జీతం అక్కడ.. విధులు ఇక్కడ!

ABN , First Publish Date - 2023-03-26T04:16:06+05:30 IST

అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులకు ఒక ఆర్డర్‌ ఉండదు... ప్రభుత్వం నుంచి అనుమతీ ఉండదు. జీతాలు ఒక చోట... ఉద్యోగం మరోకచోట చేస్తున్న పరిస్థితి.

జీతం అక్కడ.. విధులు ఇక్కడ!

డీఎంఈలో అనధికారిక పోస్టింగ్‌లు

ఆర్డర్లు లేవు.. ప్రభుత్వ అనుమతీ ఉండదు

‘ఏపీవీవీపీ’ కాంట్రాక్టు ఇంజనీర్‌ డీఎంఈలో విధులు

కీలకమైన జేడీ మెడికల్‌ పోస్టు వైద్యునితో భర్తీ

నోడల్‌ అధికారుల గడువు పూర్తయినా డీఎంఈలోనే..

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులకు ఒక ఆర్డర్‌ ఉండదు... ప్రభుత్వం నుంచి అనుమతీ ఉండదు. జీతాలు ఒక చోట... ఉద్యోగం మరోకచోట చేస్తున్న పరిస్థితి. తమ రెగ్యులర్‌ పోస్టింగ్‌ ఉన్న స్థానాల్లో ఉద్యోగుల కొరత ఉన్నా.. ప్రధాన కార్యాలయంలోనే కొనసాగుతారు. ఉన్నతాధికారులు కూడా ఇలా అడ్డగోలుగా వచ్చే ఉద్యోగులను కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టి, రెగ్యులర్‌ ఉద్యోగులపై వారికి పెత్తనం అప్పగిస్తున్నారు. దీంతో విభాగం ఆడ్మినిస్ట్రేషన్‌, నియామకాలు, పదోన్నతులు, మందులు, వైద్య పరికరాల కొనుగోలు మొత్తం ఆర్డర్‌ లేకుండా కొనసాగుతున్న ఉద్యోగులో చేతుల్లోనే నడుస్తోంది. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ)లో నడుస్తున్న ఈ అక్రమ వ్యవహరంపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. డీఎంఈలో ఉన్నతాధికారి మాత్రం ఆర్డర్‌ లేకుండా కొనసాగుతున్న ఉద్యోగులనే ప్రోత్సహిస్తున్నారు.

ఆర్డర్‌ లేకుండా డాక్టర్‌ను తీసుకొచ్చి జేడీగా

డీఎంఈ పరిధిలో ఉన్న 11 మెడికల్‌ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రుల పరిపాలన మొత్తం జాయింట్‌ డైరెక్టర్‌ చేతుల్లోనే ఉంటుంది. దీంతో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నుంచి ఉత్తరప్రత్యుత్తరాలు మొత్తం జేడీ మెడికల్‌ ద్వారానే నడుస్తాయి. ఇలాంటి కీలకమైన పోస్టులోకి హెల్త్‌ యూనివర్సిటీ నుంచి ఓ డాక్టర్‌ను ఆర్డర్‌ లేకుండా, ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చి పెట్టారు. ఆయనతోపాటు కాకినాడలో విధులు నిర్వహించాల్సిన ఒక హాస్పిటల్‌ అడినిస్ట్రేటర్‌ను కూడా డీఎంఈ ఆఫీ్‌సలో ఆర్డర్‌ లేకుండా కొనసాగిస్తున్నారు. డీఎంఈ ప్రోత్సాహంతోనే అతడు జీతం కాకినాడ నుంచి డ్రా చేస్తూ డీఎంఈ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.

కీలక స్థానంలో కాంట్రాక్టు బయోమెడికల్‌ ఇంజనీరు...

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన్‌ పరిషత్‌ పరిధిలో.. నెల్లూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఒక కాంట్రాక్టు బయోమెడికల్‌ ఇంజనీర్‌ను ఆర్నెల్ల క్రితం ఉన్నతాధికారులు ఏరికోరి మరీ డీఎంఈకి తెప్పించుకున్నారు. డీఎంఈ ఆస్పత్రులకు, మెడికల్‌ కాలేజీలకు మందుల దగ్గర నుంచి వైద్య పరికరాల కొనుగోలు వరకూ మొత్తం సదరు బయో మెడికల్‌ ఇంజనీర్‌ కనుసన్నల్లోనే నడుస్తోంది. మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌, వైద్య పరికరాల కొనుగోలు కోసం డీఎంఈలో కొన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాంటి కీలకమైన స్థానంలో ఉన్న ఆయనకు ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి కనీసం డిప్యుటేషన్‌ ఆర్డర్‌ కూడా లేకపోవడం గమనార్హం. ఉన్నతాధికారులకు అత్యంత సన్నిహితుడు కావడంతో కోట్ల బడ్జెట్‌ ఉన్న పోస్టులో అతడిని కూర్చోబెట్టారని, దీని వెనుక అనేక ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

లెక్కకు మించి నోడల్‌ అధికారులు

డీఎంఈ కార్యాలయంలో నోడల్‌ అధికారులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో మాత్రమే వారు కొనసాగేవారు. ఇప్పుడు నోడల్‌ అధికారుల పేరుతో కొంత మందిని, ఆర్డరు లేకుండా మరికొంత మందిని తీసుకొచ్చి డీఎంఈని నింపేశారు. దీంతో పాలన మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. వారికిచ్చిన గడువు పూర్తయినా, చివరికి పదోన్నతులు వచ్చినా వారు డీఎంఈ కార్యాలయాన్ని మాత్రం విడిచిపెట్టరు. ప్రస్తుతం ముగ్గురు నోడల్‌ అధికారులకు గడువు పెంపు ఆర్డర్లు లేవు. ఒక నోడల్‌ అధికారి చేసిన గందరగోళానికి డీఎంఈలో నియామకాలు, పదోన్నతులు మొత్తం తారుమారు చేసేశారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో, మెడికల్‌ కాలేజీల్లో ఖాళీలు మొత్తం భర్తీ చేయాలని సీఎం జగన్‌ ఆదేశిస్తుంటే... డీఎంఈ అధికారులు మాత్రం వైద్యులను నోడల్‌ అధికారుల పేరుతో డీఎంఈలోనే కొనసాగిస్తున్నారు. దీనిపై కూడా అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, గాడితప్పిన డీఎంఈ అడ్మినిస్ట్రేషన్‌పై ఇప్పటికైనా దృష్టిసారిస్తారో లేదో చూడాలి మరి!.

Updated Date - 2023-03-26T04:16:06+05:30 IST