సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మృతి
ABN , First Publish Date - 2023-08-18T03:45:35+05:30 IST
సీనియర్ జర్నలిస్టు చిర్రావూరి వెంకట మురళీ కృష్ణారావు(64) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్, గోపన్నపల్లి జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు.
చంద్రబాబు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ సంతాపం
హైదరాబాద్ సిటీ, న్యూఢిల్లీ, రాయదుర్గం, ఆగస్టు17 (ఆంధ్రజ్యోతి): సీనియర్ జర్నలిస్టు చిర్రావూరి వెంకట మురళీ కృష్ణారావు(64) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్, గోపన్నపల్లి జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. ఏపీలోని ఏలూరుకు చెందిన సీహెచ్‌ఎంవీ కృష్ణారావు అక్కడి సీఆర్ రెడ్డి కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పాత్రికేయ రంగంలో అడుగుపెట్టారు. 47 ఏళ్ల కెరీర్‌లో ఈనాడు, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తదితర తెలుగు, ఆంగ్ల పత్రికల్లో పనిచేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణ రెసిడెంట్ ఎడిటర్‌గా 2019లో పదవీ విరమణ పొందారు. భారీ నీటిపారుదల, చట్టసభల రిపోర్టింగ్‌లో సాధికారత కలిగిన కృష్ణారావును సమకాలీన పాత్రికేయులు చాలా మంది పెద్దబాబాయి అని పిలుచుకుంటారు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు సంతానం ఉన్నారు. కృష్ణారావు మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తమ సంతాపం తెలియజేశారు. కృష్ణారావు ఇక లేరన్న వార్త తనకు దిగ్ర్భాంతి కలిగించిందని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కృష్ణారావు అంత్యక్రియలు రాయదుర్గం మహాప్రస్థానంలో శుక్రవారం ఉదయం 10గంటలకు నిర్వహిస్తామని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.