రతన్ చంద్రకర్: ‘జరావా’ల జీవన ప్రదాత
ABN , First Publish Date - 2023-01-26T04:37:23+05:30 IST
ప్రధాన జనజీవన స్రవంతికి దూరంగా... అండమాన్‌లోని ఉత్తర సెంటినెల్ దీవిలో ఇప్పటికీ ‘ఆదిమ’ జీవనం గడుపుతున్న తెగ...
ప్రధాన జనజీవన స్రవంతికి దూరంగా... అండమాన్‌లోని ఉత్తర సెంటినెల్ దీవిలో ఇప్పటికీ ‘ఆదిమ’ జీవనం గడుపుతున్న తెగ... జరావా! బయటి ప్రపంచం నుంచి వచ్చే మనుషులను వారు శత్రువులుగా చూస్తారు. విల్లంబులతో వేటాడతారు. అలాంటి జరావా తెగకు చెందిన వారు 1999లో తట్టు బారిన పడ్డారు. వ్యాధి విజృంభణతో ఆ తెగ పూర్తిగా అంతరించి పోయే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో... అండమాన్ నికోబార్‌కు చెందిన ప్రభుత్వ వైద్యుడు రతన్ చంద్రకర్ రంగంలోకి దిగారు. జరావాలకు దగ్గరై... వారికి వైద్యం అందించారు. వారి జీవన విధానాలను నిశితంగా పరిశీలించి... ‘అండమనీర్ ఆదిమ్ జనజాతి జరావా’ అనే పుస్తకాన్ని రచించారు. ఆయన అందించిన వైద్యసేవల కారణంగానే... జరావాల జనాభా 76 నుంచి ఇప్పుడు 270కి పెరిగింది.
హీరాబాయ్ లోబి: ‘సిద్ధి’... శక్తి
గుజరాత్‌కు చెందిన హీరాబాయ్ లోబి... చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. నాన్నమ్మ చెంత పెరిగి పెద్దయ్యారు. తన బతుకు తాను చూసుకోవడం కాదు... మరొకరికి అండగా ఉండాలని భావించారు. సిద్ధి అనే గిరిజన తెగ సామాజిక వికాసానికి విశేష కృషి చేశారు. అనేక ‘బాలవాడీ’లు స్థాపించారు. ‘మహిళా వికాస్ మండల్’ పేరుతో సిద్ధి మహిళల స్వయం స్వావలంబనకు తోడ్పాటు అందించారు.
మునీశ్వర్ : రెండు రూపాయల డాక్టర్
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన మునీశ్వర్ సైన్యంలో వైద్యుడిగా సేవలందించారు. రిటైర్ అయ్యాక సమాజానికి సేవ చేయడం ప్రారంభించారు. 2010 దాకా కేవలం రూ.2 ఫీజు తీసుకుని పేదలకు వైద్యం చేశారు. ఇప్పుడు ఆ ఫీజును రూ.20కి పెంచారు. గత 50 ఏళ్లుగా ఈ వైద్య నారాయణుడు నిరుపేదలకు ఆరోగ్య భాగ్యం అందిస్తూనే ఉన్నారు.
వీపీ అప్పుకట్టన్: జన సేవ
కేరళలోని కన్నూర్‌కు చెందిన వీపీ అప్పుకట్టన్ వయసు 99 సంవత్సరాలు. ఆయన జీవితమంతా ప్రజా సేవకే అంకితం. గత 80 సంవత్సరాలుగా బలహీనవర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అప్పుకట్టన్‌కు ‘కన్నూర్ గాంధీ’గా పేరు. ఖాదీ ధరించే ఈ సంస్కృత విద్వాంసుడు... గాంధేయవాది.
వడివేల్, సడైయ్యన్: ‘పాము’లపై ప్రేమ
పాము కనపడిందా? నో ప్రాబ్లమ్... వడివేల్ గోపాల్, మాసి సడైయ్యన్ వాటిని పట్టుకుంటారు. అదికూడా... తమ పూర్వీకుల నుంచి నేర్చుకున్న సంప్రదాయ పద్ధతుల్లో! ఈ విద్యను దేశ విదేశాల్లో అనేక మందికి నేర్పించారు. తమిళనాడులోని ‘ఇరుళ’ తెగకు చెందిన వీరిద్దరికీ కలిపి ‘పద్మశ్రీ’ వరించింది.
రిసింగ్‌బోర్ కుర్‌కలాంగ్,
మంగళ్ రాయ్: గిరిజన విద్వాంసులు
మేఘాలయలోని ఖాసి తెగకు చెందిన రిసింగ్‌బోర్ కుర్‌కలాంగ్ ‘దుయ్‌తారా’ అనే ప్రత్యేక సంగీత పరికరాన్ని సృష్టించారు. నాలుగు తీగలతో గిటార్‌ను పోలిన ఈ పరికరాన్ని పనస కలపతో తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ఈ సంగీత మాధుర్యాన్ని పంచుతున్నారు. ఇక... పశ్చిమ బెంగాల్‌కు చెందిన మంగళకాంతి రాయ్ ప్రఖ్యాత జానపద కళాకారుడు. ‘వయోలిన్’ను పోలిన ‘సరిందా’ అనే వాయిద్యంపై పక్షుల పిలుపులు వినిపించడం ఆయన ప్రత్యేకత. 102 ఏళ్ల మంగళకాంతి రాయ్ 80 ఏళ్లుగా సరిందా ప్రదర్శనలు ఇస్తున్నారు.
మునివెంకటప్ప: డప్పు కొడితే...
కర్ణాటకలోని చిక్‌బళ్లాపురకు మునివెంకటప్ప (72) ‘తమటె’ పట్టుకున్నారంటే ఊరు ఊరంతా ఊగిపోవాల్సిందే. 16 ఏళ్ల వయసు నుంచే ఆయన తమటె వాయిస్తున్నారు. ఈ కళ అంతరించకుండా కాపాడుతున్నారు. తమెట వాయించడంలో యువతకు శిక్షణ ఇస్తున్నారు.