Share News

తిరుమలలో పారిశుధ్య కార్మికుల నిరసన

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:01 AM

రెండు నెలలుగా జీతాలు రాలేదంటూ తిరుమలలో పారిశుధ్య కార్మికులు ఆదివారం ఉదయం నిరసనకు ప్రయత్నించారు. ఇంజనీరింగ్‌ విభాగం అధ్వర్యంలో నాలుగు కాంట్రాక్ట్‌ సంస్థలు భక్తులు బస చేసే గదుల్లో పారిశుధ్య నిర్వహణ చేస్తున్నాయి.

తిరుమలలో పారిశుధ్య కార్మికుల నిరసన

రెండు నెలలుగా జీతాలు రాలేదని ఆవేదన

తిరుమల, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రెండు నెలలుగా జీతాలు రాలేదంటూ తిరుమలలో పారిశుధ్య కార్మికులు ఆదివారం ఉదయం నిరసనకు ప్రయత్నించారు. ఇంజనీరింగ్‌ విభాగం అధ్వర్యంలో నాలుగు కాంట్రాక్ట్‌ సంస్థలు భక్తులు బస చేసే గదుల్లో పారిశుధ్య నిర్వహణ చేస్తున్నాయి. టీటీడీ హెల్త్‌ విభాగం ఆధ్వర్యంలో పద్మావతి, ఆచోరీస్‌, పనోరమ, యూనిసర్వీసెస్‌, శ్రీచైతన్య జ్యోతి, గురూజీ అనే కాంట్రాక్ట్‌ సంస్థలు దాదాపు 1900 మందితో కల్యాణకట్టలు, మరుగుదొడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు, రోడ్లపై పారిశుధ్య నిర్వహణ చేయిస్తున్నాయి. ఈ కాంట్రాక్ట్‌ సంస్థలు కార్మికులు ఒక్కొక్కరికీ ఈఎ్‌సఐ, పీఎఫ్‌ పోనూ రూ.9,600 జీతం ఇస్తున్నాయి. ఈ క్రమంలో పెండింగ్‌లో ఉన్న రెండు నెలల జీతాలివ్వడంతో పాటు, సకాలంలో జీతాలు అందజేయాలంటూ గురూజీ కాంట్రాక్ట్‌ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది ఆదివారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమయ్యారు. హెల్త్‌ ఆఫీసర్‌ శ్రీదేవి, వీజీవో నందకిషోర్‌, ఏవీఎస్వో గిరిధర్‌ అక్కడికి చేరుకుని కార్మికులందరిని ఆస్థాన మండపం లోపలకు తీసుకెళ్లారు. జీతాలు సకాలంలో అందేలా సంబంధిత కాంట్రాక్ట్‌ సంస్థతో మాట్లాడతామని నచ్చజెప్పారు. కార్మికులు మాట్లాడుతూ..

చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, రెండు నెలల పాటు జీతాలివ్వకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నామని వాపోయారు. గతంలో ఉన్న సులభ్‌ సంస్థ కూడా రెండు నెలల జీతం ఇవ్వకుండా వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అధికారులు సమస్యను వివరించారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈవో అధికారులను ఆదేశించారు. కార్మికులందరికీ సకాలంలో జీతాలందించేలా సంబంధిత కాంట్రాక్ట్‌ సంస్థలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని టీటీడీ హెల్త్‌ ఆఫీసర్‌ శ్రీదేవి తెలిపారు. రెండ్రోజుల్లో నవంబరు నెల జీతాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సులభ్‌ సంస్థ జీతాలు ఇవ్వకపోవడంపై కూడా దృష్టిపెట్టామన్నారు. అయితే టీటీడీ నుంచి బిల్లులు రాకపోవడంతోనే ఆ సంస్థ కార్మికులకు జీతాలు ఇవ్వలేదని సమాచారం.

Updated Date - Dec 18 , 2023 | 03:01 AM