పేదల కళ్లలో ‘సంకురాత్రి’

ABN , First Publish Date - 2023-01-26T03:49:18+05:30 IST

3.40 లక్షల మందికి ఉచితంగా నేత్ర చికిత్సలు, 3500 మంది పేదలకు విద్యాదానం... ఒకే ఒక వ్యక్తి చేసిన సేవాయజ్ఞమిది! ఆయనే...

పేదల కళ్లలో ‘సంకురాత్రి’

లక్షల మందికి ఉచితంగా నేత్ర చికిత్స

‘కనిష్క’ పేలుడులో భార్యా పిల్లలను కోల్పోయి.. సేవే జీవితంగా జీవిస్తున్న చంద్రశేఖర్‌

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

3.40 లక్షల మందికి ఉచితంగా నేత్ర చికిత్సలు, 3500 మంది పేదలకు విద్యాదానం... ఒకే ఒక వ్యక్తి చేసిన సేవాయజ్ఞమిది! ఆయనే... సంకురాత్రి చంద్రశేఖర్‌. బుధవారం కేంద్రం ఆయనకు ‘పద్మశ్రీ’ ప్రకటించింది. డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌ 1943 నవంబరు 20న జన్మించారు. రాజమహేంద్రవరం, విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభాసం సాగింది. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. బయాలజీ చదువుకున్న ఆయన సైంటి్‌స్టగా అక్కడే స్థిరపడ్డారు. కాకినాడకు చెందిన మంజరిని 1975 మేలో వివాహం చేసుకున్నారు. వీరికి శ్రీకిరణ్‌ (6), శారదా(3) అనే ఇద్దరు పిల్లలు. భార్యా పిల్లలను కెనడా నుంచి స్వదేశానికి పంపించేందుకు... 1985 జూన్‌ 23న ‘కనిష్క’ విమానం ఎక్కించి వీడ్కోలు పలికారు. కానీ... ఆ విమానాన్ని ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు పేల్చేశారు. ఈ విషాదంతో చంద్రశేఖర్‌ జీవితం నిస్సారంగా మారింది. అంతులేని దుఃఖం... నిరాశే మిగిలాయి. పేదలకు సేవ చేస్తూ... ఆ తృప్తి, ఆనందంలోనే తన భార్యా పిల్లలను వెతుక్కోవాలని నిర్ణయించుకున్నారు. కాకినాడకు వచ్చి కొత్త జీవితం మొదలుపెట్టారు. కెనడాలోని తన ఆస్తిపాస్తులన్నీ విక్రయించి... స్వదేశానికి తిరిగి వచ్చారు. కుమారుడు కిరణ్‌ పేరుతో కంటి ఆస్పత్రి స్థాపించారు. 1993 నుంచి ఇప్పటి దాకా 3.40లక్షల మంది పేదలకు 90శాతం ఉచితంగా కేటరాక్ట్‌ ఆపరేషన్‌లు చేయించారు. మరో 38లక్షలమందికి అవుట్‌ పేషెంట్‌ విభాగంలో వైద్యం అందించారు.

26 పడకలు, 9మంది ఉద్యోగులతో మొదలైన కిరణ్‌ కంటి ఆస్పత్రి... ఇప్పుడు 136 పడకలు, 130 మంది ఉద్యోగులు పనిచేసే స్థాయికి ఎదిగింది. చనిపోయిన తన కుమార్తె శారద పేరుతో అదే ఆస్పత్రి ఆవరణలో పేద పిల్లలకు పాఠశాల స్థాపించి ఇప్పటివరకు 3,500మందికి ఉచితంగా విద్యనందించారు. ‘‘నా కూతురు శారద మూడేళ్లప్పుడే స్కూలుకు వెళ్లి చదువుకోవాలని ఉత్సాహపడేది. కానీ... బడికి వెళ్లకుండానే తన జీవితం ముగిసిపోయింది. అందుకే తన పేరున శారదా విద్యాలయం స్థాపించా. మా అబ్బాయి కిరణ్‌ ఆరేళ్ల వయస్సున్నప్పుడే పెద్దయ్యాక తాను కంటి డాక్టర్‌ అవుతా అనేవాడు. ఆ కోరిక ఇప్పుడు కిరణ్‌ కంటి ఆస్పత్రి ద్వారా తీర్చుతున్నాను. 30 ఏళ్లుగా నేను చేస్తున్న కృషికి ఈ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. బడుగువర్గాలను పైకి తెచ్చి వారి జీవితంలో మార్పు తేవాలన్నది నా ఉద్దేశం. పిల్లలకు చదువు చెబితే వారి జీవితాలు, కుటుంబాలు బాగుపడతాయని నమ్మి 1992లో స్కూలు స్థాపించాను. సమాజంలో ఎందరో నాణ్యమైన కంటి వైద్యం లభించక ఇబ్బంది పడుతున్నారు. పద్మశ్రీ వచ్చిందని గర్వపడను. ఇంకా మనసు పెట్టి పని చేస్తా. నా భార్య, పిల్లలకు ఈ అవార్డు స్మారకంగా భావిస్తా. నా భార్య గాయకురాలు. అందుకే ఆమె పేరుతో మ్యూజిక్‌ కాలేజీ స్థాపించాను.’’ అని ‘ఆంధ్రజ్యోతి’తో చంద్రశేఖర్‌ అన్నారు.

Updated Date - 2023-01-26T03:49:19+05:30 IST