నైరుతి రుతుపవనాలు మరిన్ని రోజులు

ABN , First Publish Date - 2023-09-22T03:46:41+05:30 IST

నైరుతి రుతుపవనాలు అనుకున్నదాని కంటే మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. రుతుపవనాల ఉపసంహరణలో జాప్యం వల్ల ఈ పరిస్థితి నెలకొంది.

నైరుతి రుతుపవనాలు మరిన్ని రోజులు

ఉపసంహరణకు అననుకూలం

దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు

విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు అనుకున్నదాని కంటే మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. రుతుపవనాల ఉపసంహరణలో జాప్యం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దేశంలో అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కువ ప్రాంతాల్లో తేమగాలులు కొనసాగడంతో నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల వాతావరణం ఏర్పడలేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఉన్నతాఽధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సాధారణంగా జూన్‌ ఒకటో తేదీన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు సెప్టెంబరు 17 నుంచి ఉపసంహరణ ప్రారంభించాలి. ఒక్కోసారి రుతుపవనాల రాక, ఉపసంహరణలో జాప్యం ఏర్పడుతుంటుంది. ఈ ఏడాది ఏడు రోజులు ఆలస్యంగా అంటే జూన్‌ 8న కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు జూలై రెండో తేదీ నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. అయితే ఎల్‌నినో ప్రభావంతో జూన్‌, ఆగస్టు నెలల్లో వర్షాభావం కొనసాగింది. జూన్‌లో సాధారణం కంటే ఏడు శాతం, ఆగస్టులో 36 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జూలైలో మాత్రం సాధారణం కంటే 13 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టులో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడడంతో ఖరీఫ్‌ సీజన్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఈనెల తొలివారంలో పుంజుకున్న వర్షాలు ఇంకా కొనసాగడంతో సెప్టెంబరులో సాధారణంలేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

కోస్తా, రాయలసీమకు వర్షసూచన

నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులతో గురువారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో కోస్తా లో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Updated Date - 2023-09-22T03:46:41+05:30 IST