రూల్స్‌‘తుంగ’లోకి..

ABN , First Publish Date - 2023-03-26T04:00:46+05:30 IST

అధికార పార్టీ నాయకులకు వాటాలు కావాలి. అధికారులకు పర్సంటేజీలు కావాలి. బడ్జెట్‌లో తగిన కేటాయింపులు లేకున్నా టెండర్లు పిలిచారు.

రూల్స్‌‘తుంగ’లోకి..

400 కోట్ల టెండర్లలో మాయ

టీబీపీ బోర్డు ఇంజనీర్ల ఇష్టారాజ్యం

జీవో ఎంఎస్‌-67 రూల్స్‌కు భిన్నంగా కాంట్రాక్టరుకు పనులు అప్పగింత

మంత్రి, అధికార పార్టీ నేతలు సిఫారసు!

బడ్జెట్‌ కేటాయింపులు లేకున్నా టెండర్లు

హైకోర్టును ఆశ్రయించిన మరో కాంట్రాక్టరు

టీబీపీ ఎల్లెల్సీ, హెచ్చెల్సీ టెండర్లపై స్టే

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

అధికార పార్టీ నాయకులకు వాటాలు కావాలి. అధికారులకు పర్సంటేజీలు కావాలి. బడ్జెట్‌లో తగిన కేటాయింపులు లేకున్నా టెండర్లు పిలిచారు. తుంగభద్ర బోర్డు పరిధిలోని పనుల టెండర్ల ప్రక్రియలో నిబంధనలను తుంగలోకి తొక్కారు. ఓ కాంట్రాక్టరుకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారు. ఓ మంత్రి, అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు చెప్పిన కాంట్రాక్టరుకే పనులు దక్కేలా టెండర్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీబీపీ ఎల్లెల్సీ, హెచ్చెల్సీ ఆధునికీకరణ టెండర్లలో జీవో ఎంఎస్‌ నంబరు-67 రూల్స్‌ పాటించలేదు. గతేడాది చేసిన పనులకే బిల్లులు చెల్లించలేదు. తాజాగా మరో రూ.400 కోట్ల పనులకు టెండర్లు పిలవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై యారో కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ అధినేత ఎస్‌.విజయకుమార్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం టెండర్లపై ఇటీవల స్టే విధించింది.

టెండర్లలో ఇష్టారాజ్యం

1955-57 మధ్య నిర్మించిన తుంగభద్ర కాలువల్లో పూడిక చేరి సామర్థ్యం తగ్గడంతో ఆధునికీకరణకు శ్రీకార ం చుట్టారు. కర్నూలు జిల్లాలో ఎల్లెల్సీ ప్రధాన కాలువ 0/0 కి.మీ. నుంచి 250 కి.మీ. వరకు తుంగభద్ర బోర్డు పర్యవేక్షణలో ఉంది. ఇప్పటికే రూ.519.80 కోట్లతో 205 కి.మీ. వరకు ఆధునికీకరణ పనులు మొదలుపెట్టారు. మరో రూ.300 కోట్లతో 205 నుంచి 250 కి.మీ. వరకు ఆర్‌సీసీ లైనింగ్‌ పనులకు, రూ.100 కోట్లతో హెచ్చెల్సీ పరిధిలో లైనింగ్‌ పనులకు.. మొత్తం రూ.400 కోట్లతో 13 ప్యాకేజీలుగా విభజించి ఈ ఏడాది జనవరి 1న టెండర్లు పిలిచారు. టెండర్ల ప్రక్రియలో జీవో నంబరు-67లోని క్లాజ్‌-5 అమలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఓ కాంట్రాక్టరుకు ప్రయోజనం చేకూర్చేందుకే ఇంజనీర్లు టెండరు నిబంధనలు మార్చేశారనే ఆరోపణలున్నాయి. ఓ కీలక మంత్రి, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన ముగ్గురు ముఖ్య ప్రజాప్రతినిధులు బళ్లారి జిల్లా జిందాల్‌ కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి పనులు పంపకాలు చేశారని సమాచారం.

నిధులు లేకున్నా..

టీబీపీ బోర్డు అధికారుల లెక్కల ప్రకారం గతేడాది చేసిన పనులకే సుమారు రూ.250-300 కోట్ల వరకు బిల్లులు చెల్లించాలి. 2023-24 బడ్జెట్‌లో టీబీపీ ఎల్లెల్సీకి రూ.75 కోట్లు, హెచ్చెల్సీకి రూ.50 కోట్లు కలిపి రూ.125 కోట్లు కేటాయించారు. అందులోజీతాలకు రూ.25 కోట్లు కావాలని అంటున్నారు. మిగిలిన రూ.100 కోట్ల బడ్జెట్‌ గతేడాది బిల్లులకే సరిపోదు. తాజాగా మరో రూ.400 కోట్లతో టెండర్లు పిలవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లకు ఆమోదం తెలిపితే సంబంధిత ఇంజనీర్లకు 1.5 శాతం పర్సెంటేజ్‌ వస్తుందని, రాజకీయ నాయకులకు 5 శాతం వాటా ఇవ్వాల్సి వస్తుందని ఓ కాంట్రాక్టరు చెప్పడం గమనార్హం.

Updated Date - 2023-03-26T04:00:46+05:30 IST