వారంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీఓ

ABN , First Publish Date - 2023-08-22T03:26:02+05:30 IST

కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకు సంబంధించి వారంరోజుల్లో జీఓ విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్‌ రెడ్డి చెప్పారు.

వారంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ  జీఓ

35 డిమాండ్లు తీర్చే వరకు కొత్త సమస్యలొద్దు.. ఇది నా డిమాండ్‌

ఏపీఎన్‌జీఓ రాష్ట్ర మహాసభల్లో సీఎస్‌ జవహర్‌ రెడ్డి

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆన్‌లైన్‌ డ్యాష్‌ బోర్డు: పోలా భాస్కర్‌

విజయవాడ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకు సంబంధించి వారంరోజుల్లో జీఓ విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్‌ రెడ్డి చెప్పారు. సోమవారం విజయవాడలో జరిగిన ఏపీఎన్‌జీఓ 21వ రాష్ట్ర మహాసభల రెండో సెషన్‌లో సీఎ్‌సతోపాటు, జీఏడీ కార్యదర్శి పోలా భాస్కర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్‌జీఓ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందించారు. అనంతరం మహాసభలనుద్దేశించి జవహర్‌రెడ్డి మాట్లాడుతూ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధ్దీకరణకు సంబంధించి ఈ రోజునే జీఓ ఇవ్వాలనుకున్నామని, కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయామని, వారంలోనే ఇస్తామని తెలిపారు. ఐదు సంవత్సరాల నిబంధనను ఉపసంహరించుకోవటం వల్ల మొత్తం 10వేల మంది ఉద్యోగుల వరకు రెగ్యులర్‌ అవుతారని తెలిపారు. కొన్ని నిబంధనల మేరకు వీరందరినీ క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని సంస్కరిస్తామని తెలిపారు. ఇదే సందర్భంలో తాను కూడా ఉద్యోగ సంఘాలకు ఒక డిమాండ్‌ విధిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే పరిష్కరించినవి కాకుండా మిగిలిపోయిన 35 అంశాలను పరిష్కరించే వరకు కొత్త సమస్యలు తీసుకురావద్దని అన్నారు. యాప్‌లతో ఇబ్బందులు పడుతున్న ఏఎన్‌ఎంలకు సంబంధించి ఇవేమీ లేకుండా చేస్తానంటూ.. తల్లుల మరణాల రేటు, శిశువుల మరణాల రేటు తగ్గించటానికి కృషి చేయాలని షరతు విధించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచితే అడిషనల్‌ డీఏ కూడా ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ కార్యదర్శి పోలా భాస్కర్‌ మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలో ఆన్‌లైన్‌ డ్యాష్‌బోర్డు విధానాన్ని తీసుకు వస్తున్నామన్నారు. అన్ని హెచ్‌ఓడీలతో ఇది అనుసంధానమై ఉంటుందని తెలిపారు. ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఎప్పటికప్పుడు జీఏడీ పరిధిలో డ్యాష్‌బోర్డులను చూస్తూ ఆ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

Updated Date - 2023-08-22T03:26:02+05:30 IST