ఇళ్ల పనులు మొదలుపెట్టండి!

ABN , First Publish Date - 2023-07-04T03:33:55+05:30 IST

అమరావతిలో పేదలకు సెంటు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వాటిలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలంటూ లబ్ధిదారులపై ఒత్తిడి తేస్తోంది.

ఇళ్ల పనులు మొదలుపెట్టండి!

ఆర్‌5 జోన్‌లో సెంటు స్థలం లబ్ధిదారులపై ఒత్తిడి

సుప్రీం తీర్పు వచ్చేలోపు నిర్మాణాలు మొదలు పెట్టించే యత్నాలు

తుళ్లూరు(తాడికొండ) జూలై 3: అమరావతిలో పేదలకు సెంటు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వాటిలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలంటూ లబ్ధిదారులపై ఒత్తిడి తేస్తోంది. ఈ ఆర్‌5 జోన్‌లో ఇళ్ల స్థలాల పంపిణీ విషయం సుప్రీం కోర్టు నిర్దేశం మేరకు సెంటు స్థలానికి హడావుడిగా పట్టాలు పంపిణీ చేశారు. ఇచ్చిన పట్టాలపై కూడా సుప్రీకోర్టు తుది తీర్పునకు లోబడి లబ్ధిదారులకు హక్కు అనేది నిర్థారణ అవుతుందని వాటిపైనే ముద్రించి ఇచ్చారు. ఈ కేసులో ఈ నెల 11న తీర్పు రానుంది. దానికంటే ముందే లబ్ధిదారులతో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం లబ్ధిదారులపై అధికారులు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. పట్టాలు పొందిన 50 వేల మంది లబ్ధిదారులు తక్షణం ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టాలని పునాదుల కోసం రూ.35 వేలు డ్వాక్రా సంఘాల ద్వారా అప్పుగా ఇప్పిస్తామని చెబుతున్నారు. ఆ తర్వాత రుణంగా రూ.1,80,000 అందుతాయని ఈ రెండు అప్పులను వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కోర్టు తుది తీర్పు ప్రకారమే స్థలాలపై హక్కు అనేది నిర్ధారణ కావాల్సిన వ్యవహారంలో అధికారులు ఇప్పుడెందుకు హడావుడి చేస్తున్నారని లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ కేసులో తీర్పు వచ్చేలోపే లబ్ధిదారులతో పౌండేషన్‌ వేయించి, నిర్మాణ పనులు మొదలయ్యాయి కాబట్టి ఆర్‌5 జోన్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని వాదించేందుకే ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.


Updated Date - 2023-07-04T03:33:55+05:30 IST