Share News

పెన్షన్‌తో పాటు నా లేఖ చేరవేయండి

ABN , Publish Date - Dec 29 , 2023 | 03:16 AM

సామాజిక పెన్షన్‌తోపాటు తన తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

పెన్షన్‌తో పాటు నా లేఖ చేరవేయండి

నా వీడియో సందేశం కూడా.. కలెక్టర్లకు సీఎం జగన్‌ ఆదేశం

1 నుంచి 8 వరకు పింఛన్ల పంపిణీ

3న కాకినాడలో నేనూ పాల్గొంటా.. 19న అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

23 నుంచి 31 వరకు ఆసరా.. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు చేయూత

వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వెల్లడి

అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సామాజిక పెన్షన్‌తోపాటు తన తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. తానిచ్చే వీడియో సందేశాన్ని కూడా వారికి చేరవేయాలని సూచించారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, అంబేడ్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవం తదితర అంశాలపై కలెక్టర్లతో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘జనవరి 1 నుంచి పెన్షన్‌ కానుకను రూ.3 వేలకు పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నాం. జనవరి 1 నుంచి 8వ తేదీ వరకు పెన్షన్ల పెంపు కార్యక్రమం జరుగుతుంది. నేను కూడా 3వ తేదీన కాకినాడలో పాల్గొంటున్నాను. రెండో కార్యక్రమం.. జనవరి 19న అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. మూడో కార్యక్రమం ఆసరా జనవరి 23 నుంచి 31 వరకు జరుగుతుంది. నాలుగోది చేయూత ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు కొనసాగుతుంది. అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో మరలా రీవెరిఫికేషన్‌ చేసి, వారికి పథకాలు వర్తింపజేసే బై యాన్యువల్‌ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగేలోపే వెరిఫికేషన్‌ పూర్తిచేసిన దాదాపు 1.17 లక్షల పెన్షన్లు ఒకటో తేదీ నుంచే ఇస్తారు. అక్కచెల్లెమ్మలకు ఆసరా కోసం మూడు విడతలుగా ఇప్పటికే రూ.19.195 కోట్లు ఇచ్చాం.. నాలుగో విడతగా చివరి వాయిదా కింద సుమారు రూ.6,400 కోట్లు ఇస్తున్నాం’ అని తెలిపారు. పెన్షన్‌ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాధలను వీడియోల రూపంలో పంపాలని సీఎం ఆదేశించారు. ఇలా పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి బహుమతులు ఇస్తామని చెప్పారు.

Updated Date - Dec 29 , 2023 | 03:16 AM