మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం
ABN , First Publish Date - 2023-01-15T03:01:44+05:30 IST
ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని బాలిక(14)పై ఏడుగురు వ్యక్తులు విడివిడిగా అత్యాచారానికి పాల్పడ్డారు.
ఏడుగురు నిందితులు.. నాలుగు నెలలు నరకం
గర్భందాల్చిన బాధితురాలు.. అబార్షన్
తీవ్ర రక్తస్రావంతో అనారోగ్యం.. ఆలస్యంగా వెలుగులోకి..
కొండపి, జనవరి 14 : ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని బాలిక(14)పై ఏడుగురు వ్యక్తులు విడివిడిగా అత్యాచారానికి పాల్పడ్డారు. నాలుగు నెలలు ఆమెకు నరకం చూపించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలివీ.. గ్రామంలోని బాలిక14)కు మతిస్థిమితం లేదు. ఆమె తల్లికి కూడా అదే సమస్య ఉంది. తండ్రి తాగుబోతు. దీనిని అవకాశంగా తీసుకొని గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఆ బాలికపై కన్నేశారు. ఆమెను లోబర్చుకుని విడివిడిగా లైంగికదాడి చేశారు. నాలుగు నెలలు తమ పశువాంఛ తీర్చుకున్నారు. ఇరవై రోజుల క్రితం బాలికకు కడుపునొప్పి రావడంతో సమీప గ్రామంలో ఉండే అమ్మమ్మ బాధితురాలిని టంగుటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లింది. బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు తేల్చారు. ఆందోళనకు గురైన ఆమె.. మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించి, తల్లి చెంతకు చేర్చింది. అప్పటి నుంచి బాలికకు తీవ్ర రక్తస్రావమై అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లి తిరిగి అమ్మమ్మ వద్దకు తీసుకెళ్లింది. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు శుక్రవారం రాత్రి ఆమెతో కొండపి పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.