బాదుతూనే.. బుకాయింపు!

ABN , First Publish Date - 2023-03-26T03:44:48+05:30 IST

గృహ విద్యుత్తు టారి్‌ఫలో ఎలాంటి మార్పులూచేర్పులూ లేవని.. విద్యుత్తు చార్జీలు పెంచలేదంటూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి నమ్మబలికింది.

బాదుతూనే.. బుకాయింపు!

నాలుగేళ్లలో ఏడుసార్లు 17,723 కోట్ల బాదుడు

ట్రూఅప్‌ బాదుడుకు ఎప్పటికప్పుడు ఆమోదం

జగన్‌ రాకతో ఏటా జనంపై కరెంటు చార్జీల మోత

కానీ, గృహ టారిఫ్‌ పెంచలేదంటూ ఈఆర్‌సీ మోసం!

ఎన్నికల ఏడాదిలో ‘2023-24 టారిఫ్‌’ ప్రకటన

ఎంత చేసినా నిండా మునిగిన డిస్కమ్‌లు

రూ.84,183 కోట్ల అప్పులు.. 29,928 కోట్ల నష్టాలు

స్మార్ట్‌ మీటర్ల విషయంలో ఈఆర్‌సీ ఆదేశాలూ బేఖాతరు

అయినా ఇదేమిటి అని ప్రశ్నించని వైనం

రూ.3,802 కోట్ల ట్రూఅప్‌కు గతనెలలోనే ఆమోదం

ఇవిగాక నెలవారీ ఇంధన చార్జీలు.. ఫిక్స్‌డ్‌ చార్జీలు

అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): గృహ విద్యుత్తు టారి్‌ఫలో ఎలాంటి మార్పులూచేర్పులూ లేవని.. విద్యుత్తు చార్జీలు పెంచలేదంటూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి నమ్మబలికింది. కానీ మూడునెలలకోసారి సర్దుబాటు చేసే ట్రూఅప్‌ చార్జీల భారంపై మాత్రం మాట్లాడలేదు. అంతకంటే..ఘోరంగా.. త్రైమాసిక సర్దుబాబు చార్జీలను ఇప్పుడు ఏ నెలకానెల వడ్డించే విధానాన్ని అమలు చేసేందుకు డిస్కమ్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయాన్ని కూడా ఈఆర్‌సీ వెల్లడించలేదు. అదేవిధంగా..2023-24లో ఎంత మేర ట్రూఅప్‌ చార్జీలు వసూలు చేసే వీలుందోకూడా స్పష్టత ఇవ్వలేదు. ఈ మేరకు శనివారం 2023-24 విద్యుత్తు టారి్‌ఫను మండలి అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి గత మూడేళ్లుగా ఇదే తరహాలో గృహ విద్యుత్తు శ్లాబుల్లో మార్పులు లేకుండా ట్రూఅప్‌ పేరిట డిస్కమ్‌లు దొంగ దెబ్బతీస్తున్నాయి. విద్యుత్తు కొనుగోలు సర్దుబాటు పేరిట ట్రూఅప్‌ చార్జీల భారాన్ని గుంభనంగా ఉంచేసిన ఈఆర్‌సీ, గృహవిద్యుత్తు శ్లాబు మారలేదంటూ యదావిధిగా రాష్ట్ర విద్యుత్తు వినియోగదారులకు నమ్మబలుకుతోంది. మరోవైపు విద్యుత్తు కొనుగోళ్ల వ్యత్యాసం రూ.6000కోట్ల వరకూ ఈ ఏడాది వినియోగదారులపై పడబోతున్నదని ఇంధన రంగ నిపుణులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. కానీ, ట్రూఅప్‌ చార్జీలపై ఏమాత్రమూ మాట్లాడకుండా వచ్చే నెల ఒకటో తేదీ అమలులోనికి వచ్చే కొత్త టారి్‌ఫలో గృహ విద్యుత్తు శ్లాబులలో మార్పులు లేవంటూ ఈఆర్‌సీ పేర్కొంది. మరో 13 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వెలువడిన ఈ ప్రకటన సర్వత్రా విమర్శలకు తావిస్తోంది! ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించిన నాటినుంచీ ట్రూఅప్‌ చార్జీల పేరిట విద్యుత్తు వినియోగదారులను బాదేస్తూనే ఉన్నారు. అదే సమయంలో గృహ విద్యుత్తు చార్జీల టారి్‌ఫలో ఎలాంటి మార్పులూ లేవంటూ బుకాయించేస్తున్నారు. 2014 నుంచి విద్యుత్తు కొనుగోళ్ల వ్యయాలను గత నాలుగేళ్లుగా వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇప్పటికి ఇలా ఏడు దఫాలుగా రూ.17,723 కోట్లను విద్యుత్తు పంపిణీ సంస్థలు వసూలు చేస్తూ వచ్చాయి. శ్లాబులు మార్చకుండానే .. విద్యుత్తు కొనుగోళ్లలో వ్యత్యాసాన్ని సర్దుబాటు చేయడం .. డిపాజిట్లు .. ఇంధన చార్జీల పేరిట ..భారీగా విద్యుత్తు వినియోగదారులపై జగన్‌ సర్కారు దొంగ దెబ్బతీస్తూనే ఉంది.

ఏడు దఫాలుగా..

ప్రభుత్వ కార్యాలయాలు.. పారిశ్రామికవాడలు .. వ్యవసాయం .. ఇతర కమర్షియల్‌ వినియోగదారులందరికీ ప్రస్తుత మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్‌ మీటర్లను 2025మార్చి నెలాఖరు నాటికి బిగించాలని డిస్కమ్‌లకు ఈఆర్‌సీ ఆదేశించింది. పనితీరులో ప్రస్తుత మీటర్లకూ .. ప్రీపెయిడ్‌ మీటర్లకూ పెద్ద వ్యత్యాసమేమీ ఉండదంటూనే ..వాటిని ఎందుకు ఏర్పాటు చేయాలన్న ‘టార్గెట్‌’ను ఈఆర్‌సీ ఇచ్చిందో అర్థం కావడం లేదని విద్యుత్తు రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. పైగా విద్యుత్తు మీటర్ల కోసం ప్రభుత్వం రూ.13,404.53 కోట్లను మంజూరు చేస్తుందని ఈఆర్‌సీ విడుదల చేసిన 2023-24 టారి్‌ఫలో వెల్లడించింది. అయితే.. ఈ మొత్తాన్ని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లేదా రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ల నుంచి రుణంగా తీసుకోవాలని డిస్కమ్‌లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కేబినెట్‌ ఆమోదించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేశాకే స్మార్ట్‌ మీటర్ల కొనుగోలు టెండర్లను పిలవాలంటూ గత ఏడాది డిస్కమ్‌లను ఈఆర్‌సీ ఆదేశించింది. అయితే,రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండానే .. డిస్కమ్‌లు టెండర్లను పిలిచేశాయి. దీనిపై .. డిస్కమ్‌లను ఈఆర్‌సీ నిలదీయలేదు.

ఈఆర్‌సీ చెప్పిందిదే..

2023-24 విద్యుత్తు టారి్‌ఫలో విద్యుత్తు పంపిణీ సంస్థల ఆర్థిక స్థోమతను ఈఆర్‌సీ ప్రస్తావించింది. ‘డిస్కమ్‌లు రూ.84183 కోట్ల రుణభారం, మరో రూ.29,928 కోట్ల నష్టాల్లో ఉంది. కష్టాల్లో ఉన్న డిస్కమ్‌లకు .. ప్రభుత్వం రూ.12,790 కోట్లను సబ్సిడీ కింద అందించేందుకు ముందుకు వచ్చింది. వార్షిక ఆదాయ వ్యయ నివేదికలో డిస్కమ్‌లకు రూ.52,590.70 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా ..కరెంటు విక్రయాల వల్ల 39103.19 కోట్ల మేర విక్రయాల వల్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ తేడా రూ.13,487.57 కోట్లలో రూ.12,790 కోట్లను ప్రభుత్వం భరించేందుకు అంగీకరించింది. మరో రూ.697కోట్లను ఇతర మార్గాల ద్వారా వసూలు చేసుకుంటామని డిస్కమ్‌లు వెల్లడించింది’’ అని ఆ నివేదికలో ఈఆర్‌సీ వివరించింది.

నాలుగేళ్లుగా ఏడు..పే!

2020 ఫిబ్రవరిలో నెలకు 500 యూనిట్లు దాటిన

వినియోగదారులపై 90 పైసల పెంపుతో రూ.1300 కోట్ల భారం...

2020 మే నెలలో కరోనా శ్లాబుల మార్పుతో రూ.1500 కోట్ల భారం...

2021 ఏప్రిల్‌లో కిలోవాట్‌కు రూ.10 పెంచడంతో రూ.2542 కోట్ల భారం...

2014-19 ట్రూఅప్‌ చార్జీల వసూలుతో రూ.3669 కోట్ల భారం...

గత ఏడాది ఏప్రిల్‌లో శ్లాబుల కుదింపు పేరిట రూ.4300 కోట్లు భారం

ఇంధన సర్దుబాటు పేరిట రూ.700కోట్ల భారం..

2021-22 సంవత్సరానికిగాను ఇంధన సర్దుబాటు పేరిట మార్చి నుంచి వసూలు చేసుకునేలా రూ.3802 కోట్ల భారం.....

మొత్తం బాదుడు రూ.17,723 కోట్లు

ఎనర్జీ ఇంటెన్సివ్‌ పరిశ్రమలపై అదనపు భారం

సాధారణ విద్యుత్‌ చార్జీల పెంపు లేదు : ఈఆర్‌సీ

2023-24 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ చార్జీలు పెంచడం లేదని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి వెల్లడించారు. కేవలం ఎనర్జీ ఇంటెన్సివ్‌ పరిశ్రమలకు (ఉత్పత్తి వ్యయంలో విద్యుత్‌ వ్యయం అత్యధికంగా ఉండే పరిశ్రమలు) మాత్రమే కొత్తగా డిమాండ్‌ చార్జీలు విధించినట్టు చెప్పారు. విశాఖపట్నంలో కొత్త విద్యుత్‌ టారిఫ్‌ ఉత్తర్వులను ఆయన విడుదల చేశారు. 2023-24లో రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ సంస్థల ఆదాయం లోటును రూ.10,135 కోట్లుగా నిర్ణయించామని, ఆ మొత్తాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో ఇంటెన్సివ్‌ పరిశ్రమలకు తప్ప మిగిలిన కేటగిరీ వినియోగదారులపై చార్జీల భారం మోపలేదని జస్టిస్‌ నాగార్జునరెడ్డి అన్నారు. ఎనర్జీ ఇంటెన్సివ్‌ పరిశ్రమలనుంచి కిలోవాట్‌కు రూ.475 చొప్పున డిమాండ్‌ చార్జీగా వసూలుతో రూ.300 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని చైర్మన్‌ నాగార్జునరెడ్డి వివరించారు.

Updated Date - 2023-03-26T03:44:48+05:30 IST