రిటర్నబుల్ ప్లాట్లపై రియల్టర్ల గురి!
ABN , Publish Date - Dec 26 , 2023 | 03:16 AM
గత ప్రభుత్వ హయాంలో దేదీప్యమానంగా వెలిగిన రాజధాని గ్రామాలు నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో చీకట్లో మగ్గిపోతున్నాయి.
రాజధాని రైతుల ప్లాట్లపై కన్ను
నాలుగున్నరేళ్ల తరువాత అమ్మకాల్లో కదలిక
ప్రభుత్వం మారే అవకాశం ఉండడంతోనే!
ఇదే అదనుగా జోరందుకున్న పైరవీలు
లిటిగేషన్ల వంకతో తక్కువ రేట్లకు
గజం రూ.20వేలుండే స్థలానికి
రూ.12 వేల చొప్పున బేరం
మొద్దు నిద్రపోతున్న రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ
(గుంటూరు-ఆంధ్రజ్యోతి)
గత ప్రభుత్వ హయాంలో దేదీప్యమానంగా వెలిగిన రాజధాని గ్రామాలు నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో చీకట్లో మగ్గిపోతున్నాయి. డబ్బులు లేక రాజధాని కోసం పొలాలిచ్చినందుకు ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు అమ్ముకుందామన్నా అటువైపు చూసిన దాఖలాలు లేవు. అలాంటిది కొద్ది రోజులుగా రియల్ ఎస్టేటురంగంలో కదలిక వచ్చింది. మరో మూడు నెలల్లో ప్రభుత్వం మారుతుందన్న వార్తలు జోరందుకోవడంతోనే ఈ కదలిక వచ్చిందని రైతులు చెబుతున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో రియల్ ఎస్టేటు హడావుడి కనిపిస్తోంది. ఇదే అదనుగా భూముల అమ్మకం, కొనుగోలు విషయంలో పైరవీలు జోరుగా సాగుతున్నాయి. రైతుల ప్లాట్లు, స్థలాలను కారు చౌకగా కొట్టేసేందుకు రియల్టర్లు కొత్త కొత్త లిటిగేషన్లు తెరమీదకు తెచ్చి రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
అసైన్డ్ భూమి వంకతో టోకరా!
రాజధాని కోసం 28వేల మంది రైతులు 34వేల ఎకరాలను భూ సమీకరణ కింద ఇచ్చారు. వారిలో 3,139 వేలమంది రైతులు తమ వద్దనున్న 2,689 ఎకరాల అసైన్డ్ భూములు ఇచ్చారు. ఇదే అంశాన్ని సీఆర్డీఏ తన రికార్డుల్లో భూమి స్వభావాన్ని తెలిపే కాలమ్‌లో నమోదు చేసింది. భూమి స్వభావాన్ని తెలిపే ఆ కాలమ్‌ను పైరవీకారులకు బ్రహ్మాస్త్రంగా మారింది. దాన్ని అడ్డుపెట్టుకుని రైతుల ప్లాట్ల విలువను తెగ్గోస్తున్నారు. పట్టాదారు రైతులతోపాటు, అసైన్డ్ రైతులకు కూడా గత ప్రభుత్వం ఒకే లే అవుట్లో స్థలాలు ఇచ్చింది. ఆ విషయాన్ని మరుగుపరిచి రైతులను వంచిస్తున్నారు. కొంతమంది రైతులు అసైన్డ్ భూములు ఇచ్చారు కాబట్టి వారికి ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ హక్కు ఉండదని ప్రచారం మొదలు పెట్టారు. దాంతోపాటు పట్టాదారు రైతులు కొంతమందికి అసైన్డ్ భూముల్లో ప్లాట్లు ఇచ్చారని, అవి కూడా రిజిస్ట్రేషన్‌కు చెల్లవని తప్పుడు ప్రచారాన్ని రాజధాని గ్రామాల్లో విపరీతంగా ప్రచారంలో పెట్టారు. దీంతో రైతుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దీన్ని ఆసరా చేసుకుని గజం 12, 13 వేల రూపాయలకు కాజేస్తున్నారు. గతంలో తుళ్లూరు, మందడం గ్రామాల్లో ప్లాట్ల విలువ గజం రూ. 30 వేల వరకూ వెళ్లింది. అలాంటి ప్రాంతాల్లో కూడా స్థలాల విలువ ఈ ప్రచారంతో సగానికి పైగా పడిపోయింది. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
కష్టనష్టాలకు కారణం ప్రభుత్వమే!
తమకు జీవనాధారమైన పంట పొలాలను రాజధాని కోసం త్యాగం చేసినందుకుగానూ రైతులకు ప్రభుత్వం ప్రతిఏటా కౌలు చెల్లించే విధంగా సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కింది. ఏటా కౌలు చెల్లించకుండా రైతులను వేధిస్తోంది. ఈ ఏడాది కూడా మేలో రావాల్సిన కౌలు ఇప్పటి వరకూ రాలేదు. జీవనాధారం కోల్పోయి, చేసేందుకు పనులు లేని స్థితిలో రైతులు అనేకమంది గడిచిన నాలుగేళ్లలో అప్పులపాలయ్యారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను అమ్ముకోవాల్సిన దుస్థితి వారికి దాపురించింది. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని ‘రియల్ అక్రమార్కులు’ చెలరేగిపోతున్నారు. రేట్లు తగ్గించి కాజేస్తున్నారు.సీఆర్డీఏ అధికారులకు తెలియపరిచినా.. మమ్మల్ని ఏమి చేయమంటారంటూ నిర్లక్ష్యంగా ఎదురు ప్రశ్నిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అధికారపార్టీ తరఫున మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించిన గంజి చిరంజీవి దృష్టికి కూడా రైతులు విషయాన్ని తీసుకెళ్లారు. తొలుత ఫోనులో స్పందించిన ఆయన.. ఆ తరువాత ఫోను ఎత్తడం మానేశారని రైతులు వాపోతున్నారు.
రాజధానిలోని ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి స్వరూప అనే మహిళా రైతు ఇటీవల తనకు ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాటును అమ్ముకుంది. గజం స్థలాన్ని రూ.12 వేల చొప్పున మొత్తం 450 గజాలు విక్రయించింది. కానీ ఆ లేఅవుట్లో గజం రూ.20 నుంచి 25 వేల రేటు పలుకుతోంది. రకరకాల కారణాలు చెప్పి ఆ స్థలాన్ని కొండపల్లి వీటీపీఎ్‌సలో పనిచేసే ఒక వ్యక్తి కారు చౌకగా కాజేశాడు. ఆ తరువాత అదే స్థలాన్ని గజం రూ. రూ.20వేలకు తిరిగి అమ్ముకున్నాడు. అంటే సదరు మహిళా రైతు 90 లక్షల విలువ చేసే తన స్థలాన్ని రూ. 54లక్షలకు అమ్ముకుంది. 36 లక్షలు నష్టపోయింది. పది రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజధాని నగరాల్లో ప్లాట్ల కొనుగోలు, అమ్మకాల్లో కదలిక రావడంతో గత కొన్ని రోజులుగా రాజధాని గ్రామాల్లో ఈ తంతు జోరుగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంగానీ, సీఆర్డీఏ అధికారులుగానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విశేషం.