Share News

Sand mining : ఇసుక తవ్వకాలకు బ్రేక్‌!

ABN , First Publish Date - 2023-12-07T03:53:41+05:30 IST

అస్మదీయ కంపెనీలకు ఆగమేఘాల మీద ఇసుక తవ్వకాలు అప్పగించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ‘బ్రేకులు’ పడ్డాయి.

Sand mining : ఇసుక తవ్వకాలకు బ్రేక్‌!

పర్యావరణ అనుమతులు తీసుకోవాలి

ఐడబ్ల్యూఏఐ ఎన్‌వోసీ తప్పనిసరి: హైకోర్టు

కాంట్రాక్టు ఎవరికీ ఇవ్వకుండా

ఉత్తర్వుల జారీకీ సిద్ధమైన బెంచ్‌

అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలోనే విచారణ

రాష్ట్ర ప్రభుత్వానికి, జేపీ వెంచర్స్‌కు

క్లీన్‌చిట్‌ ఇవ్వడం లేదని వ్యాఖ్య

అనుమతుల తర్వాతే తవ్వకాలు: ఏజీ

అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అస్మదీయ కంపెనీలకు ఆగమేఘాల మీద ఇసుక తవ్వకాలు అప్పగించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ‘బ్రేకులు’ పడ్డాయి. పర్యావరణ అనుమతి, భారత ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ అథారిటీ (ఐడబ్ల్యూఏఐ) నుంచి ఎన్‌వోసీ లేకుండా ఇసుక రీచ్‌లలో తవ్వకాలు సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ అనుమతులు తీసుకున్నాకే ఇసుక తవ్వకాలు జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా కోల్‌కతా కేంద్రంగా ఇసుక టెండర్ల ప్రక్రియ నడిపించిన తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ అనేక కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. లీజు గడువు ముగిసినప్పటికీ జయప్రకాశ్‌ వెంచర్స్‌, టర్న్‌కీ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థలు ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నాయని అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన దండా నాగేంద్ర కుమార్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి జరుపుతున్న ఇసుక తవ్వకాలను పరిశీలించి కోర్టుకు నివేదిక సమర్పించేందుకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ వేయాలని కోరారు. బుధవారం ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చింది. ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు కేంద్రం అనుమతులు ఉండాలని స్పష్టం చేసింది.

‘‘కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్‌) నుంచి పర్యావరణ అనుమతులు, ఐడబ్ల్యూఏఐ నుంచి ఎన్‌వోసీ పొందకుండా రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు అనుమతించడం సరికాదు. టెండర్‌ ప్రక్రియను కొనసాగించవచ్చు’’ అని తెలిపింది. కాంట్రాక్టును ఎవరికీ అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ఓ దశలో ధర్మాసనం పేర్కొంది. అయితే... కాంట్రాక్టు సంస్థలకు ఇప్పటికే లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ) జారీ చేశామని, అయినప్పటికీ పర్యావరణ అనుమతులు, ఎన్‌వోసీ లేకుండా ఇసుక తవ్వకాలకు అనుమతించబోమని అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ స్పష్టం చేశారు. ఈ వివరణను ధర్మాసనం నమోదు చేసింది. అదే సమయంలో... ఎన్జీటీలో పిటిషన్‌ వేసిన వ్యక్తి, ప్రస్తుత పిల్‌ దాఖలు చేసిన పిటిషనర్‌ ఒకరేనని గుర్తు చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ విచారణ జరుపుతుందని, సమాంతరంగా తాము పిల్‌పై విచారణ జరపడం సరికాదని అభిప్రాయపడింది. అలాగే... ఇసుక తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం, జయప్రకాశ్‌ వెంచర్స్‌, టర్న్‌కీ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థలకు తాము ఏమీ క్లీన్‌చిట్‌ ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ఇసుక తవ్వకాలలో ఏమైనా ఉల్లంఘనలు చోటు చేసుకుంటే ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్‌కు సూచిస్తూ పిల్‌పై విచారణను మూసివేసింది.

అది చట్టవిరుద్ధం: పిటిషనర్‌

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ ఎన్‌వోసీ పొందకుండా ఇసుక తవ్వకాలకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం చట్టవిరుద్ధమన్నారు. లీజు గడువు ఈ ఏడాది మే 2తో ముగిసినప్పటికీ జయప్రకాశ్‌ వెంచర్స్‌, టర్న్‌కీ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థలు ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నాయన్నారు. జయప్రకాశ్‌ వెంచర్స్‌ గతనెలలో జారీ చేసిన ఇసుక రవాణా పర్మిట్‌ను కోర్టు ముందు ఉంచారు. భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి తరలించేందుకు కృష్ణా నదిలో బండ్‌ నిర్మాణం కోసం ఎలాంటి అనుమతులు లేకుండా వైకుంఠపురం, వెంకన్న కొండను తవ్వి గ్రావెల్‌, మట్టిని తరలిస్తున్నారని తెలిపారు. కృష్ణా నది ప్రవాహానికి అడ్డంగా బండ్‌ల నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు. విచ్చలవిడి ఇసుక తవ్వకాల ద్వారా నదీ గర్భానికి వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయాలన్న ఎన్‌జీటీ ఉత్తర్వులు అమలు చేయకుండా ఇసుక టెండర్లను ఖరారు చేస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. ‘ఇసుకను తవ్వి తరలించేందుకు బండ్‌ల నిర్మాణం చేస్తారు. లీజు ముగిసిన తరువాత కాంట్రాక్టు సంస్థలు వాటిని తొలగిస్తాయి. స్టాక్‌ యార్డ్‌లో నిల్వ చేసిన ఇసుకను మాత్రమే జయప్రకాశ్‌ సంస్థ తరలిస్తోంది. ఈ ఏడాది మే నుంచి రీచ్‌లలో ఎలాంటి ఇసుక తవ్వకాలు జరపడం లేదు. ఇసుక తవ్వకాల విషయంలో కాంట్రాక్టు సంస్థలు ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని పిటిషనర్‌ ఇప్పటికే ఎన్జీటీని ఆశ్రయించారు. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను అనుసరించి నివేదిక ఇస్తున్నాం. కాంట్రాక్టు సంస్థకు ఇప్పటికే లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేసినప్పటికీ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు, ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి ఎన్‌వోసీ పొందిన తరువాతే రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు అనుమతులు ఇస్తాం’ అని వివరించారు.

Updated Date - 2023-12-07T03:53:42+05:30 IST