Share News

స్తంభించిన రైళ్ల రాకపోకలు

ABN , First Publish Date - 2023-10-30T02:50:19+05:30 IST

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి రైలు ప్రమాదం సంభవించడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

స్తంభించిన రైళ్ల రాకపోకలు

విశాఖపట్నం/గుంటూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి రైలు ప్రమాదం సంభవించడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను మార్గమధ్యలో నిలిపివేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. కొన్ని రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ప్రమాద సమాచారం తెలియగానే సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (నంబరు 17016)ను సత్తెనపల్లిలో నిలిపేశారు. సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (నంబరు 12704)ను నల్లపాడు రైల్వేస్టేషన్‌లో నిలిపేశారు. రూట్‌ ఎప్పటికి క్లియర్‌ అవుతుందో స్పష్టమైన సమాచారం తెలియకపోవడంతో నల్లపాడు, సత్తెనపల్లి స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివిజనల్‌ రైల్వే అధికారులు హుటాహుటిన ఈ రెండు స్టేషన్లకు సిబ్బందిని పంపి ప్రయాణికులకు అవసరమైన ఆహార పదార్థాలు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు మీదుగా భువనేశ్వర్‌, హౌరా వైపు వెళ్లాల్సిన రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. హిరాకండ్‌, భువనేశ్వర్‌, నాగావళి, పూరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. హౌరా, భువనేశ్వర్‌ వైపు నుంచి విశాఖ మీదుగా నడిచే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020), ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (12703), టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ (18189), హౌరా-బెంగళూరు దురంతో ఎక్స్‌ప్రెస్‌ (12245)లను మళ్లింపు మార్గంలో నడిపిస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

పలు రైళ్లు రద్దు

విశాఖ-రాయపూర్‌-విశాఖ మధ్య రాకపోకలు సాగించే 08527, 08528 రైళ్లను సోమవారం రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. అలాగే విశాఖ-రాయగడ, విశాఖ-భువనేశ్వర్‌, హౌరా వైపు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి రాయగడకు బయలుదేరి వెళ్లాల్సిన రాయగడ ఎక్స్‌ప్రె్‌సను రీషెడ్యూల్‌ చేశారు.

Updated Date - 2023-10-30T02:50:19+05:30 IST