స్పందన.. ఆవేదన!
ABN , First Publish Date - 2023-02-21T03:41:48+05:30 IST
రెవెన్యూ అధికారులే డబ్బులకు ఆశపడి తమ స్థలాన్ని వేరొకరికి రాసిచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తూ కొందరు రైతులు..
పురుగుమందు తాగేందుకు యత్నించిన రైతులు
కిరోసిన్ పోసుకుని తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం
న్యాయం చేయాలని చిరుద్యోగి ఆవేదన..
ఫిర్యాదు చేసేందుకు వచ్చి కుప్పకూలిన తండ్రి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రెవెన్యూ అధికారులే డబ్బులకు ఆశపడి తమ స్థలాన్ని వేరొకరికి రాసిచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తూ కొందరు రైతులు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులే తమను చావబాది తమ స్థలంలోకి అడుగుపెట్టనివ్వలేదని వాపోతూ తల్లీకొడుకు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోబోయారు. పై అధికారుల వేధింపులు తాళలేకపోతున్నానని, తనకు న్యాయం చేయాలని లేదంటే కారుణ్య మరణానికైనా అనుమతించాలని ఓ మహిళా చిరుద్యోగి ఆవేదన. కుమార్తెకు న్యాయం చేయండని వేడుకునేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన తండ్రి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన వైనం. ఇవన్నీ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో చోటుచేసుకున్న దృశ్యాలు. వివరాలిలా ఉన్నాయి.
పోలీసులు కొట్టారు.. న్యాయం చేయండి..!
కడప జిల్లా కొండాపురం మండలం సుగుమంచిపల్లెలో నివాసం ఉంటున్న రొండుగాండ్ల చిన్నబాలయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు, తల్లి మేరీ ఉన్నారు. వీరి గ్రామం గండికోట ప్రాజెక్టు ముంపు కిందకు వచ్చింది. దీంతో అందరినీ ఖాళీచేయించి సుగుమంచిపల్లె పునరావాస కేంద్రంలో ఉంచారు. బాధిత కటుంబాలకు 5సెంట్ల చొప్పున ప్రభుత్వం ఇళ్ల స్థలం కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న తమ స్థలం వద్దకు చిన్నబాలయ్య వెళ్లగా.. అక్కడ విధుల్లో ఉన్న హోంగార్డు తిరుపాల్, మరో ఇద్దరు పోలీసులు వచ్చి అతనిపై దాడి చేసి, సెల్‌ఫోను లాక్కున్నారు. ఆవేదనకు గురైన చిన్నబాలయ్య 13న విషద్రావణం తాగాడు. గమనించిన భార్య వెంటనే ఆయనను రిమ్స్‌లో చేర్పించారు. 17న పోలీసులు విచారించి హోంగార్డు తిరుపాల్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. మిగిలిన ఇద్దరిపై కేసు నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో చిన్నబాలయ్య తన తల్లి, కుటుంబ సభ్యులతో పాటు సోమవారం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ మేరీ, చిన్నబాలయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుని వారిని రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ సీఐ సుదర్శన ప్రసాద్ పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
రెవెన్యూ అధికారులు అన్యాయం చేశారు
రెవెన్యూ అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి తమ భూమిని తమ దాయాదులకు దక్కేలా చేశారని, తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోతూ కొందరు రైతులు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. అనంతపురం జిల్లా విడపనకల్లు తహసీల్దారు కార్యాలయం వద్ద సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. విడపనకల్లు మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనారయణ, నారప్ప, వన్నూరప్ప తదితరులు తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో సర్వే నంబరు 530-బీ1లో రూ.కోట్ల విలువైన 26సెంట్ల భూమి తమ పేరిట ఉండేదని తెలిపారు. కొంత మంది రెవెన్యూ అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి తమ దాయాది జయరాముడుకు సహకరించి, రిజిస్ట్రేషన్ అయ్యేలా చేశారని అన్నారు. దీనిపై తాము కోర్టును ఆశ్రయించామన్నారు. తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.
కారుణ్య మరణానికి అనుమతివ్వండి
బీసీ వసతి గృహంలో అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకు బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తనను టార్గెట్ చేశారని, సస్పెన్షన్, బదిలీల పేరిట వేధిస్తున్నారని వాపోతూ ఓ మహిళా చిరుద్యోగి శ్రీకాకుళం కలెక్టర్‌ను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని లేదంటే కారుణ్య మరణానికైనా అనుమతివ్వాలని స్పందనలో కలెక్టర్‌కు మొరపెట్టుకుంది. బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పైడి సూర్యనారాయణ మృతిచెందడంతో ప్రభుత్వం కారుణ్య నియామకం కింద 20 ఏళ్ల కిందట ఆయన భార్య లక్ష్మిని అటెండర్ పోస్టులో నియమించింది. ఇటీవల పొందూరు మండలం కింతలి బీసీ వసతిగృహంలో అవినీతిని బయటపెట్టినందుకు బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారని, సస్పెన్షన్ చేయించారని పేర్కొంది. తాజాగా తనను పొందూరు బదిలీ చేశారని.. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న తాను అంత దూరం వెళ్లలేనని పేర్కొంది. స్పందించిన కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ ఆమెకు శ్రీకాకుళం బీసీ వసతిగృహానికి బదిలీ చేయాలని ఆదేశించారు.
కుమార్తెకు న్యాయం కోసం వచ్చి.. కుప్పకూలిన తండ్రి
కుమార్తెను అత్తింటి వారు వేధిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరేందుకు వచ్చిన ఓ తండ్రి ఎస్పీ కార్యాలయంలోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతిచెందాడు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. పల్నాడు జిల్లా నకిరేకల్ మండలం డేచవరానికి చెందిన ఏరువ గోవిందరెడ్డి (55) గతేడాది ఆగస్టు 15న తన కుమార్తె కృష్ణవేణిని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వాకా మల్లికార్జునరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో రూ.లక్ష కట్నం కూడా ఇచ్చారు. అయితే పెళ్లైన తర్వాత నుంచి అత్తమామాలు భాస్కరరెడ్డి, మాధవి, మరిది శ్రీకాంత్‌రెడ్డి ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారు. అదనంగా రూ.10 లక్షలు కట్నం తెచ్చేవరకు ఇంటికి రావొద్దని పుట్టింటికి పంపించారు. ఈ క్రమంలో తండ్రి గోవిందరెడ్డి తన కుమార్తెను వెంటబెట్టుకొని రుద్రవరం వెళితే వారు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆయన ఫిర్యాదు చేసేందుకు సోమవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే కార్యాలయం బయట వేచిఉన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. పక్కనే ఉన్న కుమార్తె ఏమైందో తెలియక బోరుమంది. సిబ్బంది స్పందించి గోవిందరెడ్డిని రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందారని నిర్ధారించారు. విషయం తెలిసి అల్లుడు మల్లికార్జునరెడ్డి అక్కడకు చేరుకున్నారు. భార్యాభర్తలిద్దరూ కలిసి గోవిందరెడ్డి మృతదేహాన్ని డేచవరానికి తీసుకెళ్లారు.