ర్యాగింగే పొట్టన పెట్టుకుంది!
ABN , First Publish Date - 2023-02-21T03:27:45+05:30 IST
తమ కుమారుడిని ర్యాగింగ్ భూతమే పొట్టన పెట్టుకుందని ఇంజనీరింగ్ విద్యార్థి టీ.ప్రదీప్ తల్లిదండ్రులు పెంచలయ్య, లక్ష్మీకుమారి ఆరోపించారు.
సీనియర్లే రైలు కింద తోసేశారు..
ఇంజనీరింగ్ విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన
కావలి, ఫిబ్రవరి 20: తమ కుమారుడిని ర్యాగింగ్ భూతమే పొట్టన పెట్టుకుందని ఇంజనీరింగ్ విద్యార్థి టీ.ప్రదీప్ తల్లిదండ్రులు పెంచలయ్య, లక్ష్మీకుమారి ఆరోపించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి శివార్లలో శనివారం రైలు కిందపడి చనిపోయిన ఆర్‌ఎస్సార్ కళాశాల ఇంజనీరింగ్ విద్యార్థి ప్రదీప్ (20) మృతదేహానికి కావలి ఏరియా వైద్యశాలలో సోమవారం పోస్ట్‌మార్టం చేశారు. తమ బిడ్డ మృతదేహాన్ని ఆర్‌ఎస్సార్ కాలేజీకి తీసుకెళ్లి న్యాయం అడుగుతామంటూ మృతుడి తల్లిదండ్రులు, బంధువులు మార్చురీ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. పలావు, మద్యం తెచ్చి ఇవ్వాలని, అమ్మాయిల ఫోన్ నంబర్లు ఇవ్వాలని సీనియర్లు ప్రదీ్‌పను వేధించారన్నారు. దానిని తట్టుకోలేకే కాలేజి మానేస్తానని ప్రదీప్ చెప్పేవాడని ఆవేదన చెందారు. శివరాత్రికి ముందు తాను కళాశాల మానేస్తున్నట్లు చెప్పడంతో ఎక్కడ విషయం బయటకు వస్తుందోనని తమ కుమారుడిని రైలు కిందకు తోసి చంపేశారని ఆరోపించారు. సదరు కళాశాల ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌రెడ్డిది కావడంతో కేసును ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మృతదేహాన్ని కాలేజీ వద్దకు తీసుకు వెళతామని తల్లిదండ్రులు చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైల్వే శాఖ నుంచి కేసును తాము తీసుకుని విచారిస్తామని, న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించి, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.