60వేల మంది టీచర్లకు జీతాల్లేవ్!
ABN , First Publish Date - 2023-07-21T03:22:59+05:30 IST
రాష్ట్రంలో సుమారు 60వేల మంది టీచర్లకు జూన్ నెల జీతాలు ఇప్పటికీ అందలేదు. గత నెలలో చేపట్టిన సాధారణ బదిలీల్లో 58వేల మందికి పైగా టీచర్లు బదిలీ అయ్యారు.
బదిలీలు, పదోన్నతుల కారణంగా జాప్యం
ట్రెజరీ కార్యాలయానికి అందని వివరాలు
పాఠశాల విద్యాశాఖ నిర్వాకంతో అవస్థలు
గత నెలలో 58 వేల మంది టీచర్లు బదిలీ
ఆరువేల మందికి పైగా పదోన్నతులు
అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుమారు 60వేల మంది టీచర్లకు జూన్ నెల జీతాలు ఇప్పటికీ అందలేదు. గత నెలలో చేపట్టిన సాధారణ బదిలీల్లో 58వేల మందికి పైగా టీచర్లు బదిలీ అయ్యారు. సుమారు 6వేల మందికి పదోన్నతులు లభించగా వారిలో కొందరికి స్థానచలనం కలిగింది. మరో 679 మంది ఎంఈవో-2 పోస్టులు కొత్తగా సృష్టించారు. దీంతో దాదాపు 60వేల మంది కొత్త స్థానాలకు వెళ్లారు. దానికి అనుగుణంగా సవరించిన కేడర్ స్ర్టెంత్ వివరాలను డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ్‌సకు పాఠశాల విద్యాశాఖ పంపించాల్సి ఉంది. నెల రోజులు దాటినా ఇప్పటికీ పంపలేదు. రాష్ట్ర ట్రెజరీ విభాగంలో ఆమోదం పొందితే అక్కడి నుంచి కొత్త వివరాలు జిల్లా ట్రెజరీ కార్యాలయాలకు వెళ్తాయి.
ఆ తర్వాత సబ్ ట్రెజరీ కార్యాలయాలకు ఆ వివరాలు చేరితే జీతాలు వేస్తారు. కానీ పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యంతో ఇంతవరకూ రాష్ట్ర ట్రెజరీ కార్యాలయానికే కొత్త వివరాలు వెళ్లలేదు. దీంతో బదిలీతో గానీ, పదోన్నతితో గానీ ఏదో ఒక రూపంలో స్థానచలనం కలిగిన టీచర్లు, ఎంఈవోలందరికీ జూన్ నెల జీతాలు ఖాతాల్లో పడలేదు. దీనిపై ఉపాధ్యాయులుఅధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందన కరువైంది. కాగా, ఈ వ్యవహారంపై ట్రెజరీ కార్యాలయమే స్పందించింది. వెంటనే టీచర్ల కొత్త వివరాలు పంపాలని పాఠశాల విద్యాశాఖను గురువారం కోరింది. అయితే ఈ వివరాలన్నీ క్షేత్రస్థాయికి చేరేందుకు సుమారు వారం రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే జూన్, జూలై రెండు నెలల జీతాలు దాదాపు ఒకేసారి ఆ టీచర్లకు అందుతాయి. కాగా, టీచర్లకు జీతాలు వెంటనే చెల్లించాలని ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.సాయి శ్రీనివాస్, హెచ్.తిమ్మన్న గురువారం పాఠశాల విద్య సర్వీసెస్ జేడీ మువ్వా రామలింగంను కలసి వినతిపత్రం ఇచ్చారు.