Employees Salary: ఉద్యోగులకు జీతం కష్టమే!

ABN , First Publish Date - 2023-03-10T03:32:26+05:30 IST

ఉద్యోగులు పీఆర్సీ ఎరియర్లు, డీఏ బకాయిలు, జీపీఎఫ్‌ సొమ్ములు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం మొదలుపెట్టారు. కానీ, దీనిని ప్రభుత్వం చాలా లైట్‌గా తీసుకుంది. ఒ కే ఒక దెబ్బతో ఉద్యోగుల ఎజెండాను మార్చేసింది.

Employees Salary: ఉద్యోగులకు జీతం కష్టమే!

చెప్పేదాకా బిల్లులు పెట్టొద్దని ఆదేశాలు

2022 బిల్లులు తీసుకోవద్దని నిర్దేశం

సీఎఫ్‌ఎంఎస్‌లో 2023 మారేదాకా ఆగాలట

ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే కొత్త మెలిక

చెల్లింపులను వాయిదా వేసేందుకే ఎత్తుగడ?

కొత్త అప్పులు వస్తేనే సిబ్బందికి వేతనాలా?

సగం రోజులు ఉండగానే ‘పరిమితి’ అవుట్‌

తిరిగి కేంద్రం అప్పులకు అనుమతిస్తుందా?

ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాన్ని

నీరుగార్చేలా జగన్‌ సర్కారు ‘డైవర్షన్‌ స్కీమ్‌’!

డిసెంబరులో 22వ తేదీనగానీ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు, పెన్షన్లు ఇవ్వలేకపోయారు. జనవరిలో నెల మధ్య దాకా జీతాలు పడుతూనే ఉన్నాయి. ఇక... ఫిబ్రవరి 12 వతేదీకి వేతనాలు, పెన్షన్లు పడ్డాయి. మార్చిలోనూ చెల్లింపులు కొనసా.....గుతూనే ఉన్నాయి. మరి... ఏప్రిల్‌ పరిస్థితి ఏమిటి? అసలు జీతాలు వస్తాయా? వస్తే ఎప్పుడు? ఈ ప్రశ్నలు ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే, ప్రభుత్వం బిల్లుల సీరిస్‌ పేరుతో కొత్త మెలిక పెట్టింది. ఆర్థిక సంవత్సరం మారుతున్నందున 2023 బిల్లుల సీరిస్‌ వచ్చేదాకా జీతాలతో సహా ఏ బిల్లులూ పెట్టొద్దని స్పష్టం చేసింది.

బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలు, దాచుకున్న డబ్బుల లెక్కలు ఉద్యోగులు అడుగుతుండటంతో సర్కారు మరోసారి ‘డైవర్షన్‌’ స్కీమ్‌ బయటకు తీసింది. వేతనాలు, పెన్షన్లపై అనిశ్చితిని ‘క్రియేట్‌’ చేయడం మొదలుపెట్టింది. ‘అంతనీ.. ఇంతనీ..’ ఉద్యోగులను ఊరిస్తూనే... వారికి సంబంధించిన మార్చి నెల బిల్లులు పెట్టొద్దు అంటూ ఆదేశాలు ఇచ్చేసింది. ఉద్యోగులు అడుగుతున్నవి 95 డిమాండ్లు. అయితే, సకలం వికలమై.. ‘వేతనాలు’ అనే ఒకే ఒక్క డిమాండ్‌ తెరపై నిలిచేలా వేసిన ఎత్తుగా దీనిని అనుమానిస్తున్నారు. సర్కారు ట్రాప్‌లో పడితే ‘ఫస్ట్‌కు జీతాలు ఇవ్వండి బాబోయ్‌’ అంటూ ఉద్యోగుల నుంచి ఉద్యోగ నేతల దాకా మొత్తుకోవడమే మిగులుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు పీఆర్సీ ఎరియర్లు, డీఏ బకాయిలు, జీపీఎఫ్‌ సొమ్ములు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం మొదలుపెట్టారు. కానీ, దీనిని ప్రభుత్వం చాలా లైట్‌గా తీసుకుంది. ఒ కే ఒక దెబ్బతో ఉద్యోగుల ఎజెండాను మార్చేసింది. మార్చి నెల జీతం బిల్లులు పెట్టొద్దు అని చెప్పింది. దీనికి రకరకాల సాకులు చెప్పింది. ఏప్రిల్‌లో ప్రభుత్వం బిల్లులు ఎప్పుడు పెట్టాలని చెప్తే అప్పుడు ఉద్యోగులు జీతాలు, పెన్షన్ల బిల్లులు పెట్టుకోవాలి. వెరసి ఉద్యోగులు ఇప్పటి నుంచి ప్రభుత్వం తమకివ్వాల్సిన వేలకోట్ల బకాయిలు మర్చిపోయి మార్చి నెల జీతాలు పెట్టుకోనివ్వండి మహాప్రభో అని వేడుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. గత ఏడాది పీఆర్సీ డిమాండ్లపై ఉద్యోగులు ఉద్యమిస్తున్న సమయంలోనూ ప్రభుత్వం ఇలాంటి డైవర్షనే చేసింది. వారాలు గడచినా జీతాలు ఇవ్వకుండా ఆపి ఉద్యోగులు తమ అజెండాలో సకాలంలో జీతాలివ్వండి అనే డిమాండ్‌ను మొదట పెట్టుకునేలా చేసింది.

ప్రభుత్వం చెప్పిన సాకు

మార్చి 31వ తేదీతో 2022-23 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. 2023 ఏప్రిల్‌ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. బిల్లులు మార్చిలోనే పెడితే వాటికి 2022 సీరియల్‌ నంబర్‌ వస్తుంది. కానీ, జీతాలు ఇచ్చేది ఏప్రిల్‌ ఒకటో తేదీన. అప్పటికి బిల్లుల సీరియల్‌ నంబరు 2023 అని మొదలవుతుంది. ఈ సందిగ్ధతకు తావు ఇవ్వకూడదనే బిల్లులు పెట్టొద్దని ట్రెజరీ, అకౌంట్స్‌ డైరెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు మెమో జారీ చేశారు. కానీ, ఎప్పుడూ లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి! ప్రతి ఏడాది మార్చి 31 ఒక ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ఉద్యోగులు మాత్రం ఎప్పట్లాగే మార్చి 21వ తేదీనుంచి మార్చి 30వ తేదీ వరకు జీతాలు, పెన్షన్ల బిల్లులు అప్‌లోడ్‌ చేస్తుంటారు.

వారికి ఏప్రిల్‌లో జీతాలు అందుతాయి. అందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ ముందుగానే వ్యవస్థను సిద్ధం చేసి ఉంచుతుంది. ఉమ ్మడి రాష్ట్రంలోనూ, చంద్రబాబు హయాంలోనూ, జగన్‌ అధికారంలోకి వచ్చాక గడచిన మూడేళ్లలోనూ ఇదే జరిగింది. దశాబ్దాలుగా రాని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? ప్రతి ప్రభుత్వం ఏప్రిల్‌లో మార్చినెల జీతాలిచ్చేందుకు కొంత డబ్బును ఖజానాలో రిజర్వులో ఉంచుతుంది. వాటితో జీతాలు చెల్లిస్తుంది. మరి వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది ఆ పని ఎందుకు చేయలేకపోతోంది? అప్పులకు అనుమతొచ్చాక జీతాలు, పెన్షన్ల సంగతి చూద్దాంలే అన్నట్టు కనిపిస్తోంది ప్రభుత్వ ధోరణి.

జీతాలకు డబ్బులుండవా?

ఏప్రిల్‌ 1న ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు ఖజానాలో డబ్బులుండవా? అప్పుల పరిమితి ముగిసిపోతే ఖజానాకు రెగ్యులర్‌గా వచ్చే పన్నులు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, లోటు నిధులు ఏమైపోతున్నాయి? వాటితో ఉద్యోగుల జీతాలు ఇవ్వలేరా? ప్రతి నెలా అప్పు చేతికొచ్చే వరకు చూసి అప్పుడు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల ఆలస్యంపై మీడియా ప్రధానంగా ఫోకస్‌ చేస్తోంది. సోషల్‌ మీడియాలోనూ ఈ వార్తలు హైలైట్‌ అవుతున్నాయి. ఈ ఒత్తిడిని తప్పించుకునేందుకు ప్రభుత్వం అసలు బిల్లులే తీసుకోకపోతే చెల్లించాల్సిన అవసరమే ఉండదు కదా అనే ఆలోచనకు వచ్చి ఆ మేరకు మెమో జారీ చేసింది. ఎవరైనా జీతాలు, పెన్షన్లు అడిగితే టెక్నికల్‌ సమస్య వల్ల ఇంకా బిలు ్లలే జనరేట్‌ కాలేదు, బిల్లులు జనరేట్‌ అ య్యాక ఇస్తామని చెప్పి తప్పించుకోవచ్చు.

ఎంత కాలం తప్పించుకుంటారు?

2023 ఏప్రిల్‌ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. అంటే కేంద్రం కొత్త అప్పులకు అనుమతిస్తుంది. ఈ అనుమతి వచ్చాక జీతాలు, పెన్షన్ల బిల్లులు పెట్టుకోమని ప్రభుత్వం చెప్పే అవకాశాలున్నాయని ఉద్యోగులు అంచనావేస్తున్నారు. ఎందుకంటే ప్రతి నెలా అప్పు ఎప్పుడు వస్తే అప్పుడే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తున్నారు. గత డిసెంబరులో 22వ తేదీన గాని ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు, పెన్షన్లు ఇవ్వలేకపోయారు. జనవరి, ఫిబ్రవరి లో 12 వ తేదీన ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు, పెన్షన్లు ఇచ్చారు. కానీ, కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి అప్పుల అనుమతి ఎప్పుడొస్తుందో తెలీని పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది కేంద్రం ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన అప్పుల అనుమతిని మే నెల రెండో వారంలో ఇచ్చింది. ఈ ఏడాది కూడా జాప్యానికి అవకాశాలున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మార్చి నెల జీతాల బిల్లులు పెట్టొద్దు అని ఉద్యోగులకు ఆదేశాలిచ్చింది.

మార్చి..ఆదాయం కనిపించే మాసం

అప్పుల పరిమితి ముగిసిపోతే ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో వైసీపీ సర్కారు ఉందని ఆ మెమో చూస్తే అర్థమవుతోంది. సాధారణంగా మిగిలిన అన్ని నెలల్లో కంటే మార్చిలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం అధికంగా వస్తుంది. కేంద్రం వద్ద పెండింగ్‌ ఉన్న గ్రాంట్లు, పెండింగ్‌లో ఉన్న పన్ను మార్చిలో జమ అవుతాయి. గత ఆర్థిక సంవత్సరం మార్చిలో ప్రభుత్వానికి రూ.24,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇంచుమించుగా ఇదే స్థాయిలో ఆదాయం రావొచ్చని అంచనా. ఇందులో నుంచి రూ.5,500 కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం వెచ్చించలేరా? ఈ డబ్బంతా ఆప్పులకు బిల్లులు చెల్లించడానికే వాడే అవకాశాలున్నాయి.

ఈసారీ సస్పెన్స్‌ ఖాతా వాడతారా?

రెండేళ్లుగా వైసీపీ ప్రభుత్వం మార్చి 31వ తేదీన నిబంధనలకు విరుద్ధమైన సస్పెన్స్‌ ఖాతాను వాడుతోంది. అంటే అనుమానాస్పద లావాదేవీలు చేస్తోంది. దీనిపై కాగ్‌ తన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సాధారణంగా మార్చి ఆఖరి రోజుల్లో బిల్లుల చెల్లింపులు ఎక్కువగా జరుగుతుంటాయి. గత ఆర్థిక సంవత్సరం మార్చి 31న కూడా బిల్లుల చెల్లింపులు భారీగా జరిగాయి. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ పాస్‌ చేసిన కొన్ని బిల్లులను ఆర్‌బీఐ తిరస్కరించింది. కానీ, ఎలాగైనా ఆ బిల్లులను చెల్లించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక శాఖ వాటిని సస్పెన్స్‌ ఖాతాకు మళ్లించింది. అంటే ఆర్‌బీఐ అనుమతించకపోయినా సరే ప్రభుత్వం ఆ బిల్లు చెల్లించిందని అర్థం. సస్పెన్స్‌ ఖాతాకు మళ్లించిన ఆ డబ్బులను ఆ తర్వాత ఆ బిల్లులకు సంబంధించిన వారి ఖాతాల్లోకి వేస్తారు.

ఇది నిబంధనలకు విరుద్ధం. అయినా..ఆప్తులకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం ఎన్ని నిబంధనలైనా ఉల్లంఘిస్తూ వస్తోంది. అందుకే పన్నుల రూపంలో, గ్రాంట్ల రూపంలో వచ్చిన డబ్బులను ఈ బిల్లుల చెల్లింపు కోసం ఉంచుకుని, కొత్త అప్పులకు అనుమతి వచ్చాక జీతాలు, పెన్షన్ల సంగతి చూద్దామనేది ప్రభుత్వ ఆలోచనగా ఉద్యోగులు చెప్తున్నారు. బిల్లులు జనరేట్‌ అ యితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి, ఏకంగా బిల్లులే పెట్టొద్దని ఆదేశాలిచ్చారు. జీతాలు, పెన్షన్ల బిల్లులు మినహా మిగతా బిల్లులను రెండు నెలల నుంచి ప్రభుత్వం స్వీకరించడం లేదు. మార్చి 31న బ్యాలెన్స్‌షీట్‌లో పెండింగ్‌ బిల్లులు కనపడకుండా చేసేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ ఇది. ఇప్పుడైతే ఏకంగా వేతనాలు, పెన్షన్ల బిల్లులు కూడా ఆపేశారు.

Updated Date - 2023-03-10T03:32:26+05:30 IST