దివ్యాంగుడికి ఎస్‌ఐ చిత్రహింసలు
ABN , First Publish Date - 2023-11-11T04:56:12+05:30 IST
ఎస్‌ఐ వేధింపులు, చిత్రహింసలు భరించలేక ఓ దివ్యాంగ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు
బాబుకు మద్దతుగా అతడి తండ్రి పోస్టు పెట్టడమే నేరం
బూతులు తిడుతూ పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త
ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు
తండ్రి దొరకలేదని కొడుక్కి చిత్రహింసలు
కొల్లూరు, నవంబరు 10: ఎస్‌ఐ వేధింపులు, చిత్రహింసలు భరించలేక ఓ దివ్యాంగ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం కోళ్లపాలెంకు చెందిన మేళా శివరామకృష్ణ... చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన సందర్భంగా న్యాయమే గెలిచిందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. తిప్పలకట్టకు చెందిన వైసీపీ కార్యకర్త పెద్దపల్లి యశ్వంత్ ఆ పోస్టుపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో గత నెల 31న శివరామకృష్ణ.. జయరావు, మేరుగు కిశోర్‌లతో కలిసి తిప్పలకట్ట గ్రామానికి వెళ్లి యశ్వంత్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని మంత్రి నాగార్జున దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని సూచించారు. దీంతో కోళ్లపాలేనికి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలు తనపై హత్యాయత్నం చేశారంటూ కొల్లూరు పోలీ్‌సస్టేషన్‌లో యశ్వంత్ ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ రాజ్యలక్ష్మి వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గురూ అందుబాటులో లేకపోవడంతో కిశోర్ కుమారుడు, దివ్యాంగుడైన కిరణ్‌పాల్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చి ఎస్‌ఐ బండ బూతులు తిడుతూ.. చిత్రహింసలు పెట్టారు. నిన్ను కూడా జైలుకు పంపిస్తానంటూ బెదిరించారు. అంతేగాకుండా రేపు మీ తల్లిని కూడా స్టేషన్‌కు తీసుకురావాలని ఆదేశించారు. దీంతో మనస్తాపం చెందిన దివ్యాంగుడు గురువారం కోళ్లపాలెంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు తొలుత రేపల్లెకు ఆ తర్వాత గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా, బాధితుడిని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పరామర్శించారు.