సమస్యలొదిలేసి ఏమిటీ స్వామిభక్తి?

ABN , First Publish Date - 2023-06-01T05:01:35+05:30 IST

ప్రభుత్వం నోరు తెరిచి సమాధానం ఇవ్వకముందే....తమ నోరు మూయించే పద్ధతుల్లో వ్యవహరిస్తున్న సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఉద్యోగులు నిరసనకు సిద్ధమవుతున్నారు. ఆయన తీరుపై సచివాలయ ఉద్యోగులు

సమస్యలొదిలేసి ఏమిటీ  స్వామిభక్తి?

వెంకట్రామిరెడ్డిపై సచివాలయ ఉద్యోగులు గరంగరం

సమస్యలపై కరపత్రాల పంపిణీకి సిద్ధం

అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నోరు తెరిచి సమాధానం ఇవ్వకముందే....తమ నోరు మూయించే పద్ధతుల్లో వ్యవహరిస్తున్న సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఉద్యోగులు నిరసనకు సిద్ధమవుతున్నారు. ఆయన తీరుపై సచివాలయ ఉద్యోగులు గరంగరంగా ఉన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం మానేసి....ఏమిటీ స్వామి భక్తి అని సంఘటితంగా నిలదీయాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనికోసం ’ఉద్యోగులు, సమస్యలు– సంఘ బాధ్యతలు’ అంటూ ఒక కరపత్రం కూడా సిద్ధం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్థిక, ఆర్థిక ఆర్థికేతర సమస్యలను ఈ కరపత్రంలో ప్రస్తావించినట్లు తెలిసింది. సచివాలయంలోని ప్రతి ఉద్యోగిని వారు పని చేసే స్థానాల వద్దకు వెళ్లి కలుసుకుని కరపత్రం ఇస్తారని చెబుతున్నారు. ‘మన సమస్యలపై సంఘ అధ్యక్షుడిని ప్రశ్నించడానికి సంఘటితంగా ముందుకు వెళ్దాం రండి’ అంటూ ఈ సందర్భంగా ఉద్యోగులను కోరనున్నట్లు తెలిసింది. అప్సా అధ్యక్షుడికి తన బాధ్యతలు ఏంటో గుర్తు చేయాల్సిన సమయం వచ్చిందని పలువురు ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేసింది, ఉద్యోగులకు ఏం చేయలేదు అనే అంశాలను ఆ కరపత్రంలో పొందుపరిచారు. సచివాలయ సంఘం తరపున ఓడీ సౌకర్యం తీసుకుంటూ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా, పరిష్కరించకుండా బయట సమస్యలు పరిష్కరిస్తామని తిరగడమేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ప్రతినిధిగా వారి సంక్షేమం కోసం పని చేయాల్సింది పోయి సమస్యలన్నీ తీరిపోయాయని మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వారం అంటే ఎన్నేళ్లు?

అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ పునరుద్ధరిస్తామని సీఎం జగన్‌ గతంలో ప్రతపక్షనేతగా ఉన్నప్పుడు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ రాష్ట్రంలో మాత్రం సీపీఎస్‌ రద్దు చేయలేదు. వీటితోపాటు ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, తీర్చాల్సిన సమస్యలు అనేకం కరపత్రంలో ప్రస్తావించారు. సాధారణ ఎన్నికలకు కొన్ని నెలల కాలపరిమితే ఉన్నందున ఇప్పటికైనా అప్సా అధ్యక్షుడు మేలుకుని ఎన్నికల కోడ్‌ వచేలోపే ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం వద్ద ప్రస్తావించి పరిష్కారం కోసం ప్రయత్నించాలని కోరుతున్నారు. ప్రభుత్వం బాకా ఊదడం మానుకోవాలని మరీ మరీ ఆయనకు సూచిస్తున్నారు.

ఇవి సమస్యలు కాదా?

● రెండు డీఏలకు సంబంధించిన 60 నెలల బకాయిలు ఓపీఎస్‌ ఉద్యోగుల ఖాతాల్లోకి జమకాలేదు. టెక్నికల్‌ సమస్య పేరుతో ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి వెనక్కి తీసుకున్న నగదును ఇంతవరకు తిరిగి జమచేయలేదు.

● 5 డీఏల బకాయిలను (2029 జూలై నుంచి 2021 జూలై వరకు), ధరల పెరుగుదలను అధిగమించడానికి ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సిన డీఏలను విడుదల చేయకుండా పేరబెట్టి 2022 జనవరిలో 11వ పీఆర్సీలో వాటిని కలిపేశారు. వాటిని చూపించి మీ జీతం పెరిగిందా లేదా చూసుకోండి అని చెబుతున్నారు. ఐదు డీఏ (54 నెలల) బకాయిలను మాత్రం ఇప్పటికీ చెల్లించలేదు. (సగటున ఒక్కో ఉద్యోగికి స్థాయిని బట్టి లక్షన్నర నుంచి రెండున్నర లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది.) 5 డీఏలను పీఆర్సీలో కలిపివేసి మొత్తాన్ని ఇప్పటికీ పీఆర్సీ బకాయిల నుంచి వేరు చేయలేదు.

● 2డీఏలను,పెండింగ్‌(2022జూలై,2023జనవరి)డీఏలను ఇప్పటిదాకా ప్రభుత్వం ప్రకటించలేదు.

● 11వ పీఆర్సీ అమలులోకి వచ్చి సంవత్సరన్నర కాలం గడిచినా ఒక్కో ఉద్యోగికి రావాల్సిన బకాయిల లెక్కలు ఇప్పటికీ తేల్చలేదు.

● 1వ తేదీనే ఉద్యోగులందరికీ వేతనాలు పడే పరిస్థితి లేదు...

Updated Date - 2023-06-01T05:01:35+05:30 IST