Share News

ష్‌.. గప్‌చుప్‌!!

ABN , First Publish Date - 2023-11-21T05:24:48+05:30 IST

ఘోర రైలు ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నా రైల్వే శాఖ కారణాలను బయటపెట్టడం లేదు.

ష్‌.. గప్‌చుప్‌!!

రైలు ప్రమాదాలపై మూగనోము

విజయనగరంలో రాయగడ ఘోరం

జరిగి 3 వారాలైనా కారణాలపై గోప్యత

విచారణ కమిషనర్‌ నివేదిక మాటేంటి?

ఆరేళ్ల కిందట హిరాఖండ్‌ ప్రమాదం

దానిపైనా అందని ఎంక్వైరీ కమిషన్‌ రిపోర్ట్‌

లోపాలు బయటపెట్టని అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఘోర రైలు ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నా రైల్వే శాఖ కారణాలను బయటపెట్టడం లేదు. ప్రమాదం జరిగిన ప్రతిసారీ అత్యున్నత స్థాయి విచారణ పేరుతో హడావుడి చేయడం, తర్వాత ఆ విషయం పక్కన పెట్టడమే ఆనవాయితీగా వస్తోంది. భారీ ప్రమాదానికి దారితీసిన కారణాలు, బాధ్యులు, వ్యవస్థలో లోపాలు వెల్లడించడం లేదు. గత నెల 29వ తేదీ రాత్రి విజయనగరం జిల్లా కంటకాపల్లి స్టేషన్‌ సమీపాన జరిగిన ప్రమాదం(రాయగడ పాసింజర్‌)లో 14 మంది చనిపోయారు. మరో 70 మంది వరకు గాయపడ్డారు. కొత్తగా ప్రవేశ పెట్టిన ఆటోమేటిక్‌ సిగ్నల్స్‌ పనిచేస్తున్న మార్గంలో గ్రీన్‌సిగ్నల్‌ లేకుండానే గంటకు 85 కిలో మీటర్ల వేగంతో రైలును నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిని ‘ఓవర్‌ షూటింగ్‌’గా అధికారులే ప్రకటించారు. అయితే, ఆ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా సిగ్నల్స్‌ సరిగా పనిచేయడం లేదని, అందుకే దానికి ముందు వెళ్లిన పలాస పాసింజర్‌ అక్కడ ఆగి ఉందని రైల్వే సిబ్బంది చెప్పుకొచ్చారు. ఇక్కడ ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ నడిపే టెలీ కమ్యూనికేషన్స్‌ వ్యవస్థ తప్పా? మానవ తప్పిదమా? ఇంకేమైనానా? అనే కారణాలు వెల్లడి కావలసి ఉంది. ఏం జరిగిందో చెప్పాల్సిన ఆ రైలు లోకో పైలట్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కూడా మరణించారు. వారు చనిపోయారు కాబట్టి.. మానవ తప్పిదం వల్లనే రాయగడ ఘటన జరిగిందని చెబుతున్నారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సేఫ్టీ కమిషనర్‌ ప్రణజీవ్‌ సక్సేనా వచ్చి మూడు రోజులు ఇక్కడే ఉండి సుమారు 50 మందిని విచారించి వెళ్లారు. అయితే, మూడు వారాలైనా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఆరేళ్ల నాటి ప్రమాదమూ అంతే!!

తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో 2017లో పార్వతీపురం సమీపాన కూనేరు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జనవరి 17న రాత్రి జగదల్‌పూర్‌ నుంచి బయలుదేరి భువనేశ్వర్‌ వెళుతున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రాయగడ స్టేషన్‌ దాటాక రాత్రి 11 గంటల సమయంలో కూనేరు వద్ద పట్టాలు తప్పింది. ఇంజన్‌ సహా తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో 41 మంది చనిపోయారు. మరో 70 మంది గాయపడ్డారు. రైలు పట్టా విరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నందున వారు ఆ పనిచేసి ఉంటారని అనుమానించారు. కానీ, ఈ ప్రమాదానికి అరగంట ముందు మరో రైలు ఆ మార్గంలో వెళ్లిందని, ఆ కొద్ది సమయంలో అలాంటి చర్యకు పాల్పడే అవకాశం లేదని తేల్చారు. మావోయిస్టులు కూడా తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. రైలు పట్టాలు సంకోచ వ్యాకోచాలకు గురవుతాయని, ఆ క్రమంలో పట్టా విరిగిపోయి ఉంటుందన్నారు. అదేవిధంగా పట్టా విరిగిన సంగతి గుర్తించాక లోకో పైలట్‌ సడన్‌గా బ్రేక్‌ వేశారని, దాంతో కుదుపులు వచ్చి కోచ్‌లు ఒక దానిపై మరొకటి ఎక్కేశాయని, అలా చేయకుండా ఉండాల్సిందనే వాదనలు వినిపించాయి. అప్పుడు కూడా రైల్వే సేఫ్టీ కమిషనర్‌ విచారణకు వచ్చారు. విరిగిపోయిన రైలు పట్టా ముక్కలు సేకరించారు. మొత్తం 38 మందిని విచారించి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. ఆ తరువాత దీనిపై జాతీయ పరిశోధన సంస్థ(ఎన్‌ఐఏ) కూడా విచారణ చేసింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదానికి కారణం ఏమిటి? తప్పు ఎవరిది? అనే విషయాలు బయటపెట్టలేదు.

లోపాలు చెప్పనే చెప్పరు

దేశవ్యాప్తంగా దశలవారీగా ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను అమలు చేస్తున్నారు. బహనగర్‌ బజార్‌ స్టేషన్‌ వద్ద కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో 294 మంది చనిపోయారు. సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపం వల్ల రైలు ట్రాక్‌ మారి లూప్‌ లైన్‌లోకి వెళ్లి అక్కడ ఆగి ఉన్న మరో రైలును ఢీకొట్టింది. ఇది అతిపెద్ద ప్రమాదం. సిగ్నలింగ్‌ వ్యవస్థను టాంపరింగ్‌ చేశారనే వార్తలు వచ్చాయి. అలా జరగడానికి ఆస్కారమూ ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. కొందరిని సస్పెండ్‌ చేశారు. అయితే కారణాలు ఏమిటనేది వెల్లడించలేదు. మొత్తంగా రైలు ప్రమాదాల వెనుక ఏం జరుగుతోందనే విషయంలో ఆ శాఖ ‘ష్‌.. గప్‌చుప్‌’ అనే పద్ధతిని అవలంభిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2023-11-21T05:24:48+05:30 IST