గిరిజనుల నోట్లో మట్టి
ABN , First Publish Date - 2023-04-03T02:22:24+05:30 IST
ఏళ్ల తరబడి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై పెద్దల కన్నుపడింది. వారికి అధికార యంత్రాంగం చక్కగా సహకరించింది.
దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములపై పెద్దల కన్ను
రెవెన్యూ అధికారుల సహకారం
37 ఎకరాలు భూస్వాముల పేరిట రికార్డుల్లో నమోదు
వ్యాపారులకు సైతం విక్రయం
భూములు ఖాళీ చేయాలని గిరిజనులపై వ్యాపారుల ఒత్తిడి
ఇది తప్ప తమకు మరో ఆధారం లేదంటూ ఆదివాసీల గగ్గోలు
ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు
చీడికాడ(అనకాపల్లి జిల్లా), ఏప్రిల్ 2: ఏళ్ల తరబడి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై పెద్దల కన్నుపడింది. వారికి అధికార యంత్రాంగం చక్కగా సహకరించింది. ఇంకేముంది ఆ పేద గిరిజనుల సాగులో ఉన్న భూములు బడా భూస్వాముల పేరిట రికార్డుల్లోకి ఎక్కాయి. ఆ తర్వాత మరొకరికి విక్రయాలు జరిగిపోయాయి. ఇప్పుడు ఆ భూములు ఖాళీచేసి వేరే చోటకు వెళ్లాలంటూ పెత్తందారులు ఒత్తిడి తెస్తుండడంతో గిరిజనులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోనాం పంచాయతీ శివారులో గుంటి, కొత్తవీధి గ్రామాలున్నాయి. గుంటిలో 7 కొండదొర గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. అదే గ్రామానికి ఆనుకుని ఉన్న కొత్తవీధి గ్రామంలో 9 ఆదిమజాతి గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంతా సర్వే నంబరు 289లో ఉన్న 37 ఎకరాల కొండ భూములను 70 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. ఈ భూములపై తమకు హక్కులు కల్పించాలని, తమ పేర్లు రెవెన్యూ రికార్డుల్లో పొందుపరచాలని ప్రభుత్వానికి, రెవెన్యూ అధికారులకు వినతులు సమర్పించారు. తమ తాతతండ్రుల నుంచి సాగు చేసుకుంటున్న భూములు తమవేకదా అన్న ధీమాతో ఉండిపోయారు. ఇటీవల భూములు విలువ పెరగడంతో పరిసర ప్రాంతానికి చెందిన కొందరు భూస్వాములు అవి తమ పూర్వీకులవని, తమకే చెందుతాయని పేర్కొంటూ తెరపైకి వచ్చారు. గతేడాది జూన్‌లో మండలానికి వచ్చిన ఓ రెవెన్యూ అధికారిని కలిసి సహకారం కోరారు. ఆయన కోనాం ప్రాంతానికి చెందిన భూస్వాముల పేరిట ఆన్‌లైన్‌లో ఆ 37 ఎకరాలు నమోదుచేసి వాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు రావడంతో భూస్వాములు వాటిని వేరే వారికి విక్రయించారు. వారి పేరిట రెవెన్యూ రికార్డుల్లో మార్పులు కూడా చేశారు. ఆ భూములు కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు గిరిజనులను ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, తమ భూములు లాక్కోవద్దని, తమకు ఆ భూములే ఆధారమని కనిపించిన వారినల్లా గిరినజనులు వేడుకుంటున్నారు. మరోవైపు.. గిరిజన పక్షపాతిగా చెప్పుకొనే ప్రభుత్వం తమకు హక్కు కల్పించాలని ఇక్కడివారు డిమాండ్ చేస్తున్నా స్పందించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ భూములపై సమగ్ర విచారణ జరిపించి హక్కులు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.
ఈ భూమిని వదులుకోం!
మా పెద్దల నుంచి ఈ భూముల్లోనే ఉంటున్నాం. వీటినే సాగుచేస్తున్నాం. ఇన్నాళ్లకు ఎవరో వచ్చి ఈ భూమి ఇచ్చేయాలని అంటున్నారు. మా ప్రాణాలు పోయినా ఈ భూమిని వదులుకునేది లేదు. ప్రభుత్వం స్పందించి హక్కు కల్పించాలి.
- కోన చినదేముడు. గుంటి గ్రామం
మాకు హక్కు కల్పించండి
70 ఏళ్లకుపైగానే ఈ భూములు సాగు చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు ఈ భూమి మీదికాదు అంటున్నారు. భూమిని నమ్ముకున్న మాకు అన్యాయం చేయవద్దు. ప్రభుత్వం మాకు న్యాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలి.
- కాశి దేముడు, గుంటి గ్రామం
ఈ భూమినే నమ్ముకుని జీవిస్తున్నాం
మా తాత తండ్రుల నుంచి ఈ భూమిని నమ్ముకుని సాగు చేసుకుంటున్నాం. ఇన్నేళ్ల తరువాత ఎవరో వచ్చి ఈ భూములు మీవి కావని అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి. - వంతాల చిన్నాలమ్మ, కొత్తవీధి
ఈ భూమి తప్ప మరో ఆధారం లేదు
మా చిన్నతనం నుంచి ఈ భూమిలోనే బతికాం. ఈ భూమిలోనే తిండిగింజలు పండించుకుని జీవిస్తున్నాం, మాకు ఇది తప్ప.. మరో ఆధారం లేదు. ఇప్పుడు ఎవరెవరో వచ్చి భూములు విడిచివెళ్లాలని బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి.
- వంతాల కుమారి, కొత్తవీధి