నేటి నుంచి పారిశుధ్య కార్మికుల సమ్మె
ABN , Publish Date - Dec 26 , 2023 | 02:32 AM
మంగళవారం నుంచి చేపట్టదలచిన మున్సిపల్ కార్మికుల సమ్మెను యథావిధిగా చేపడుతున్నామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రకటన
వాయిదా వేయాలని కోరిన మంత్రి ఆదిమూలపు
ఆఖరి క్షణంలో విరమించలేమని సంఘం లేఖ
6న సమ్మె ప్రారంభిస్తామన్న కార్మికుల జేఏసీ
అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మంగళవారం నుంచి చేపట్టదలచిన మున్సిపల్ కార్మికుల సమ్మెను యథావిధిగా చేపడుతున్నామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్నామని, తమ వల్ల 123 మున్సిపాలిటీల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదని భావించామన్నారు. గత నాలుగున్నరేళ్లుగా శాంతియుతంగా ఓపికతో ప్రయత్నించామని, ఉన్నతాధికారులతో పలు దఫాలు చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కార్మికులు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. ఈ నేపథ్యంలో తమ సంఘంతో పాటు ఐఎ్‌ఫటీయూ, ఏఐసీడీయూ, ఎంఆర్‌పీఎస్ స్వతంత్ర సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా సమ్మెను వాయిదా వేయాలని అన్ని మున్సిపల్ కార్మికుల సంఘాలను కోరుతూ ఆ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం మెసేజ్‌లు పెట్టారు. మంత్రి విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని ఏపీ మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 6న సమ్మె ప్రారంభిస్తామని పేర్కొంది. అయితే ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాత్రం ఆఖరి క్షణంలో సమ్మెను విరమించలేమని మంత్రికి లేఖ రాసింది. ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు పిలిచినా సమ్మెలో ఉన్న తాము చర్చలకు హాజరవుతామని, సానుకూలంగా స్పందించి సమస్యలకు పరిష్కారం చూపినప్పుడు తిరిగి విధుల్లోకి వస్తామని వెల్లడించింది.