Rain Disaster : సీమలో వాన బీభత్సం

ABN , First Publish Date - 2023-06-02T03:52:48+05:30 IST

రాయలసీమలో గాలివాన బీభత్సం సృష్టించింది. కర్నూలు, నంద్యాల, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో గురువారం భారీవర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పిడుగు పడి నలుగురు మృతిచెందగా, తిరుపతిలో చెట్టుకూలి ఓ వైద్యుడు దుర్మరణం పాలయ్యారు.

 Rain Disaster : సీమలో వాన బీభత్సం
అనంతపురం జిల్లా కల్లూరులో పిడుగుపాటుకు దగ్ధమవుతున్న కొబ్బరి చెట్టు

  • కర్నూలు, నంద్యాలలో పిడుగుపాటుకు నలుగురు మృతి

  • తిరుపతిలో చెట్టుకూలి వైద్యుడి దుర్మరణం

  • మాల్దీవుల్లో రుతుపవనాల విస్తరణ

  • 4న కేరళలో ప్రవేశం

  • ● అనంతలోనూ పిడుగులతో కూడిన వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాయలసీమలో గాలివాన బీభత్సం సృష్టించింది. కర్నూలు, నంద్యాల, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో గురువారం భారీవర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పిడుగు పడి నలుగురు మృతిచెందగా, తిరుపతిలో చెట్టుకూలి ఓ వైద్యుడు దుర్మరణం పాలయ్యారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లు గ్రామానికి చెందిన మలదాసరి చిన్న వీరేష్‌ (35), భార్య రత్నమ్మతో కలిసి పత్తి విత్తనాలు విత్తేందుకు పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి సమీపంలో పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో వేప చెట్టుకింద ఉన్న రత్నమ్మ, వీరేష్‌ స్పృహ తప్పి పడిపోయారు. 20 నిమిషాల తర్వాత సృహలోకి వచ్చిన రత్నమ్మ విగతజీవిగా పడిఉన్న భర్తను చూసి బోరున విలపించింది. హాలహర్వి మండలం విరుపాపురం గ్రామంలో వివాహానికి వచ్చిన కర్ణాటక రాష్ట్రం, శిరుగుప్ప తాలుకాకు చెందిన శేఖర్‌ గౌడ్‌ (30), బసవరాజ్‌ గౌడ్‌ (31) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుమలదిన్నెకు చెందిన డిగ్రీ విద్యార్థి బందెల చక్రవర్తి (20) పిడుగు పాటుకు ప్రాణాలు కోల్పోయాడు.

చెట్టు కూలి వైద్యుడి దుర్మరణం

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ఆవరణలో భారీ వృక్షం నేలకూలడంతో దాని కిందపడి ఓ వైద్యుడు దుర్మరణం పాలయ్యారు. కడప రిమ్స్‌ విశ్రాంత ఆచార్యులు, ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఆర్‌.గుర్రప్ప రెండో కుమార్తె శ్రీరవళి తిరుపతి కృష్ణతేజ డెంటల్‌ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నారు. ఆమెను చూసి వెళ్లేందుకు గుర్రప్ప గురువారం తిరుపతికి వచ్చారు. సాయంత్రం కుమార్తెతో కలిసి గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో గాలి వాన ధాటికి ఆలయ ఆవరణలోని పురాతన రావిచెట్టు నేలకూలింది. అదే సమయంలో చెట్టుకింద ఉన్న డాక్టర్‌ గుర్రప్ప తలకు తీవ్రగాయమై రక్తం ధారలా కారింది. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు.

pidugu.jpg

కర్నూలు జిల్లా విరుపాపురంలో పిడుగుపడి మృతిచెందిన వ్యక్తిని తీసుకొస్తున్న గ్రామస్థులు

విస్తరిస్తున్న రుతుపవనాలు

● 4న కేరళలో ప్రవేశం.. 5 తర్వాత అల్పపీడనం

విశాఖపట్నం, అమరావతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు గురువారం మాల్టీవులు, కొమరిన్‌, ఆగ్నేయ, ఆరేబియా సముద్రం, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ విస్తరించాయి. రానున్న రెండు రోజుల్లో ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు ఈ నెల 4న కేరళలో ప్రవేశిస్తాయని వెల్లడించింది. కాగా మరికొందరు నిపుణులు మాత్రం ఈ నెల మూడో తేదీనే కేరళను తాకవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ నెల 5న ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, ఆ తర్వాత 48 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

మళ్లీ వడగాల్పులు, ఎండ తీవ్రత

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గురువారం ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అనేక మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన అకాల వర్షాలు పడొచ్చునని హెచ్చరించింది.

Updated Date - 2023-06-02T03:52:48+05:30 IST