Share News

ఎస్టీలకు వెన్నుపోటుపై రచ్చ

ABN , Publish Date - Dec 22 , 2023 | 02:43 AM

ఎస్టీలకు జగన్‌ వెన్నుపోటు’ అంశం సచివాలయాన్ని కుదిపేసింది. ఎస్టీ, దివ్యాంగ ఉద్యోగులకు ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయం వ్యవహారం దుమారం రేపింది. తనను గెలిపించిన ఉద్యోగుల

ఎస్టీలకు వెన్నుపోటుపై రచ్చ

పదోన్నతుల్లో అన్యాయంపై సచివాలయంలో దుమారం

‘ఆంధ్రజ్యోతి’పై వెంకట్రామిరెడ్డి అక్కసు

వాస్తవాలు వక్రీకరించి సమర్థించుకునే యత్నం

ఖండించిన ఎస్టీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం

ప్రమోషన్లలో అన్యాయం జరిగిందని ఆవేదన

నిబంధనలు ఉల్లంఘించారని ఆక్షేపణ

దిష్టిబొమ్మలు తగులబెడతామని హెచ్చరిక

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘ఎస్టీలకు జగన్‌ వెన్నుపోటు’ అంశం సచివాలయాన్ని కుదిపేసింది. ఎస్టీ, దివ్యాంగ ఉద్యోగులకు ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయం వ్యవహారం దుమారం రేపింది. తనను గెలిపించిన ఉద్యోగుల కోసం కాకుండా వైసీపీ కోసం మాత్రమే అహర్నిశలు శ్రమించే సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సహజంగానే ‘ఆంధ్రజ్యోతి’పై అక్కసు వెళ్లగక్కారు. సచివాలయంలో పనిచేస్తున్న ఎస్టీ, దివ్యాంగ ఉద్యోగులకు ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయంపై వాస్తవాలు చెప్పకుండా చిందులు తొక్కారు. పేపర్లు తగలబెడతానని హెచ్చరించారు. ఆయన తీరును సచివాలయంలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఆక్షేపించింది. ఎస్టీలకు ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరగడం లేదని చెప్పిన వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేయడం తగదని పేర్కొంది. తమ హక్కులను అడ్డుకున్నవారి దిష్టిబొమ్మల్ని తగులబెడతామంటూ హెచ్చరించింది. ప్రమోషన్ల విషయంలో సచివాలయంలో ఎస్టీ, దివ్యాంగ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ‘ఎస్టీలకు జగన్‌ వెన్నుపోటు’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశంలో వాస్తవాలను వక్రీకరించేలా మాట్లాడారు. దీంతో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆయన తీరును తప్పు పడుతూ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

మాకు తీవ్ర అన్యాయం

‘‘2023 ఆగస్టు 31 తర్వాత వచ్చిన ఎస్‌వో ఖాళీలను వాడుకోవడానికి సీఎం ఆమోదం కోసం ఫైలు పంపించామని వెంకట్రామిరెడ్డి మీడియాతో చెప్పారు. ప్రమోషన్లకు ఎస్టీలకు అన్యాయం జరగలేదన్న ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించి అన్యాయం చేస్తున్నారు. 2023 ఏప్రిల్‌ 10వ తేదీన జరిగిన డీపీసీ రివ్యూ సమావేశంలో స్ర్కీనింగ్‌ కమిటీ 2 విషయాలను స్పష్టంగా పేర్కొంది. ఆ డీపీసీలో ప్రమోషన్‌కు ఎంపికైన ఉద్యోగుల వ్యాలిడిటీ ఈ ఏడాది ఆగస్టు 31 వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబరు 1 తర్వాత అందుబాటులోకి వచ్చిన ఖాళీలను ఎస్టీలు, దివ్యాంగులతో భర్తీ చేయాలి. దీనిప్రకారం 2022-23 ప్యానెల్‌ ఇయర్‌కు సంబంధించి ఆ ఉద్యోగులకు ప్రమోషన్లు అందుకునే సమయం మించిపోయింది. ఈ ప్యానెల్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలన్నా మళ్లీ రివ్యూ/సప్లిమెంటరీ డీపీసీ జరపాలని నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఎస్టీలు, దివ్యాంగులతో ఖాళీలు భర్తీ చేయాలని మీటింగ్‌లో తీర్మానించారు. సీఎం ఆ ఫైలుపై సంతకం చేయడం ద్వారా ప్రభుత్వం ఆ రెండు పాయింట్లను ఉల్లంఘించి మరీ ఎస్టీలకు, దివ్యాంగులకు అన్యాయం చేస్తోంది. ఏఎ్‌సవోలుగా ఉన్న మాకు (ఎస్టీ, దివ్యాంగ ఉద్యోగులు) సెక్షన్‌ అధికారుల కేడర్‌కు ప్రమోషన్‌ ఇవ్వమని ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరాం. కానీ, మా విజ్ఞప్తులు ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు మాత్రం మరో డీపీసీ పెట్టకుండానే జనరల్‌ కేటగిరి ఉద్యోగులకు ప్రమోషన్‌ కల్పించేందుకు దారి సుగమం చేసి మాకు తీవ్ర అన్యాయం చేసింది. 2023 ఆగస్టు 31కి ముందే అందుబాటులోకి వచ్చిన 6 ఎస్టీ ఖాళీలు, 2 దివ్యాంగ ఖాళీల భర్తీకోసం మేమంతా డీపీసీ కోసం ఎదురుచూడాలి కానీ.. 2023 సెప్టెంబరు 1 తర్వాత అందుబాటులోకి వచ్చిన ఖాళీలను డీపీసీ లేకుండా, వ్యాలిడిటీ ముగిసిపోయిన 2022-23 ప్యానెల్‌తోనే భర్తీ చేయడానికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం దేనికి సంకేతం? ఇది ద్వంద్వ నీతి కాదా? మాకు జరుగుతున్న అన్యాయం కాదా? మాకు జరుగుతున్న అన్యాయాలను అందరి దృష్టికి తీసుకువచ్చి, మాకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్న ఎవరినైనా సరే భయభ్రాంతులకు గురిచేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారి దిష్టిబొమ్మలు దహనం చేస్తాం’’ అని వెంకట్రామిరెడ్డిని సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం హెచ్చరించింది.

ఈ సమస్యలపై పోరాడండి

‘‘ప్రభుత్వం నుంచి మాకు చాలా సొమ్ము రావాల్సి ఉంది. ఉద్యోగులు ఈ ఆర్థిక నష్టాన్ని ఎందుకు భరించాలి? ఒక్కొక్క ఉద్యోగికి లక్షల్లో రావాలి. మీ లాంటి ధనవంతులకు ఇలాంటివి సమస్యలుగా కనిపించకపోవచ్చు. కానీ, ఒక సాధారణ ఉద్యోగి బ్యాంకులకు వడ్డీలు చెల్లిస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నాడు. వీటితో పాటు సర్వీస్‌ సంబంధిత సీరియస్‌ సమస్యలు చాలా ఉన్నాయి. సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని వేడుకుంటున్నాం. అలాగే అనేక మంది రాజకీయ నాయకులు తమ మాటలతో ఉద్యోగ వర్గాలను అవమానిస్తున్నారు. వీరి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు? ఉద్యోగులంతా ఇబ్బందులకు గురవుతుంటే మీరు మాత్రం మీకు నచ్చినట్టు ఎంజాయ్‌ చేస్తున్నారు’’... ఎస్టీ ఉద్యోగులకు వ్యతిరేకంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడిన తర్వాత సచివాలయ ఉద్యోగుల వాట్సాప్‌ గ్రూపుల్లో ఇలా హితవు పలికారు.

వెంకట్రామిరెడ్డీ... ఈ ప్రశ్నలకు బదులేదీ?

ఫైలులో ఏముందో తమకు కూడా తెలియదన్నారు. అలాంటప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ రాసింది అవాస్తవమని ఎలా చెబుతారు?

‘ఆంధ్రజ్యోతి’ ఊహించి వార్త రాసిందని విమర్శించారు. ‘ఆంధ్రజ్యోతి’ వార్త అవాస్తవమైతే ఫైలు బయటపెట్టండి?

డీపీసీ పెట్టే సమయం లేక రిలాక్సేషన్‌ కోసం సీఎం ఆమోదానికి ఫైలు పంపామన్నారు.

జనరల్‌ అభ్యర్థులతో పాటు ప్రమోషన్లకు అర్హత సాధించిన ఎస్టీ, దివ్యాంగుల ఫైళ్లు ఎందుకు పంపలేదు? మీరు జనరల్‌ ఉద్యోగులకే అధ్యక్షుడా? దివ్యాంగులు, బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులు మీకు కనపడరా?

Updated Date - Dec 22 , 2023 | 02:43 AM