Tadepalli : తాడేపల్లి తంటా
ABN , Publish Date - Dec 29 , 2023 | 03:08 AM
అధికార పక్ష ఎమ్మెల్యేల అలకలతో తాడేపల్లి పెద్దలకు తల బొప్పి కడుతోంది. సర్వేల సాకుతో తమకు పొగపెడుతున్న జగన్.. తమను కలవకపోగా సీఎంవో అధికారితో తమ తప్పొప్పులు చెప్పించడాన్ని పలువురు ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారు.
ప్యాలెస్‌లో రచ్చరచ్చ!
విలువ లేని చోట ఇమడలేం.. పోటీ చేయలేం.. మీకో దండం గెలుస్తామనే నమ్మకంలేక... తాము గెలిచినా పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశలేక.. వైసీపీ ఎమ్మెల్యేలు జావగారిపోతున్నారు. ‘టికెట్’ లేదు అనగానే... ‘అంతా మన మంచికే’ అనుకుంటున్నారు. ‘ముందస్తు కప్పం’ కట్టలేక... విపక్ష నేతలను అడ్డగోలుగా తిట్టాలనే షరతులకు ఒప్పుకోలేక ఎంపీలు జగన్‌కు ‘దండం’ పెడుతున్నారు. నాలుగున్నరేళ్లకుపైగా మూసుకున్న ‘తాడేపల్లి’ తలుపులు ఇప్పుడు బార్లా తెరుచుకున్నాయి. ‘పిలుపులు’ అందుకున్న వాళ్లు తాడేపల్లికి పరుగులు తీస్తున్నారు. ఈ పొలిటికల్ ‘జాతర’లో జగన్ ఇంకెందరు సొంత నేతలను బలిపశువులను చేస్తారో అనే చర్చ జోరుగా సాగుతోంది.
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీసీఎం ఓకే అన్నారు
ఎంపీ సీటుబీసీలకే: ఎంపీ భరత్
సీఎం జగన్ నన్ను నమ్మడం లేదు! సీటిచ్చినా, ఇవ్వకున్నా
పెనమలూరు నుంచే పోటీ చేస్తా: కొలుసు
పోటీ చేయనని తేల్చి చెప్పేశా వసంత కృష్ణప్రసాద్ ముభావంగా తిరుగుముఖం
తెగేసి చెప్పేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు
రాంబాబు, వసంత బాటలో మరికొందరు
పెద్దల్లో వణుకు.. పిలిచి మరీ బుజ్జగింపులు
టికెట్ ఇవ్వకపోవడమే మేలంటున్న కొందరు
ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అవుట్!
బాబును తిట్టలేదని, డిపాజిట్ కట్టలేదని
టికెట్ నిరాకరించిన ముఖ్యమంత్రి జగన్
మరో ఐదుగురు ఎంపీలకూ తిరస్కరణ
బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతానికి సేఫ్!
ఒంగోలు నుంచి పోటీపై లైన్‌క్లియర్
నేడు అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం?
అధికార పక్ష ఎమ్మెల్యేల అలకలతో తాడేపల్లి పెద్దలకు తల బొప్పి కడుతోంది. సర్వేల సాకుతో తమకు పొగపెడుతున్న జగన్.. తమను కలవకపోగా సీఎంవో అధికారితో తమ తప్పొప్పులు చెప్పించడాన్ని పలువురు ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారు. తమకు విలువివ్వని చోట ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులైతే రూ.40 కోట్లు, ఎంపీ అభ్యర్థులు కనీసం 180 కోట్లు డిపాజిట్ చేయాలని పెద్దలు పట్టుబడుతుండడంతో హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో టికెట్ కోసం పట్టుబట్టే కన్నా.. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం మేలని వీరిలో కొందరు భావిస్తున్నారు. దీంతో మొదటికే మోసం వస్తుందని భావించిన జగన్ అండ్ కో.. వారిని హుటాహుటిన తాడేపల్లి రప్పించి బుజ్జగించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసేందుకు నిరాకరించినందుకు, అడిగినంత సొమ్మును సర్దుబాటు చేయని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై జగన్ వేటు వేశారు. ఆయనకు టికెట్ ఇచ్చేది లేదని తెగేసిచెప్పారు. ఇదే కారణంతో మరో ఐదుగురు ఎంపీలకు మొండి చేయి చూపబోతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాట్లు, అలకలతో తాడేపల్లిలో సీఎం జగన్ ప్యాలెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి నెట్టివేసి.. వారిని మార్చేస్తే వచ్చే ఎన్నికల్లో సునాయాస విజయం సాధ్యమవుతుందని ఆయన గంపెడాశతో ఉన్నారు. కనీసం 92 మందిని మార్చాలని భావిస్తున్నారు. ఇది ఎమ్మెల్యేల్లో కలవరం రేపింది. ప్రజల్లో జగన్‌పైనే వ్యతిరేకత ఉందని.. తమపై కాదని వారు చెబుతున్నా వినిపించుకునే వారే లేరు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్‌లను బహిరంగంగా తీవ్రస్థాయిలో విమర్శించాలని.. ఎమ్మెల్యే అభ్యర్థి అయితే రూ.40 కోట్లు.. ఎంపీ అభ్యర్థి అయితే రూ.180 కోట్లు ఖర్చుపెట్టాలని జగన్ షరతులు పెట్టారు. ఈ గొంతెమ్మ కోరికలను తీర్చడం కంటే పోటీచేయకపోవడమే మేలన్న అభిప్రాయంతో ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే వైసీపీ గెలుస్తుందన్న నమ్మకం వారికి కలుగడం లేదు. ఒకవేళ తాము గెలిచినా పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశ సన్నగిల్లి.. ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు. ‘టికెట్’ లేదు అనగానే... ‘అంతా మన మంచికే’ అని చాలా మంది అనుకుంటున్నారు.
సీఎంతో బాలినేని భేటీ
సీట్ల మార్పిడి, టికెట్ల ఖరారుపై ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమన్వయకర్తల చర్చల ప్రక్రియ గురువారం కూడా కొనసాగింది. రెండ్రోజులుగా ఎంపీ విజయసాయిరెడ్డితో మంతనాలు జరుపుతూ వచ్చిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బుధవారం వరకు సీఎం దర్శన భాగ్యం దక్కలేదు. గురువారం మాత్రం విజయసాయితో కలసి బాలినేని సీఎంను కలిశారు. అనంతరం తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మీడియాకు వెల్లడించారు. కాగా.. ఈసారి ఒంగోలు లోక్‌సభ టికెట్ మాగుంటకు ఇవ్వడం లేదని.. ఆయన కుటుంబ సభ్యులకు కూడా అసెంబ్లీ టికెట్లు లేవని బాలినేనికి జగన్ తేల్చిచెప్పారు. 180 కోట్లు డిపాజిట్ చేయాలని.. విలేకరుల సమావేశం పెట్టి చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా విమర్శించాలని తానిచ్చిన ఆదేశాలను మాగుంట పాటించలేదని జగన్ గుర్రుగా ఉన్నారు. మరో ఐదుగురు ఎంపీలకు కూడా ఇదే పరిస్థితి ఎదురుకానుందని అంటున్నారు. బాలినేని మాత్రం ప్రస్తుతానికి వేటు తప్పించుకున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇంకోవైపు.. అభ్యర్థుల ఎంపికలో జగన్ తీరును నిరసించే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది.
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బాటలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ప్రకటించడంతో వైసీపీ పెద్దలు ఆగమేఘాలపై ఆయన్ను తాడేపల్లి సీఎం కార్యాలయానికి పిలిపించి బుజ్జగించే ప్రయత్నం చేశారు. గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డిని బహిరంగంగా టార్గెట్ చేసిన జంగా కృష్ణమూర్తిని కూడా రప్పించి మాట్లాడారు. అభ్యర్థులు ఎవరెవరు.. ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారోనన్న తుది జాబితాను శుక్రవారం జగన్ ప్రకటిస్తారని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఎవరిని ఖరారు చేస్తారో.. ఎవరిని తీసేస్తారో సిటింగ్‌లకు అధినేత చెప్పకపోవడంతోపాటు.. ప్రజాప్రతినిధులను కలిసేందుకూ విముఖత చూపారు. పైగా వారికి టికెట్లు నిరాకరిస్తున్నట్లు నేరుగా చెప్పకుండా సీఎంవో అఽధికారి ధనుంజయరెడ్డితో వారి తప్పొప్పుల చిట్టా చదివించడాన్ని అవమానంగా భావిస్తున్నారు. దీంతో.. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలూ ‘జగన్ నీకో దండం’ అంటూ బయటపడేందుకు సిద్ధయవుతున్నారు. ఇంకొందరు మాత్రం.. ఓడిపోయే స్థానాల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కంటే.. బరిలోకి దిగకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు. టీడీపీ, జనసేనల్లో చేరినా టికెట్లు వచ్చే అవకాశాలు లేకపోవడంతో.. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. అదే జరిగితే ఆమె వెంట అడుగులు వేసేందుకు పలువురు వైసీపీ అసంతృప్త నాయకులు సిద్ధమవుతున్నారు.
పెద్దిరెడ్డికీ తప్పని తిప్పలు..
రాయలసీమ వైసీపీని నడిపిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీ కష్టాలు తప్పడం లేదు. జగన్‌కు ఈయన, ఈయన కుమారుడు, ఎంపీ మిథున్‌రెడ్డి కూడా అత్యంత సన్నిహితులు. ఈసారి ఎన్నికల్లో తన కుటుంబానికి 4 టికెట్లు కావాలని పెద్దిరెడ్డి కోరుతున్నారు. జగన్ సుముఖంగా లేరని రాజకీయవర్గాలు అంటున్నాయి.