ఫీజు చెల్లించాలని ఒత్తిళ్లు... ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2023-02-07T03:52:38+05:30 IST

ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయడంతో ఇంటర్‌ విద్యార్థిని తీవ్ర మనస్థాపానికి గురైంది.

ఫీజు చెల్లించాలని ఒత్తిళ్లు... ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కాలేజీ భవంతిపై నుంచి దూకిన భవ్యశ్రీ.. తీవ్ర గాయాలు.. ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు

అనంతపురం క్రైం/విద్య, ఫిబ్రవరి 6: ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయడంతో ఇంటర్‌ విద్యార్థిని తీవ్ర మనస్థాపానికి గురైంది. కాలేజీ భవనం మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన సదాశివ, జ్యోతి దంపతులు అనంతపురం పాతూరులో నివాసం ఉండేవారు. వారి కుమార్తె భవ్యశ్రీ అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న నారాయణ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ఉపాధి కోసం బెంగుళూరుకు వలస వెళ్తూ.. ఆమెను నీరుగంటి వీధిలో ఉన్న అమ్మమ్మ అలివేలమ్మ వద్ద వదిలి వెళ్లారు. కళాశాల ఫీజు రూ.12 వేలు చెల్లించాల్సి ఉండగా, ఇటీవల రూ.10 వేలు కట్టారు. మరో రూ.2 వేలు పెండింగ్‌ ఉంది. దీనికి తోడు పరీక్ష, రికార్డు ఫీజు రూ.820 కలిపి.. మొత్తం రూ.2,820 చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో మనస్థాపానికి గురైన భవ్యశ్రీ సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కళాశాల భవనం మూడో అంతస్తుపై నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

లెటర్‌ డ్రామా: ఇంటర్‌ విదార్థిని భవ్యశ్రీ ఆత్మహత్యాయత్నాకి వేరే కారణాలున్నాయని చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సూసైడ్‌ నోట్‌ డ్రామాకు తెరలేపారు. తన అమ్మా నాన్న విడిపోయారని, వారిని ఎవరూ కలపలేరని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని విద్యార్థి లేఖ రాసి మరీ దూకినట్లు ప్రచారం జరిగింది. విద్యార్థిని సూసైడ్‌ నోట్‌ రాసిందని అనంతపురం వన్‌టౌన్‌ సీఐ రవిశంకర్‌రెడ్డి మీడియాతో అన్నారు. ఆ లేఖను సీజ్‌ చేశామని, తల్లిదండ్రులకు చూపించి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. కానీ తాను లేఖ రాయలేదని విద్యార్థి సంఘాల నాయకులతో బాధిత విద్యార్థిని చెప్పినట్లు తెలిసింది.

Updated Date - 2023-02-07T03:52:39+05:30 IST