ప్రముఖ కవి జావేద్‌ అక్తర్‌కు సినారె పురస్కారం

ABN , First Publish Date - 2023-07-10T03:39:41+05:30 IST

ప్రముఖ హిందీ కవి, సినీ రచయిత, గీతకర్త జావేద్‌ అక్తర్‌ 2023 సంవత్సరానికి గాను డా.సి.నారాయణరెడ్డి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు.

ప్రముఖ కవి జావేద్‌ అక్తర్‌కు సినారె పురస్కారం

రవీంద్రభారతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ హిందీ కవి, సినీ రచయిత, గీతకర్త జావేద్‌ అక్తర్‌ 2023 సంవత్సరానికి గాను డా.సి.నారాయణరెడ్డి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు సుశీల నారాయణరెడ్డి ట్రస్టు ఓ ప్రకటన చేసింది. హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో ఈ నెల 29న జరగనున్న డా.సి.నారాయణరెడ్డి 92వ జయంతి ఉత్సవంలో జావేద్‌కు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. పురస్కారం కింద రూ.5 లక్షల నగదు, ప్రశంసా పత్రం, శాలువాతో సత్కరిస్తారు. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ చిత్రాలైన జంజీర్‌, దీవార్‌, షోలే, హాథీ మేరే సాథీ, సీతా ఔర్‌ గీతా, డాన్‌, త్రిశూల్‌ వంటి సినిమాలకు సలీంతో కలిసి జావేద్‌ రచన చేశారు. సాగర్‌, మిస్టర్‌ ఇండియా, బేతాబ్‌, అర్జున్‌, లక్ష్య వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలకు స్వతంత్ర రచన చేశారు. ఐదుసార్లు జాతీయ ఉత్తమ గీత రచయిత పురస్కారాన్ని అందుకున్న జావేద్‌.. ఉత్తమ గీత రచయితగా ఆరు సార్లు, స్ర్కిప్ట్‌ రైటర్‌గా నాలుగు సార్లు ఫిలింఫేర్‌ అవార్డులు పొందారు.

Updated Date - 2023-07-10T03:39:41+05:30 IST