నైరుతి మరింత ఆలస్యం

ABN , First Publish Date - 2023-06-07T03:20:10+05:30 IST

కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం ఇంకా అనుకూలించడం లేదు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది.

నైరుతి మరింత ఆలస్యం

నేడు కేరళలోకి ప్రవేశంపై సందిగ్ధం

● రేపు లేదా ఎల్లుండి రావచ్చన్న స్కైమెట్‌..అరేబియాలో తుఫాన్‌

విశాఖపట్నం, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం ఇంకా అనుకూలించడం లేదు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడుతూ రాత్రికి తుఫాన్‌గా మారింది. దీనికి బంగ్లాదేశ్‌ సూచించిన ‘బిపర్జాయ్‌’ అని పేరు పెట్టారు. తుఫాన్‌ మరో తొమ్మిది రోజులు అరేబియాలో ఉత్తరంగా కొనసాగే క్రమంలో అతి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలు బుధవారం కేరళను తాకుతాయని సోమవారం ప్రకటించింది. అయితే, దీనికి అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్‌ అడ్డంకిగా మారుతుందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. కాగా దక్షిణ అరేబియా సముద్రంలో పడమర గాలులు బలపడినప్పటికీ మంగళవారం వరకు కేరళ, లక్షద్వీప్‌, కోస్తా కర్ణాటకల్లో వర్షాలు ఇంకా ఊపందుకోలేదు.

అయితే, బుధవారం నుంచి వర్షాలు పెరిగి.. గురు, శుక్రవారాల్లో మరింత విస్తారంగా కురుస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ వెల్లడించింది. ఈనెల ఎనిమిది లేదా తొమ్మిదో తేదీన కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. ఇదిలావుండగా కేరళలోకి రుతుపవనాల ప్రవేశంపై ఈ ఏడాది విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు విశ్లేషించారు. గత నెలలో దక్షిణ అండమాన్‌లో ప్రవేశించిన రుతుపవనాలు పది రోజులపాటు అక్కడే ఉండిపోయాయన్నారు. లక్షద్వీప్‌ వరకు వచ్చిన తరువాత కేరళ దిశగా పయనించే సమయంలో అరేబియా సముద్రంలో తుఫాన్‌ ఏర్పడడం ప్రతికూలంగా మారిందన్నారు. ఈనెల 15వ తేదీ వరకు అరేబియా సముద్రంలో తుఫాన్‌ ఉంటుందని, ఆ తరువాత నైరుతి రుతుపవనాల్లో పురోగతి ఉంటుందని తెలిపారు. దీనిని బట్టి రుతుపవనాలు ఈనెల మూడో వారంలో ఏపీలో ప్రవేశిస్తాయని పేర్కొన్నారు.

Updated Date - 2023-06-07T03:20:10+05:30 IST