Share News

రాష్ట్రమంతా ర్యాలీలు నేడు ఆశా కార్యకర్తల నిరసనలు ఉధృతం

ABN , Publish Date - Dec 26 , 2023 | 03:08 AM

ఆందోళనబాటలోని ఆశాలు దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చి ఆందోళనలకు దిగిన ఆశాలు..

రాష్ట్రమంతా ర్యాలీలు నేడు ఆశా కార్యకర్తల నిరసనలు ఉధృతం

మండల కేంద్రాల్లో పెద్దఎత్తున ర్యాలీలు..

ఎంఆర్వోలను కలిసి వినతిపత్రం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఆందోళనబాటలోని ఆశాలు దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చి ఆందోళనలకు దిగిన ఆశాలు.. విడతల వారీగా నిరసనలను ఉధృతం చేయాలని నిర్ణయించారు. కనీస వేతనాలు చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులతో పాటు ఉద్యోగ విరమణ అనంతరం ప్రయోజనాలు కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు ఈ నెల 14, 15 తేదీల్లో జిల్లాల్లోని అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. ఇప్పటికే అంగన్వాడీ వర్కర్లు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. వీరికి తోడు ఆశా వర్కర్లు కూడా పూర్తిస్థాయిలో అందోళన బాట పట్టేందుకు సిద్ధం అయ్యారు. మంగళవారం మండల కేంద్రాల్లో భారీ ర్యాలీలకు పిలుపునిచ్చారు. మండలాల్లో ఉండే ఎంఆర్వోలకు వినతిపత్రాలు అందించనున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేలు గౌరవవేతనాలు ఇస్తామని ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ హమీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ హామీ అమలు కాలేదు. ప్రోత్సాహకాలు, కొంత గౌరవేతనం కలుపుకు న్నా చాలా మంది ఆశా వర్కర్లకు రూ.పది వేలు కూడా రావడం లేదు. అందుకే ఆశా కనీసం వేతనం డిమాండ్‌ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆశా వర్కర్లకు పనిభారం పెరిగిపోయింది. ఎన్‌హెచ్‌ఎం నిబంధనల ప్రకారం వారి విధులను వారితో చేయించడం లేదు. ఆశా వర్కర్లని రాజకీయ సభలు, సమావేశాలకు వాడేస్తున్నారు. ఆశాలకు ప్రభుత్వం అందించే పథకాలు ఏవీ వర్తించడం లేదు. పని భారం, చాలీచాలని గౌరవ వేతనాలతో ఆశా వర్కర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి ప్రభుత్వం పూర్తిస్థాయి సెలవులు ఇవ్వడం లేదు. శని, ఆదివారం అన్న తేడా లేకుండా ఫ్యామిలీ డాక్టర్‌, జగనన్న ఆరోగ్య సురక్ష, ఫీవర్‌ సర్వేలు అంటూ వారిని సొంత కుటుంబాలకు దూరం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ రెగ్యులర్‌ ఉద్యోగులు మాదిరిగా ఆశా వర్కర్లు కూడా విలేజ్‌ క్లినిక్స్‌లో ఉదయం, సాయంత్రం రెండుసార్లు సంతకాలు చేయాలన్న నిబంధన పెట్టారు. ఒకవైపు గ్రామాల్లో పర్యటించాలి, మరోవైపు విలేజ్‌ క్లినిక్స్‌లో సంతకాలు, సర్వే పేరుతో వారితో ఆడుకుంటున్నారు. ఇంత కష్టపడినా రిటైర్మెంట్‌ తర్వాత ఏమైనా బెనిఫిట్స్‌ వస్తాయా అంటే అది లేదు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో ఆశా వర్కర్లు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేయబోతున్నారు.

ఇవీ డిమాండ్లు

ఆశావర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి.

పనిభారం బాగా పెంచేశారు. దానిని తగ్గించాలి

ప్రభుత్వ సెలవులు ఉండాలి

ఉద్యోగ విరమణ అనంతర ప్రయోజనాలను కల్పించాలి

Updated Date - Dec 26 , 2023 | 03:10 AM