Polavaram project : హద్దుల్లేని అబద్ధాలా జగన్!?
ABN , First Publish Date - 2023-08-09T04:00:34+05:30 IST
ప్రత్యేక హోదా... దేవుడి దయ లేదు కాబట్టి అడగలేం! నిర్వాసితులకు పరిహారం... దేవుడి దయతోపాటు కేంద్రం సహకారం అవసరం! మరి సీఎం చేయగలిగింది ఏమిటో తెలుసా? ప్రభుత్వ వేదికలపై రాజకీయ విమర్శలు.. అసెంబ్లీ వేదికగా మీడియాపై ఎకసెక్కాలు ఆడటం! పైగా... ‘హద్దూపద్దూ లేని అబద్ధాలా అధ్యక్షా!’
2021 నుంచి 2025కు పెరిగిన డెడ్‌లైన్
41.15 కాంటూరుపై నాడు ఎకసెక్కాలు
నేడు.. అదే కాంటూరుకే పరిమితం
పునరావాసంపై నాడో మాట నేడో మాట
‘దేవుడి దయ’ అంటూ వేదాంతం
కేంద్రంపైనే భారం వేసి హ్యాండ్సప్
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ప్రత్యేక హోదా... దేవుడి దయ లేదు కాబట్టి అడగలేం!
నిర్వాసితులకు పరిహారం... దేవుడి దయతోపాటు కేంద్రం సహకారం అవసరం!
మరి సీఎం చేయగలిగింది ఏమిటో తెలుసా? ప్రభుత్వ వేదికలపై రాజకీయ విమర్శలు.. అసెంబ్లీ వేదికగా మీడియాపై ఎకసెక్కాలు ఆడటం! పైగా... ‘హద్దూపద్దూ లేని అబద్ధాలా అధ్యక్షా!’ అని ఆవేదన వ్యక్తం చేయడం!
పోలవరంలో నీటి నిల్వను 45.72 నుంచి 41.15 మీటర్లకు తగ్గించేయనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ గతంలో అనేక కథనాలను ప్రచురించింది. దీనిపై సీఎం జగన్ ‘‘రాధాకృష్ణా... రాధాకృష్ణా! పోలవరం ఎత్తు తగ్గిస్తున్నాం... అని కేంద్ర మంత్రి షెకావత్ ఆయన చెవిలో చెప్పారా?’’ అని అనడం, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పకపకా నవ్వుతూ చప్పట్లు కొట్టడం అసెంబ్లీ వేదికగానే జరిగింది. అసలు విషయం ఏమిటంటే... పోలవరం ప్రాజెక్టు ఎత్తును జగన్ తగ్గించలేరు. ఎందుకంటే... ఆయన అధికారంలోకి వచ్చేసరికి ప్రాజెక్టులో గేట్లు పెట్టే పనులు కూడా మొదలయ్యాయి. కానీ... పునరావాసం ఖర్చు తగ్గించుకోవడం కోసం నీటి నిల్వను 41.15 మీటర్ల కాంటూరుకే పరిమితం చేస్తున్నట్లు మాత్రమే ‘ఆంధ్రజ్యోతి’ పలు కథనాల్లో స్పష్టంచేసింది. ఆ తర్వాత అదే నిజమైంది. దీనికే... ‘తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరు’ అంటూ కలరింగ్ ఇచ్చారు. ఇప్పుడు పూర్తిస్థాయి నీటిమట్టమైన 45.72 మీటర్ల కాంటూరులో నీళ్లను నిల్వ చేస్తే ప్రాజెక్టుకే నష్టమంటూ కొత్త కథలు చెబుతున్నారు. ఒక కీలకమైన ప్రాజెక్టుపై పూటకోమాట మార్చుతూ, గడియకో గడువు చెప్పడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగునా? పదేపదే అబద్ధాలు చెబుతున్నది ఎవరు?
కేంద్ర మీద భారం.. ‘25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం’ అని ఎన్నికల ముందు జగన్ ఊరూరా మైకు పట్టుకుని చెప్పారు. అధికారంలోకి వచ్చాక, ‘ఏం చేద్దాం! దేవుడు సహకరించలేదు. బీజేపీకి మన అవసరం లేదు. ప్రత్యేక హోదాపై అడుగుతూ ఉండటమే తప్ప ఏమీ చేయలేం’ అని చేతులెత్తేశారు. ఇప్పుడు పోలవరంపైనా అవే మాటలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి 2021, 2022, 2023 అంటూ ఏయేటికాయేడు గడువులు పెంచుతూ పోయారు. ఇప్పుడు ఏకంగా 2025 ఖరీఫ్ అనేశారు. ఇదే జగన్ విపక్షంలో ఉన్నప్పుడు... ‘కేంద్రం నిధులు ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్మించలేకపోతోంది? సొంత నిధులతో కట్టాలి! కేంద్రం నిధులు ఇచ్చినప్పుడు తీసుకోవాలి’’ అని గట్టిగా నొక్కి వక్కాణించారు. ఇప్పుడేమో... ‘నా ఖర్మ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు నా చేతుల్లో లేదు. కేంద్రం నిర్మిస్తోంది. వాళ్లు ఇస్తే తప్ప నేను మీకు ఇచ్చే పరిస్థితి లేదు’ అంటూ పూర్తి భారాన్ని కేంద్రంపై పడేశారు. నిర్వాసితులను పూర్తిగా గాలికి వదిలేశారు. అంతేకాదు... కేంద్రం ఇవ్వకున్నా రాష్ట్రమే సొంతంగా పరిహారం చెల్లిస్తుందని గత ఏడాది నిర్వాసితులకు మాట ఇచ్చారు. ఇప్పుడు... ‘దేవుడి దయ, కేంద్రం సహకారం’ అంటూ చేతులెత్తేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 41.15 మీటర్ల కాంటూరులోని నిర్వాసితులకు భూసేకరణ, సహాయ పునరావాసానికి నిధులు ఇవ్వకుండా ఎగువ కాఫర్‌డ్యామ్‌ను 45 మీటర్లకు ఎలా కడతారంటూ అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎగువ కాఫర్‌డ్యామ్ ఎత్తును పెంచేశారు. కానీ.. 41.15 మీటర్ల కాంటూరులో నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. గతంలో ఎకరాకు పది లక్షల రూపాయలను చెల్లిస్తామన్న జగన్.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.6.80 లక్షలకు తోడు.. రాష్ట్రం మరో రూ.3.20 లక్షలను మాత్రమే చెల్లిస్తుందని ప్రకటించారు. ఒక్క ప్రాజెక్టుపైనే ఇన్ని అబద్ధాలను అలవోకగా చెబుతూ... ఇంత సులువుగా ప్లేట్లు తిప్పేస్తూ ‘హద్దూపద్దూ లేని అబద్ధాలా అధ్యక్షా’ అని వాపోవడమే అతిపెద్ద వింత!