టీడీపీ, జనసేన ప్రభుత్వంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ

ABN , First Publish Date - 2023-06-02T04:24:54+05:30 IST

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడుతుందని ప్రజలు భావిస్తున్నారని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

టీడీపీ, జనసేన ప్రభుత్వంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ

● సింహం సింగిల్‌గా వస్తుందన్న నినాదమేమైందో?

● కేఏ పాల్‌ హైకోర్టు న్యాయమూర్తి అయివుంటే అవినాశ్‌కు జీవితకాలం ముందస్తు బెయిల్‌ ఇచ్చేవాడు

● పార్టీలో ఉంచుకుంటే నాకు గౌరవం ఇవ్వండి లేకపోతే నన్ను సస్పెండ్‌ చేయండి: రఘురామ

న్యూఢిల్లీ, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడుతుందని ప్రజలు భావిస్తున్నారని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘లోకేశ్‌ నిర్వహిస్తున్న యువ గళం పాదయాత్రకు జమ్మలమడుగులో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒకవైపు చంద్రబాబు సభలకు అనూహ్య ప్రజాదరణ లభిస్తుండగా, మరొకవైపు లోకేశ్‌ పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు లభిస్తున్న ప్రజాదరణను చూసి కొంప కొల్లేరు అవుతుందేమోనన్న భయంతో సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారేమో..! గతంలో తరచూ వినిపించే ‘సింహం సింగిల్‌గా వస్తుంది’ అన్న డైలాగ్‌ ఇప్పుడు వినిపించడం లేదు. కేఏ పాల్‌తో కలిసి సింహం వస్తుందేమో చూడాలి. ఢిల్లీ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉండి, అప్రూవర్‌గా మారిన శరత్‌ చంద్రారెడ్డి, సీఎం జగన్‌కి అత్యంత సన్నిహితుడు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌, కాకినాడ పోర్టులో అత్యధిక వాటా శరత్‌ చంద్రారెడ్డికి చెందిన కంపెనీలదే. అడ్వాన్స్‌ డిస్టలరీస్‌ పేరిట రాష్ట్రంలో అధిక మద్యాన్ని విక్రయిస్తున్నారు. వైసీపీలో కీలక నేత విజయసాయిరెడ్డి అల్లుడి అన్నే ఈ శరత్‌ చంద్రారెడ్డి. ఆయన అప్రూవర్‌గా మారబోతున్నారని ఆంధ్రజ్యోతి దినపత్రిక రెండు రోజుల క్రితమే వార్త రాసింది. చెప్పినట్టుగానే సీబీఐ కోర్టులో శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. పత్రికల్లో రాసినట్టుగా ఆయన అప్రూవర్‌గా మారడం నిజమే అయినప్పుడు...

శరత్‌చంద్రారెడ్డి కొన్ని పేర్లను చెబితే వివేకా హత్య కేసు విస్తృత కుట్రలో కీలక వ్యక్తి పేరు రాకుండా చేస్తామని చెప్పినట్లుగా వచ్చిన వార్తా కథనాలను కూడా నమ్మాల్సి వస్తోంది. దీనితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జగన్మోహన్‌రెడ్డి మోసం చేస్తున్నారని అర్థం అవుతుంది. ఇది పక్కా ఆధారాలతో చెప్పడం లేదు. సగం నిజం అయినప్పుడు, మిగతాది కూడా నిజమే అవుతుందని నమ్మాల్సిందే. ఢిల్లీ మద్యం కుంభకోణంలో శరత్‌ చంద్రారెడ్డి ఎవరెవరి పేర్లను చెబుతారో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. కేఏ పాల్‌ హైకోర్టు న్యాయమూర్తి అయి ఉంటే, వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి యావత్‌ జీవిత ముందస్తు బెయిలు ఇచ్చి ఉండేవారు’’ అని రఘురామరాజు అన్నారు. ‘‘గతంలో ప్రధానమంత్రికి రాసిన లేఖలో సీఎం జగన్‌... నన్ను రోగ్‌ అని సంబోధించారు. నాకంటే చిన్నవాడు, తెలిసీ తెలియనితనంతో రోగ్‌ అని సంబోధించి ఉంటాడని అనుకున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి నాకంటే వయసులో పెద్దవాడు. ఆయన బుద్ధి ఏమయ్యింది. నేను రోగ్‌ అయితే పార్టీలో ఎందుకు ఉంచుకున్నారు? పార్టీలో ఉంచుకుంటే గౌరవించండి. లేకపోతే పార్టీ నుంచి బహిష్కరించండి. అంతేకానీ పార్టీలో ఉంచుకొని అగౌరవ పరుస్తాము అంటే నేను అంతకు పదింతలు అగౌరవపరచగలను.. తస్మాత్‌ జాగ్రత్త’’ అంటూ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.

Updated Date - 2023-06-02T04:24:54+05:30 IST