‘సైకో పోవాలి..’

ABN , First Publish Date - 2023-04-03T02:02:24+05:30 IST

ప్రకాశం జిల్లాలోని రామతీర్థం తిరునాళ్లను పురస్కరించుకొని టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న భారీ ప్రభను తరలించే సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

‘సైకో పోవాలి..’

పాట పెడతారా.. ఎంత ధైర్యం!

టీడీపీ నేతలపై పోలీసుల ఫైర్‌

ఇరు పక్షాల మధ్య తోపులాట

పార్టీ అభిమానికి తీవ్ర గాయాలు

లాఠీతో కొట్టారన్న టీడీపీ నేతలు

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఘటన

చీమకుర్తి, ఏప్రిల్‌ 2: ప్రకాశం జిల్లాలోని రామతీర్థం తిరునాళ్లను పురస్కరించుకొని టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న భారీ ప్రభను తరలించే సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’ అనే పాటను పెట్టడపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ పాట పెడతారా? ఎంత ధైర్యం’’ అంటూ నిప్పులుచెరిగారు. ఇది.. పోలీసులకు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు మధ్య తోపులాటకు దారితీసింది. ఈ తోపులాటలో టీడీపీ అభిమాని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన చీమకుర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. రామతీర్థం తిరునాళ్లు బుధవారం జరగనున్నాయి. దీనికోసం టీడీపీ ఆధ్వర్యంలో భారీ ప్రభను ఏర్పాటు చేశారు. దాన్ని చీమకుర్తి పట్టణం నుంచి రామతీర్థం వరకు ఆదివారం ర్యాలీగా తరలించారు. దీనికి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. ఊరేగింపులో ఏర్పాటు చేసిన డీజేలో ‘సైకో దిగిపోవాలి.. సైకిల్‌ రావాలి’ పాటను ప్లే చేశారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు ఈ పాటను ఆపివేయాలని నిర్వాహకులను హెచ్చరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో టీడీపీ అభిమాని కోటేశ్వరరావు ముఖంపై రక్తగాయాలయ్యాయి. పోలీసుల లాఠీ దెబ్బలతోనే కోటేశ్వరరావు గాయపడినట్టు టీడీపీ నాయకులు ఆరోపించారు. అయితే, పోలీసుల వద్ద అసలు లాఠీలే లేవని ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. తోపులాట సందర్భంగా కోటేశ్వరావు ఆటోపై పడటంతోనే గాయాలయ్యాయని చెప్పారు.

Updated Date - 2023-04-03T02:02:24+05:30 IST