సొంత నియోజకవర్గంలో సీఎంకు నిరసన సెగ
ABN , First Publish Date - 2023-11-10T03:17:07+05:30 IST
ముఖ్యమంత్రి జగన్‌కు సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగిలింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ మేరకు భూములిస్తే తమకు న్యాయం జరగలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని పెద్దరంగాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సీఎం రావాలి మా మొర
తమ మొర వినాలంటూ స్థానికుల నినాదాలు
భూములు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వలేదు
వైఎస్ హామీ మేరకే ఇచ్చామని వెల్లడి
పులివెందులలో రోడ్లన్నీ దిగ్బంధం
ట్రాఫిక్‌లో ఆగిన స్కూలు బస్సులు
పులివెందుల టౌన్, నవంబరు 9: ముఖ్యమంత్రి జగన్‌కు సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగిలింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ మేరకు భూములిస్తే తమకు న్యాయం జరగలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని పెద్దరంగాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సీఎం రావాలి మా మొర వినాలి’ అంటూ నినాదాలు చేశారు. గురువారం పులివెందులలో జగన్ పర్యటన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం జగన్ పులివెందులకు వెళ్లారు. గురువారం ఏపీకార్ల్ వద్ద అంతర్జాతీయ స్వామి నారాయణ గురుకుల పాఠశాల భూమి పూజకు వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నినాదాలు చేయడంతో జగన్ వారి వద్దకు వచ్చారు. పెద్దరంగాపురం గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. పులివెందుల అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన వారికి పాస్‌బుక్‌కు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని 2009లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారన్నారు. కోట్లు విలువ చేసే సుమారు 650 ఎకరాలను ఇచ్చామని, ఎకరాకు రూ.1.40 లక్షల చొప్పున రూ.365 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఏళ్లు గడిచిపోగా కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయని, ఉద్యోగాలు మాత్రం వేరేవారికి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములిచ్చిన తమకందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఇందుకు జగన్ సానుకూలంగా స్పందించారు. తమ ఊరు మున్సిపాలిటీలో పేరుకు మొదటి స్థానంలో ఉందని, అభివృద్ధిలో మాత్రం చివరి స్థానంలో ఉందన్నారు. మూడేళ్ల క్రితం భూగర్భ డ్రైనేజీ అంటూ బాగా ఉన్న రోడ్లన్నీ పగలగొట్టారని, తవ్విన గుంతలను కనీసం పూడ్చకుండానే కాంట్రాక్టర్లు వదిలేశారని తెలిపారు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా, ఎంపీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు జగన్ సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు రోడ్లన్నీ దిగ్బంధించారు. పులివెందుల చుట్టూ రింగురోడ్డు సర్కిళ్లలో ఏ ఒక్క వాహనాన్ని కూడా వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించారు. స్కూలు బస్సులన్నీ రోడ్లపైనే సుమారు గంటపాటు ట్రాఫిక్‌లో నిలిచిపోవడంతో పిల్లలు అవస్థలు పడ్డారు. పులివెందులలో 64.54 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు జగన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానమ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు జగన్ హాజరయ్యారు.
ఊడిపడ్డ శిలాఫలకం కర్టన్
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పులివెందుల శిల్పారామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరిస్తున్నప్పుడు సీఎం తాడు పట్టుకుని లాగే సమయంలో కర్టెన్ మొత్తం ఊడిపోయి కిందపడిపోయింది. దీంతో అధికారులపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.