారి సిద్ధాంతాలు, భావజాలం నుంచి పక్కకు తప్పించలేదని తేల్చిచెప్పారు. వాణిజ్యపన్నుల శాఖలో నలుగురు ఉద్యోగుల అరెస్టు తీరును మాత్రమే తాము వ్యతిరేకించామన్నారు. కేసులు నమోదు చేసి, విచారణ చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని చెప్పారు. మహిళా అధికారికి నోటీసు ఇవ్వకుండా అరెస్టుచేసే అధికారం రాజ్యాంగంలోని ఏ అధికరణలో ఉందని ప్రశ్నించారు. ఉద్యోగులు తప్పు చేస్తే, దొంగతనంగా అరెస్టు చేయాల్సి అవసరం ఏముందని ప్రశ్నించారు. తమ సంఘం ఆధ్వర్యంలో గతనెల 22 నుంచి రిలే నిరాహారదీక్షలు జరుగుతున్నాయన్నారు. 9ఆర్థిక పరమైన డిమాండ్లు, 160 శాఖా పరమైన డిమాండ్లతో ఎండలో, చెట్ల కింద కూర్చుని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారన్నారు. 8 నుంచి జిల్లాస్థాయిలో నిరసనలు ప్రారంభమవుతాయన్నారు. జూలై 5నుంచి కర్నూలు, నంధ్యాలలో నిరసన ప్రదర్శనలు మొదలై 26 జిల్లాల్లో జరుగుతాయన్నారు. 12వ పీఆర్సీపై రెండు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. సీఎస్‌ జవహర్‌రెడ్డిని అమరావతి జేఏసీ నేత బొప్పరాజును కలవడంపై మీడియా ప్రశ్నించగా పార్కులో కూర్చున్న ఇద్దరు ప్రేమికుల మధ్య ఏం జరుగుతోందో మూడోవ్యక్తి ఎలా చెప్పగలడన్నారు.

Updated Date - 2023-06-02T04:27:00+05:30 IST