Share News

Sand Maining : జగన్‌ రాజ్యంలో ఇసుక భోజ్యం

ABN , First Publish Date - 2023-11-29T03:43:31+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చీ రాగానే... నూతన మద్యం విధానం తీసుకొచ్చారు. పాత పాలసీ పోయి, కొత్తది అమలులోకి వచ్చింది.

Sand Maining : జగన్‌ రాజ్యంలో ఇసుక భోజ్యం

సర్కారీ పెద్దలకు గనుల శాఖ గులాంగిరీ’

జేపీ వెంచర్స్‌ పేరుతో సకల మాయలు

ఆయన పేరు వెంకటరెడ్డి. ఉద్యోగం.. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సర్వీస్‌! చేయాల్సింది.. సీనియర్‌ సివిలియన్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గా శిక్షణ ఇవ్వడం! కానీ.. జగన్‌ అధికారంలోకి రాగానే డిప్యుటేషన్‌పై ఏపీకి వచ్చారు. తొలుత విద్యా శాఖలో పని చేశారు. ఇప్పుడు గనుల శాఖ డైరెక్టర్‌గా, ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) డైరెక్టర్‌గా జంట పోస్టులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడంవల్ల ఖజానాకు నష్టం జరిగిందంటూ చంద్రబాబుపై ఫిర్యాదు చేసింది ఈయనే! ఆహా.. ఇంత బాధ్యతాయుతమైన అధికారి, ఖజానాకు చిల్లిగవ్వ నష్టం వచ్చినా సహించలేరు, ఇప్పుడు మరెంత బాధ్యతగా పని చేసి ఉంటారో.. అని అనుకుంటున్నారా!? అయితే.. మీరు ‘ఇసుక’లో కాలేసినట్లే!

‘జగన్మాయ’లో వెంకటరెడ్డి చేసిన లీలా విలాసాలు అన్నీ ఇన్నీ కావు!

6 నెలలుగా ఎవరు తవ్వుతున్నట్లు

ఏపీఎండీసీ డైరెక్టర్‌ వెంకట రెడ్డి ఏం చేస్తున్నట్లు?

ఉచితం తప్పంటూ బాబుపై ఆయన ఫిర్యాదు

మరి.. వెంకటరెడ్డి ఘోరాలపై ఎవరు ఫిర్యాదు చేయాలి?

రెండేళ్లకు రూ.1529 కోట్లకు టెండరు

కానీ.. ఖజానాకు వచ్చింది రూ.671 కోట్లే

233 కోట్ల జీఎస్టీ కూడా బిడ్‌ మొత్తంలోనే!

ఖజానాకు నేరుగా రూ.1091 కోట్ల నష్టం

రూ.858 కోట్ల ఇసుక ప్రభుత్వానికి సరఫరా చేసినట్లు లెక్కలు

ఆ మొత్తం జేపీ నుంచి మినహాయింపు

అంతా ‘బుక్‌ అడ్జె్‌స్టమెంట్‌’తోనే మాయలు

బకాయిలున్నా బ్యాంక్‌ గ్యారెంటీల జప్తు లేదు

జేపీ వచ్చేనాటికి డంప్‌లలో 158 కోట్ల ఇసుక

వెళ్లిపోయే రోజుకు 350 కోట్ల నిల్వలు

అదంతా ఎక్కడికక్కడ మింగేశారు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

వైసీపీ అధికారంలోకి వచ్చీ రాగానే... నూతన మద్యం విధానం తీసుకొచ్చారు. పాత పాలసీ పోయి, కొత్తది అమలులోకి వచ్చింది. ఒక్కరోజు కూడా మద్యం బంద్‌ కాలేదు! కానీ... నూతన ఇసుక విధానం పేరుతో నెలల తరబడి ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఉసురు తీసుకున్నారు. ‘లోలోపల కసరత్తు’ మొత్తం పూర్తయ్యాక జేపీ వెంచర్స్‌ పేరుతో అసలు మాయ మొదలైంది. గనుల శాఖ, ఏపీఎండీసీ డైరెక్టర్‌గా ఉన్న వెంకటరెడ్డి సారథ్యంలోనే ఇదంతా నడిచింది. రాష్ట్రస్థాయిలో న్యాయ కమిషన్‌ ఆమోదంతో టెండర్లు పిలిస్తే గుట్టు బయటకొస్తుందని భావించి... కోల్‌కతా కేంద్రంగా ఉన్న కేంద్ర సంస్థ ఎంఎ్‌సటీసీ ద్వారా కథ నడిపించారు. ఇసుక టెండరును జేపీ వెంచర్స్‌ గ్రూప్‌ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం... 2021 మే 3 నుంచి 2023 మే 2 వరకు ఆ సంస్థ రెండేళ్లలో ఏపీఎండీసీకి 1529 కోట్ల రూపాయలు చెల్లించాలి. కానీ... జేపీ వెంచర్స్‌ కొన్నాళ్లకే తెరవెనక్కి వెళ్లిపోయింది. టర్న్‌కీ అనే సంస్థకు సబ్‌ కాంట్రాక్టు ఇచ్చారు. అధికార పార్టీ నేతల ఇసుక దోపిడీ భరించలేక ఆ సంస్థ కూడా గత ఏడాది సెప్టెంబరులో రాష్ట్రం వదిలి వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి పేరు జేపీ వెంచర్స్‌ది! తవ్వకాలు వైసీపీ నేతలవి! ఎవరు తవ్వుకున్నా, అమ్ముకున్నా, కాంట్రాక్టు పొందిన జేపీ సంస్థ రెండేళ్లలో సర్కారుకు నికరంగా 1529 కోట్లు చెల్లించి తీరాల్సిందే. కానీ... చెల్లించింది రూ.671 కోట్లు మాత్రమే అని తెలిసింది. ఇందులో ఆ సంస్థ చెల్లించాల్సిన జీఎస్టీ రూ.233 కోట్లను కూడా కాంట్రాక్టు విలువ(బిడ్‌ అమౌంట్‌)గా చూపించినట్లు తెలిసింది. నిజానికి... బిడ్‌ అమౌంట్‌పై అదనంగా జీఎస్టీ చెల్లించాలి. గత ఏడాది మే 7వ తేదీన స్వయంగా గనుల శాఖ విడుదల చేసిన మెమో (ఐఎన్‌సీ01-ఎ్‌సజీఓ శాండ్‌-6- 2022-ఎం3) ఈ విషయం స్పష్టం చేస్తోంది. ఘనత వహించిన ఏపీఎండీసీ డైరెక్టర్‌ వెంకట రెడ్డి ఇవేమీ పట్టించుకోలేదు. నేరుగా... బిడ్‌ అమౌంట్‌లో జీఎస్టీని కలపడంతో ఖజానాకు రూ.233 కోట్లు నష్టం! ఇక... రెం డేళ్లలో రూ.1529 కోట్లకుగాను రూ.671 కోట్లే చెల్లించింది. అంటే... మరో, 858 కోట్లు నష్టం. మొత్తంగా... వెంకట రెడ్డి ‘ప్రేక్షకపాత్ర, స్వామిభక్తి’ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.1091 కోట్ల నష్టం వాటిల్లింది.

ఇసుక ఇచ్చినట్లు... డబ్బు చెల్లించినట్లు!

రూ.1529 కోట్లలో రూ.671 కోట్లు చెల్లించగానే సరిపోతుందా?మిగిలిన రూ.858 కోట్ల మాటేమిటి? ఏదో ఒక లెక్క చెప్పాలి కదా!? ఇక్కడే మరో భారీ మతలబు జరిగింది. ఇసుక కాంట్రాక్టు అగ్రిమెంట్‌లోనే దీనికి బీజం పడింది. దీని ప్రకారం... జేపీ సంస్థ ప్రభుత్వ అవసరాలకు ఇసుక సరఫరా చేస్తే, ఆ విలువను తాను చెల్లించాల్సిన బిడ్‌ మొత్తం నుంచి మినహాయించుకోవచ్చు. ఇక్కడ ఏకంగా రూ.858 కోట్ల విలువైన ఇసుకను ప్రభుత్వ పనులకు సరఫరా చేసినట్లుగా లెక్కలు సృష్టించారు. అందులోనూ... రూ.800 కోట్లు గృహ నిర్మాణ శాఖకే సరఫరా చేసినట్లు చూపించారు. ఆ మొత్తాన్ని గృహ నిర్మాణ శాఖ గనుల శాఖకు చెల్లించినట్లుగా ‘బుక్‌ అడ్జె్‌స్టమెంట్‌’ (రెండూ ప్రభుత్వ సంస్థలే అయినందున... వాళ్లు ఇచ్చినట్లు, వీళ్లు పుచ్చుకున్నట్లు కాగితాల మీద రాసేస్తారు) చేశారు. ఇక్కడ నగదు లావాదేవీ జరగలేదు. కానీ... జేపీ వెంచర్స్‌కు మాత్రం రూ.858 కోట్లు మిగిలిపోయాయి. ఆ మేరకు ఖజానాకు నష్టం వాటిల్లింది. మరి... ఈ అవకతవకలకు ఎవరు బాధ్యులు? ఎవరిపై కేసు పెట్టాలి? ఇవి మాత్రమే కాదు! వెంకట రెడ్డి చేసిన నిర్వాకాలు మరెన్నో ఉన్నాయి. జేపీ వెంచర్స్‌ సంస్థ గనుల శాఖకు చెల్లించాల్సిన సొమ్మును వాయిదాలను సక్రమంగా చెల్లించలేదు. జీవో 251లోని రూల్‌ (డీ-2)(9)నిబంధన ప్రకారం బాకీపడ్డ వాయిదాలను వడ్డీతో సహా వసూలు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. జేపీ వెంచర్స్‌కు ఒక్కటంటే ఒక్క నోటీసూ జారీ చేయలేదు.

ఆ 350 కోట్ల ఇసుక ఏమైంది?

జేపీ వెంచర్స్‌కు ఇచ్చిన రెండేళ్ల ఇసుక కాంట్రాక్టు ఈ ఏడాది మే 2వ తేదీతో ముగిసిపోయింది. అప్పటికి స్టాక్‌యార్డ్‌ల్లో 75 లక్షల టన్నుల ఇసుక ఉంది. దాని విలువ రూ.350 కోట్లు. నిబంధనల ప్రకారం ఆ ఇసుకను జేపీ సంస్థ గనుల శాఖ డైరెక్టర్‌కు అప్పగించాలి. కానీ....అలా అప్పగించలేదు. డైరెక్టర్‌ వెంకటరెడ్డి కూడా పట్టించుకోలేదు. వైసీపీ నేతలే ఎక్కడికక్కడ ఇసుకను సొంత అడ్డాలకు తరలించి అమ్మేసుకున్నారు. ఈ విషయంలో గనుల శాఖ డైరెక్టర్‌ ఏం చర్యలు తీసుకున్నారు? వైసీసీ నేతల ఇసుక దందాను ఎందుకు అడ్డుకోలేకపోయారు? అక్రమంగా ఇసుకను అమ్ముకుంటున్న నేతలపై కేసులు పెట్టాలని ఫిర్యాదులు ఎందుకు చేయలేదు? అదే విధంగా... జేపీ వెంచర్స్‌కు కాంట్రాక్టు ఇచ్చే నాటికి స్టాక్‌యార్డ్‌లు, రీచ్‌ల్లో 15లక్షల టన్నుల ఇసుక ఉంది. దీని విలువ 158కోట్లు అని అంచనా. మొదట్లో ఈ ఇసుకను జేపీవెంచర్స్‌కు అప్పగించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన సొమ్మును జేపీ వెంచర్స్‌ తిరిగి ఏపీఎండీకి చెల్లించాలి. కానీ... ఈ రోజు వరకూ అదీ జరగలేదు. జేపీ సంస్థ ఇప్పటికీ గనులశాఖకు బకాయిలు చెల్లించాలి. టెండర్‌ గడువు ముగిసినా బకాయిలు చెల్లించకపోతే నిబంధనల ప్రకారం ఆ సంస్థ ఇచ్చిన రూ.120కోట్ల బ్యాంక్‌ గ్యారెంటీలను జప్తుచేయాలి. ఆ అధికారం గనుల శాఖ డైరెక్టర్‌దే. కానీ ఆయన ఆ పనిచేయ లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే... కొత్త సంస్థను ఎంపిక చేసేదాకా జేపీనే ఇసుక వ్యాపారం చేసుకొమ్మని చెప్పామని బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బయటపెట్టలేదు. దీంతో ప్రభుత్వ ప్రయోజనాలు ప్రమాదంలో పడ్డాయి. కాంట్రాక్టు సంస్థ నుంచి వాయిదాలు, బకాయిలు, అపరాధ ఫీజుల వసూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన వెంకటరెడ్డి ఏం చేశారంటే... ‘ఏమీ చేయలేదు’! బకాయిలు వసూలు చేసి పెద్దలకు కష్టం కలిగించడం ‘పాపం’ కదా!?

అధికార పార్టీ నేతల దందా కనం.. వినం

జేపీ వెంచర్స్‌ కాంట్రాక్టు గడువు మే 2నే ముగిసిపోయింది. ఆరేడు నెలల నుంచి రాష్ట్రంలో ఇసుక వ్యాపారం ఎవరు చేస్తున్నారో చూసుకోవాల్సింది గనుల శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డే. ఇప్పటికీ జేపీ పేరిట లక్షల టన్నుల ఇసుకను అధికార పార్టీ నేతలు తవ్వుకుపోతున్నారు. దొంగ వే బిల్లులు చూపిస్తున్నారు. ఈ విషయం లో ‘స్పందన’కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా గనుల శాఖ స్పందించలేదు. ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు ఇలా చేస్తున్నారు? ప్రభుత్వానికి రావాల్సిన ఆదా యం నేతలు ఎగరేసుకొని పోతుంటే వెంకటరెడ్డి ఏం చేస్తున్నట్లు? విజిలెన్స్‌ బృందాలతో ఎందుకు సోదాలు చేయించట్లేదు? ఇసుక వ్యాపారమంతా ప్రభుత్వ పెద్దల చేతిలో నడుస్తుండటమే వీటన్నింటికి జవాబు.

Updated Date - 2023-11-29T03:43:44+05:30 IST