పుస్తకంతోనే సమాజ నిర్మాణం
ABN , Publish Date - Dec 29 , 2023 | 03:24 AM
నూతన సమాజ నిర్మాణం కేవలం పుస్తకంతోనే సాధ్యమవుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అభిప్రాయపడ్డారు.
దేశ భాషల్లో తెలుగే అతి పెద్దది.. ప్రమాణాలు కూడా అత్యధికమే
కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ ప్రశంసలు
బెజవాడలో బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభం
విజయవాడ, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నూతన సమాజ నిర్మాణం కేవలం పుస్తకంతోనే సాధ్యమవుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అభిప్రాయపడ్డారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో గురువారం ఆయన 34వ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘దేశంలో ఉన్న భాషలన్నింటిలో తెలుగు అతిపెద్ద భాష. వ్యక్తుల ఎదుగుదలలో పుస్తకాలు మెట్లు మాదిరిగా ఉంటాయి. ఇంటికి మెట్లు ఉన్నట్టుగానే ప్రతి ఇంట్లోనూ పుస్తకాలు ఉండాలి. తెలుగు సాహిత్యంలో అత్యధికంగా ఉన్నత ప్రమాణాలు ఉంటాయి’’ అని మాధవ్ కౌశిక్ తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’ ఢిల్లీ బ్యూరో ప్రతినిధి ఎ.కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రంథాలయాల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల కోసం మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు గూగుల్, ఇంటర్నెట్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారన్నారు. పుస్తక పఠనాన్ని, గ్రంథాలయాల అభివృద్ధిని ఒక ఉద్యమంగా నిర్వహించాలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాస్, కవి, రచయిత శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, పుస్తక మహోత్సవం సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రతినిధులకు ఫోన్‌లో సందేశం ఇచ్చారు. ఏటా క్రమం తప్పకుండా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్న ప్రతినిధులను అభినందించారు.