జీపీఎస్ బిల్లును అడ్డుకోండి!
ABN , First Publish Date - 2023-09-22T03:47:40+05:30 IST
సీపీఎ్‌సను రద్దు చేస్తామని హామీ ఇచ్చి, మోసం చేసిన జగన్ సర్కార్ ఉద్యోగుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెస్తున్న జీపీఎస్ బిల్లును శాసనసభ, శాసన మండలిలో తిరస్కరించాలని ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీపీఎస్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి
ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డినీ నిలదీత
అమరావతి, విజయవాడ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): సీపీఎ్‌సను రద్దు చేస్తామని హామీ ఇచ్చి, మోసం చేసిన జగన్ సర్కార్ ఉద్యోగుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెస్తున్న జీపీఎస్ బిల్లును శాసనసభ, శాసన మండలిలో తిరస్కరించాలని ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. మూడున్నర లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న ఈ బిల్లును ఆమోదించవద్దని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కోరారు. ఈ బిల్లును వ్యతిరేకించకపోతే.. ఈ సారి ఎన్నికల్లో ఓట్ల కోసం తమ ఇళ్లకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. గురువారం సచివాలయ ప్రాంగణంలో పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్యోగుల సంఘం నేతలు కలిసి వినతిపత్రాలు సమర్పించారు. జీపీఎస్ బిల్లును సభలో ఆమోదించవద్దని కోరారు. వినతిపత్రాలు అందుకున్నవారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, పోతుల సునీత, శ్రీకాంత్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, అనిల్‌కుమార్, ఎంపీ బాలశౌరి తదితరులు ఉన్నారు. సచివాలయ ఆవరణలో జీపీఎస్ బిల్లుపై నిరసన కూడా తెలిపారు. జీపీఎ్‌సను తిరస్కరిస్తున్నామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏపీసీపీఎ్‌సఈఏ అసోసియేట్ అధ్యక్షుడు సి.మరియదాసు మాట్లాడుతూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా సీపీఎస్ ఉద్యోగులపై జీపీఎ్‌సను బలవంతంగా రుద్దాలని చూస్తోందన్నారు. జీపీఎస్ బిల్లును ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యతిరేకించకపోతే.. తమ, స్నేహితుల ఇళ్లకు ఓట్ల కోసం రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట్ల రాజేష్ మాట్లాడుతూ అనేక లోపాలతో ప్రవేశపెడుతున్న జీపీఎస్ బిల్లును ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యతిరేకించాలన్నారు. సంఘ ఉపాధ్యక్షుడు నాపా ప్రసాద్ మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగుల గొంతు కోస్తున్నామని తెలిసినా.. జీపీఎస్ బాగుందని కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం సరికాదన్నారు. కాగా, సీపీఎస్ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూస్తామన్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డిని సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సీపీఎస్ ఉద్యోగులు నిలదీశారు.