Smart Meter Charge : వినియోగదారులపై ‘స్మార్ట్’ చార్జ్
ABN , First Publish Date - 2023-12-11T03:14:04+05:30 IST
విద్యుత్తు వినియోగదారులపై స్మార్ట్ మీటర్ల చార్జ్ వేసేందుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి. 2024-25 నుంచి 2028-29 బహుళ ఆర్థిక సంవత్సరాల వార్షిక వాస్తవ ఆదాయ నివేదిక (ఏఆర్‌ఆర్)లను
93 నెలల పాటు బాదుడుకు సిద్ధం
ఈఆర్‌సీకి బహుళ వార్షిక ఏఆర్‌ఆర్‌లు
తొలిసారిగా సమర్పించిన డిస్కమ్‌లు
వాటిని స్వీకరించడంపై నిపుణుల విస్మయం
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు వినియోగదారులపై స్మార్ట్ మీటర్ల చార్జ్ వేసేందుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి. 2024-25 నుంచి 2028-29 బహుళ ఆర్థిక సంవత్సరాల వార్షిక వాస్తవ ఆదాయ నివేదిక (ఏఆర్‌ఆర్)లను ఈఆర్‌సీకి గతనెల 30న గుంటూరులో సమర్పించాయి. ఈ విధంగా బహుళ వార్షిక ఏఆర్‌ఆర్‌లను సమర్పించడం ఇదే ప్రథమం. వాస్తవానికి వార్షిక ఏఆర్‌ఆర్‌ల స్థాయి నుంచి మూడు నెలలకోసారి వాస్తవ వ్యయ నివేదికలను సమర్పించే విధానాన్ని కేంద్ర విద్యుత్తు సంస్థ తీసుకొచ్చింది. ఇది కూడా కనుమరుగై ఏ నెలకానెల వాస్తవ వ్యయ నివేదికలు సమర్పించే విధానం అమలులోకి వచ్చింది. ఇలాంటి తరుణంలో ఏకంగా ఐదేళ్ల ఏఆర్‌ఆర్‌లను డిస్కమ్‌లు ఒకేసారి సమర్పించడం, వాటిని ఈఆర్‌సీ స్వీకరించడంపై విద్యుత్తురంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డిస్కమ్‌లు అందించిన ఐదేళ్ల ఏఆర్‌ఆర్‌లలో కొన్ని అంశాలు ఇవీ... గృహాలకు బిగించే స్మార్ట్ మీటర్ల వ్యయం రూ.1,657.66 కోట్లుగా ఏపీఎస్పీడీసీఎల్ పేర్కొంది. ఆర్‌డీఎ్‌సఎస్ కింద కేంద్రం నుంచి రూ.248 కోట్లు సబ్సిడీ వస్తుందని వెల్లడించింది. మిగిలిన రెండు డిస్కమ్‌లు దీన్ని ప్రస్తావించలేదు. ఈ లెక్కల ప్రకారం సింగిల్ ఫేజ్ మీటరు వ్యయం రూ.8,927.95, త్రీఫేజ్ మీటరుకు రూ.17,286.20, ఎల్‌టీ కమర్షియల్ మీటరుకు రూ.28,132.50, హెచ్‌టీ మీటరుకు రూ.39,693.09, త్రీఫేజ్ డీటీ మీటరుకు రూ.27253.55, త్రీఫేజ్ ఫీడరు మీటరు వ్యయం రూ.48529.05గా ఖరారు చేశారు. స్మార్ట్ మీటరు బిగించిన తర్వాత 93నెలల పాటు సింగిల్ ఫేజ్ మీటరుకు నెలకు రూ.96, త్రీఫేజ్ మీటరుకు రూ.185.87, ఎల్‌టీ కమర్షియల్ మీటరుకు 313.25, హెచ్‌టీ మీటరుకు రూ426.91, త్రీఫేజ్ డీటీ మీటరుకు రూ.293.06, త్రీఫేజ్ ఫీడరు మీటరుకు రూ.521.82 చొప్పున వసూలు చేస్తారు. మరోవైపు డిస్కమ్‌లు మరిన్ని అప్పులు చేసేందుకు సిద్ధమయ్యా యి. 2025లో రూ.2,640.31 కోట్లు, 2026లో 6,053 కోట్లు, 2027లో 9,564 కోట్లు, 2028లో రూ.10,754 కోట్లు, 2029లో రూ.11,678 కోట్ల మేర రుణాలకు ఈఆర్‌సీ ఆమోదం కోసం ఏఆర్‌ఆర్‌లు సమర్పించాయి.
రాష్ట్రంలో విద్యుత్తు లోటు ఇలా...
2024లో 3,099 ఎంయూ, 2025లో 4,279 ఎంయూ, 2026లో 5,934 ఎంయూ, 2027లో 1,909 ఎంయూల మిగులు విద్యుత్తు కాస్తా 2029లో 113 ఎంయూ లోటు ఉంటుంది. అదేవిధంగా 2030లో 1,197 ఎంయూ, 2031లో 2,366 ఎంయూ, 2032లో 3,513 ఎంయూ, 2033లో 4,860 ఎంయూ, 2034లో 6,227 ఎంయూ లోటు ఉంటుందని డిస్కమ్‌లు అంచనా వేశాయి.
స్మార్టు మీటర్లు సీమ రైతుకు ఉరితాళ్లు
రాయలసీమ సమస్యలపై జగన్‌కు అవగాహన లేదు: తులసిరెడ్డి
నీటి ప్రాజెక్టులపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: లక్ష్మణరెడ్డి
తిరుపతి(విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 10: వ్యవసాయ మోటార్లకు స్మార్టు మీటర్లు పెడితే రాయలసీమ రైతులకు ఉరితాళ్లుగా మారతాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ ఎన్.తులసిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మోటారు బావులుంటే, అందులో 12 లక్షలు రాయలసీమకు చెందినవని తెలిపారు. ఏపీ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాయలసీమ అభివృద్ధి-సమస్యలపై ఆదివారం తిరుపతిలో చర్చా గోష్ఠి నిర్వహించారు. తులసిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ సమస్యలపై సీఎం జగన్‌కు అవగాహన, అభివృద్ధి పట్ల శ్రద్ధ కనిపించడం లేదన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్లే రాయలసీమ అభివృద్ధి కావడంలేదని తెలిపారు. వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ 1956 నుంచి ప్రభుత్వాలు రాష్ట్ర బడ్జెట్‌లో 10 శాతం నిధులను నీటి పారుదల ప్రాజెక్టులకు కేటాయించి ఖర్చు చేశాయని, ప్రస్తుత ప్రభుత్వం ఈ ఐదు బడ్జెట్లలో 5శాతం లోపే నిధులు కేటాయించి 3శాతమే ఖర్చు చేసిందని వివరించారు. ప్రభుత్వం తీరుతోనే రాయలసీమ మరింత కరువు ప్రాంతంగా మారిందన్నారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి.. అమలు చేయడానికి రాజకీయాలకు అతీతంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి సీమ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రాయలసీమలో నాపరాయి, సిమెంటు ముడి పదార్థాలైన లైమ్‌స్టోన్ తదితరాల ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు కలుగుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఓబులేసు అన్నారు.