Share News

Prashant Kishore : వ్యూహం మార్చిన పీకే!

ABN , Publish Date - Dec 24 , 2023 | 03:29 AM

ఎన్నికల వ్యూహకర్త, ఐ-ప్యాక్‌ వ్యవస్థాపకుడు, గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే)... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమయ్యారు. జగన్‌ పాలన, విధానాలపై ప్రశాంత్‌ కిశోర్‌ కొన్నాళ్లుగా పరోక్ష

Prashant Kishore : వ్యూహం మార్చిన పీకే!

టీడీపీ తరఫున పని చేసేందుకు ఆసక్తి

జనం నాడి గుర్తించే ‘దేశం’వైపు అడుగులు!?

చంద్రబాబుతో నాలుగు గంటలపాటు భేటీ

జగన్‌ సర్కారుపై అభిప్రాయాల వెల్లడి

యువతలో తీవ్ర వ్యతిరేకత.. అభివృద్ధిలేమి

బాదుడుతో పేద, మధ్య తరగతిలో ఆగ్రహం

పథకాలు మాత్రమే ఏ పార్టీనీ గెలిపించలేవు

తన ఆలోచనలు పంచుకున్న ప్రశాంత్‌ కిశోర్‌

గతంలోనూ చంద్రబాబు, లోకేశ్‌తో ఆయన భేటీ

2019లో వైసీపీ గెలుపులో పీకే కీలక పాత్ర

ఐ-ప్యాక్‌కు గుడ్‌బై చెప్పి బిహార్‌ రాజకీయాల్లోకి!

టీడీపీ, వైసీపీ వ్యూహకర్తలు ఆయన సహచరులే

ఇప్పుడు నేరుగా టీడీపీతో టచ్‌లోకి వచ్చిన పీకే

‘‘ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా కొరవడటంతో యువత జగన్‌ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. విపరీతంగా పెరిగిన ధరలు, ఏటికేడాది పెరుగుతూ పోతున్న కరెంటు చార్జీలు, పన్నుల బాదుడు... పేద, మధ్య తరగతి ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. పథకాల లబ్ధిదారులు తమను బయటపడేస్తారన్న ఒకేఒక్క ఆశతో వైసీపీ ఉంది. ఇలాంటి ఒకే ఒక్క ఆశ ఏ పార్టీనీ గెలిపించలేదు’’

-ప్రశాంత్‌ కిశోర్‌

అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వ్యూహకర్త, ఐ-ప్యాక్‌ వ్యవస్థాపకుడు, గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే)... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమయ్యారు. జగన్‌ పాలన, విధానాలపై ప్రశాంత్‌ కిశోర్‌ కొన్నాళ్లుగా పరోక్ష విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు... టీడీపీతో కలిసి పనిచేసేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. శనివారం హఠాత్తుగా విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో కలిసి ప్రశాంత్‌ కిశోర్‌ ఇక్కడికి వచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయనతోపాటు సహచరులు శంతను సింగ్‌, శ్రీకాంత్‌ కూడా ఉన్నారు. లోకేశ్‌ పాదయాత్రకు సమన్వయకర్తగా వ్యవహరించిన కిలారు రాజేశ్‌ కూడా ఈ బృందంతో ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితిపై తన అంచనాలను చంద్రబాబుకు పీకే వివరించినట్లు తెలిసింది. ‘‘ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా కొరవడటంతో యువత జగన్‌ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత విస్తరించడంలో యువతే కీలకం. విపరీతంగా పెరిగిన ధరలు, ఏటికేడాది పెరుగుతూ పోతున్న కరెంటు చార్జీలు, పన్నుల బాదుడు పేద, మధ్య తరగతి ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోవడం, రోడ్లు కూడా వేయలేని దుస్థితి ప్రభుత్వ పరపతిని బాగా దెబ్బ తీశాయి. ఈ ప్రభుత్వంలో అహంకారం, రౌడీయిజం పెరిగిపోయాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యాపించింది. పథకాల లబ్ధిదారులు తమను బయటపడేస్తారన్న ఒకేఒక్క ఆశతో వైసీపీ ఉంది. కేవలం ఒకే ఒక్క ఆశ ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీని గెలిపించలేదు. అయునా వ్యూహపరంగా బలంగా ఉండాలి. ఎత్తుగడల్లో వేగం ఉండాలి’’ అని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నట్లు తెలిసింది. వ్యూహకర్తగా ఆయన పాత్ర ఎలా ఉండాలన్నదానిపై కూడా కొంత చర్చ జరిగింది. త్వరలో మరోసారి భేటీ కావాలని వారు నిర్ణయించారు. సుమారు నాలుగు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత లోకేశ్‌తో కలిసి పీకే హైదరాబాద్‌ వెళ్లిపోయారు.

ముందు నుంచే టీడీపీతో టచ్‌లో..

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగు నాట ప్రశాంత్‌ కిశోర్‌ పేరు మార్మోగింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం పలు రకాల వ్యూహాలు అమలు చేశారని ఆయన పేరు తెచ్చుకొన్నారు. అదే సమయంలో ఆయన అమలు చేసిన ఎన్నికల వ్యూహాలపై కూడా విమర్శలు చెలరేగాయి. తర్వాతి కాలంలో జగన్‌, ప్రశాంత్‌ కిశోర్‌ల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. జగన్‌ వ్యవహార శైలి, నిర్ణయాలతో అనేక సందర్భాల్లో పీకే విభేదించారని సమాచారం. బంగారు పళ్లెంలో అధికారం అందితే జగన్‌ వలకబోసుకొంటున్నారని కొందరు ఎంపీల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. చంద్రబాబు అరెస్టు నిర్ణయంతో కూడా ఆయన విభేదించారు. జగన్‌ తన గొయ్యి తానే తవ్వుకొంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజమహేంద్రవరం జైల్లో ఉండగా... న్యాయ నిపుణులతో సంప్రదింపుల నిమిత్తం ఆయన కుమారుడు లోకేశ్‌ కొన్ని రోజులు ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్‌ కిశోర్‌ ఆ సమయంలోనే లోకేశ్‌తో తనంతట తానుగా భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్టు అంశాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లడంపై తన ఆలోచనలు పంచుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్‌లోని నివాసంలో ఆయనను ప్రశాంత్‌ కిశోర్‌ ఒకసారి కలిశారు. అరెస్టుకు ముందు కూడా ఒకసారి కలిశారు. పెద్దగా ప్రచారం లేకుండానే ఈ భేటీలు జరిగాయి. శనివారం తొలిసారిగా... లోకేశ్‌తో కలిసి మరీ ప్రశాంత్‌ కిశోర్‌ చంద్రబాబు నివాసానికి వెళ్లారు. వివిధ రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే గెలుపు గుర్రాలను ఎంచుకొని వారి తరఫున ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేయడం ప్రశాంత్‌ కిశోర్‌ ప్రధానమైన వ్యూహమని, అదే కోణంలో ఇప్పుడు టీడీపీ వైపు ఆయన ఆసక్తి చూపిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అటూ... ఇటూ ‘ఐప్యాక్‌’

ప్రశాంత్‌ కిశోర్‌ నెలకొల్పిన ఐ-ప్యాక్‌ సంస్థకు చెం దిన బృందం ఒకటి ప్రస్తుతం వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తోంది. దీనికి రిషిరాజ్‌ నేతృత్వం వహిస్తున్నారు. బిహార్‌లో తన రాజకీయ భవిష్యత్తు నిర్మించుకోవాలనుకొన్న ప్రశాంత్‌ కిశోర్‌ ఆ సమయంలో తాను ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన కింద పనిచేసిన వారు సంస్థ సారథ్యం చేపట్టారు. ఐదారు బృందాలుగా విడిపోయి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, వివిధ పార్టీలకు ‘వ్యూహకర్త’లుగా వ్యవహరిస్తున్నారు. పీకే పాత సహచరుడు రాబిన్‌ శర్మ బృందం ఇప్పటికే టీడీపీ ఎన్నికల వ్యూహం కోసం పనిచేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ కోసం పనిచేస్తున్న ఐ-ప్యాక్‌ బృందం శనివారం సాయంత్రం హడావుడిగా ఒక ట్వీట్‌ విడుదల చేసింది. ‘ఏడాదిగా వైసీపీ కోసం పని చేస్తున్నాం. 2024లో జగన్‌ గెలిచేదాకా శ్రమిస్తూనే ఉంటాం’ అని తెలిపింది.

వైసీపీ, టీడీపీ మధ్య ట్వీట్ల యుద్ధం

ప్రశాంత్‌ కిశోర్‌ టీడీపీ అధినేత చంద్రబాబును కలవడంతో వైసీపీ, టీడీపీ మధ్య ‘ఎక్స్‌’లో ట్వీట్ల వార్‌ మొదలైంది. దీనిపై మొదటి ట్వీట్‌ మంత్రి అంబటి రాంబాబు నుంచి వచ్చింది. ‘మెటీరియల్‌ మంచిది కాకపోతే మేస్త్రీ ఏం చేస్తాడు’ అని పీకేను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ‘నిజమే. మెటీరియల్‌ లేదనేగా గంటకు కూడా ఎవరూ రానిది’ అని మాజీ మంత్రి కెఎస్‌ జవహర్‌ ఆయనకు బదులిచ్చారు. మెటీరియల్‌ బాగోలేదనే మేస్ర్తీ మరో కాంట్రాక్టుకు వెళ్లిపోయాడని ఒక టీడీపీ కార్యకర్త అంబటికి కౌంటర్‌ ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ నుంచి మరో పోస్ట్‌ వచ్చింది. ‘‘కోడికత్తి, వివేకానంద రెడ్డి హత్య పీకే ప్లాన్‌ అన్నారు. ఇప్పుడు ఆ పీకేనే ఇంటికి తెచ్చుకొన్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘బాబాయి హత్య, కోడి కత్తి వెనుక వ్యూహం మొత్తం జగన్‌దే అని ఒప్పుకొన్నందుకు కోడిగుడ్డు మంత్రికి ధన్యవాదాలు’ అని మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి ఆయనకు కౌంటర్‌ ఇచ్చారు.

Updated Date - Dec 24 , 2023 | 03:29 AM