రూ. 70 లక్షలకు దిక్కులేదు

ABN , First Publish Date - 2023-03-25T03:08:46+05:30 IST

వర్షాలు, వరద నీటిని ఒడిసి పట్టేందుకు తమ్మిలేరుపై చెక్‌డ్యాం, వంతెన నిర్మాణం చేపట్టాలని గత టీడీపీ ప్రభుత్వం భావించింది.

రూ. 70 లక్షలకు దిక్కులేదు

భూ సేకరణ చేశారు.. పరిహారం మరిచారు. అదిగో.. ఇదిగో అంటూ మూడేళ్లు గడిపారు. చివరికి మావల్ల కాదని ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. ఇప్పుడు అదే భూమిలో వంతెనతో పాటు చెక్‌డ్యాం నిర్మాణానికి సీఎం జగన్‌ శనివారం శంకుస్థాపన చేస్తున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో జరగబోయే ఆసరా పథకం మూడో విడత బటన్‌ నొక్కుడు కార్యక్రమంలో భాగంగా చెక్‌డ్యాం, వంతెన నిర్మాణానికి ఆయన దెందులూరు నుంచే శంకుస్థాపన చేస్తారు. టీడీపీ హయాంలో ప్రకటించిన వంతెన నిర్మాణ పనులకు మూడేళ్లు గడిచినా ఇటుక వేయని ప్రస్తుత ప్రభుత్వం నష్ట పరిహారంపై స్పష్టత ఇవ్వకుండానే హడావుడిగా శంకుస్థాపనకు తెరతీయడంపై భూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమ్మిలేరుపై తకరారు!

భూసేకరణ పరిహారం చెల్లించలేదని రైతుల ఆగ్రహం

చేతులెత్తేసిన అధికారులు... భూ దస్తావేజులు వెనక్కు

త్వరలోనే ఖాతాలో సొమ్ములు పడతాయని బుజ్జగింపులు

అయినా చెక్‌ డ్యాం, వంతెనకు నేడు సీఎం జగన్‌ శంకుస్థాపన

(ఏలూరు-ఆంధ్రజ్యోతి)

వర్షాలు, వరద నీటిని ఒడిసి పట్టేందుకు తమ్మిలేరుపై చెక్‌డ్యాం, వంతెన నిర్మాణం చేపట్టాలని గత టీడీపీ ప్రభుత్వం భావించింది. ముసునూరు మండలం బలివే గ్రామంతో పాటు పెదవేగి మండలం విజయరాయి గ్రామ సరిహద్దుల వద్ద వీటి నిర్మాణానికి అప్పట్లో నిర్ణయించారు. ఎన్నికల తర్వాత ఆ నిర్మాణంపై ప్రస్తుత ప్రభుత్వం శీతకన్ను వేసింది. ఆ తర్వాత అప్పటి ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలోని బలివే, విజయరాయికి చెందిన పలువురు రైతుల నుంచి సుమారు 2.19 ఎకరాల భూమిని సేకరించింది. అప్పట్లో రూ.90లక్షలు పరిహారం చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. తర్వాత అప్పటి కృష్ణాజిల్లాకు చెందిన రైతులకు కొంత పరిహారం చెల్లించగా, ప్రస్తుత ఏలూరు జిల్లాకు చెందిన ఆరుగురు రైతులకు సంబంధించిన 182-2, 189-1బీ సర్వే నంబర్లలోని సుమారు 1.87 ఎకరాలకు రూ.69,69,626 చెల్లించలేక మూడేళ్లుగా ఆపసోపాలు పడుతోంది. నేటి పర్యటనలో తమ్మిలేరుపై చెక్‌డ్యాం, వంతెన నిర్మాణానికి సీఎం దెందులూరు నుంచే శంకుస్థాపన వర్చువల్‌గా చేపట్టనుండటం భూ యజమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

మూడేళ్లుగా న్యాయం జరగలేదు

నా పేరిట ఉన్న భూమిని తమ్మిలేరు వంతెన నిర్మాణం కోసమని 2019లో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి 2020లో స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్ల నుంచి పరిహారం ఇస్తామని చెబుతూ ముగ్గురు ఆర్డీవోలు, ముగ్గురు తహసీల్దార్లు మారారే తప్ప మాకు న్యాయం జరగలేదు.

- వై.గాంధీ గంగాధరరావు, రైతు, వేలుపుచర్ల

వడ్డీతో సహా ఇప్పించాలి

డబ్బులు ఇచ్చాకే శంకుస్థాపన పెట్టుకుంటే బాగుండే ది. అలా కాకుండా రైతులను మోసం చేసి శంకుస్థాపనలు చేసి ఎవరిని మోసపుచ్చుదామని అనుకుంటున్నారు. తక్షణమే రావాల్సిన పరిహారం చెల్లించాలి.

- మేకతోటి చంద్రశేఖర్‌, రైతు, విజయరాయి

త్వరలోనే పరిహారం చెల్లిస్తాం

ఏలూరు జిల్లాకు చెందిన రైతులకు త్వరలోనే పరిహారం చెల్లిస్తాం. మా వద్ద నుంచి చేయాల్సినదంతా చేసేశాం. ప్రభుత్వం నుంచి నగదు రావడమే తరువాయి. మూడేళ్లు అయిందంటే ఎలా చెప్పగలం? త్వరలోనే వస్తుంది. గతంలో ఓసారి వచ్చి కూడా వెనక్కు వెళ్లాయి. అప్పట్లో కొన్ని సమస్యల వల్ల అలా జరిగింది.

- శ్రీనివాస్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ

నేడు దెందులూరుకు సీఎం జగన్‌

మూడో విడత ఆసరా నిధులు విడుదల

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

దెందులూరు, మార్చి 24: మూడో విడత ఆసరా పథకాన్ని శనివారం ఉదయం 11గంటలకు ఏలూరు జల్లా దెందులూరులో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి ప్రారంభించనున్నారు. ఉదయం 10.30కు సీఎం తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి దెందులూరుకు చేరుకుంటారు. అక్కడినుంచి జాతీయ రహదారిపై టీటీడీ కల్యాణ మండపం సమీపంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు బయలుదేరి వెళతారు. రూ.6,500 కోట్లను బటన్‌ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా 87 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. ఈ సందర్భంగా రూ.2.56 కోట్లతో దెందులూరులో నిర్మించిన 30 పడకల ప్రభుత్వాసుపత్రిని సీఎం వర్చువల్‌గా ప్రారంభిస్తారు. అలాగే పెదవేగి మండలం జగన్నాథపురం పరిధిలో నూతనంగా నిర్మించనున్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సిస్టంను, పెదవేగిలో నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తారు.

చేతులెత్తేసిన అధికారులు

తమకు అందాల్సిన పరిహారం కోసం ఏళ్ల తరబడి ఏలూరు జిల్లా రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రికార్డులన్నీ పంపించేశామని, ఆర్థిక శాఖ నుంచి నిధులు వస్తే తప్ప తామేమీ చేయలేమని ఒక దశలో అధికారులు చెప్పేశారు. రైతులు మాత్రం నిన్నమొన్నటి వరకు ఏలూరు ఆర్డీవో కార్యాలయంతో పాటు పెదవేగి తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఓవైపు భూ సేకరణ జరిగిందనే కారణంతో ఆ భూమి సర్వే నంబర్లను రికార్డుల్లో బ్లాక్‌ చేశారు. దీంతో ఆ భూమిపై యజమానులకు బ్యాంకుల నుంచి రుణాలు, తనఖాలు.. క్రయ, విక్రయాలకు వీలులేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిహారం చెల్లించకపోగా కొద్ది రోజుల క్రితం రైతులకు సంబంధించిన భూ ధ్రువపత్రాలు, పాస్‌ పుస్తకాలను అధికారులు తిరిగి ఇచ్చేశారు. ప్రభుత్వం పరిహారం చెల్లిస్తే నగదు ఖాతాల్లోకి నేరుగా వస్తుందని, కార్యాలయాల చుట్టూ తిరిగినా ఉపయోగం లేదని చెప్పారు. కాగా, శంకుస్థాపనకు ముందురోజు వరకు ఖాతాల్లోకి పరిహారం జమ కాకపోవడంపై రైతులు తర్జనభర్జనలు పడుతున్నారు.

ఎందుకీ కంగారు?

మూడేళ్ల క్రితం రూ.12కోట్ల అంచనాలు ఉన్న చెక్‌డ్యాం, వంతెన నిర్మాణం ఖర్చు ఇపుడు రూ.18 కోట్లకు చేరింది. రూ.69.69 లక్షల పరిహారాన్నే మూడేళ్లుగా చెల్లించలేని ప్రభుత్వం ఇంతమొత్తం ఖర్చుపెట్టి నిర్మాణం పూర్తి చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనే ఓసారి నగదు రావాల్సి ఉన్నా సీఎ్‌ఫఎమ్‌ఎస్‌ ఖాతాలో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిందని, త్వరలోనే ఆ నగదు వచ్చేస్తుందని జలవనరుల శాఖ, రెవెన్యూ అధికారులు చెప్పుకొస్తున్నారు. సీఎం కార్యక్రమం జరిగే ముందు రైతులు తిరగబడే అవకాశం ఉండటంతో అధికారులు బుజ్జగింపు పనుల్లో పడ్డారు. రైతులకు ఫోన్లు చేసి పరిహారం మీ ఖాతాలో జమవుతుందని చెప్పాం కదా! ఎందుకు కంగారు పడుతున్నారంటూ నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2023-03-25T03:08:46+05:30 IST