భూసేకరణ, పునరావాసానికి.. ఏప్రిల్ లక్ష్యం!

ABN , First Publish Date - 2023-06-01T05:38:26+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే గిరిజనులకు సకాలంలో సహాయ పునరావాస కార్యక్రమాలను అందించాలని.. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

భూసేకరణ, పునరావాసానికి.. ఏప్రిల్ లక్ష్యం!

● పోలవరంపై రాష్ట్రానికి కేంద్రం ఆదేశం

● ప్రత్యేక కార్యాచరణతో వెళ్లాలని సూచన

● ఢిల్లీ నుంచి వీసీలో కేంద్రంసమీక్ష

● నేడు పనుల పురోగతిపై షెకావత్‌ భేటీ

● షెకావత్‌ సిఫారసు చేసినా.. ఆమోదం అనుమానమే

అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే గిరిజనులకు సకాలంలో సహాయ పునరావాస కార్యక్రమాలను అందించాలని.. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌నాటికి ఈ కార్యక్రమాలు పూర్తికావాలని లక్ష్యంగా పెట్టింది. నిర్వాసితులకు తక్షణమే సహాయ పునరావాసం అమలుపై కేంద్ర గిరిజన శాఖ కమిషనర్‌ బుధవారం ఢిల్లీ నుంచి వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. రాష్ట్ర జల వనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూరులో తొలి దశ భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల లక్ష్యాలను వేగంగా చేరుకునేలా నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని కేంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 41.15 మీటర్ల కాంటూరులో 92 టీఎంసీల నీటిని నిల్వ చేయడం వల్ల ఐదు మండలాల్లోని 54 రెవెన్యూ గ్రామాలకు చెందిన 115 ఆవాసాలు దెబ్బతింటాయని.. ఇందులో 25 గ్రామాలను పూర్తిగా తరలించాలని.. ఇంకా 9,254 కుటుంబాలను పునరావాస కాలనీలకు పంపాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. భూసేకరణకు రూ.1,200 కోట్లు, సహాయ పునరావాసానికి రూ.2,749 కోట్లను వ్యయమవుతుందని వెల్లడించింది. ఈ కార్యక్రమాలను వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసేలా కార్యచరణ ప్రణాళికలను అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది.

కేంద్ర కేబినెట్‌ ఆమోదిస్తేనే..

పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతి, అంచనాలపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నేతృత్వంలో గురువారం ఢిల్లీలో మరో సమీక్ష జరుగనుంది. అయితే ఇవన్నీ ఉత్తుత్తి సమీక్షలేనని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్ర జల వనరుల శాఖకు పంపిన సమాచారంలో.. 45.72 మీటర్ల కాంటూరులో 194.6 టీఎంసీల గరిష్ఠ నీటి నిల్వ దిశగా కాకుండా.. తొలిదశ పేరుచెప్పి 41.15 మీటర్ల కాంటూరులో 92 టీఎంసీల నీటి నిల్వకే పరిమితం చేస్తూ షెకావత్‌ ఉన్నతస్థాయి సమీక్షకు సన్నద్ధం కావడాన్ని వారు ఆక్షేపిస్తున్నారు. అంతేకాదు.. సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర కేబినెట్‌ ఆమోదానికి జలశక్తి శాఖ పంపకపోవడాన్ని తప్పుబడుతున్నారు. 2013–14 అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకు మాత్రమే కేంద్ర కేబినెట్‌ గతంలో ఆమోదం తెలిపింది. దీనికి మించి రాష్ట్రప్రభుత్వం చేసే వ్యయాన్ని జలశక్తి శాఖ పరిగణనలోకి తీసుకోవడం లేదు. సంబంధిత బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా పంపుదామనుకున్నా.. అంచనా వ్యయం దాటినందున బిల్లులను పీపీఏ తన స్థాయిలోనే వెనక్కి పంపేస్తోంది. జలశక్తి శాఖ వరకూ వెళ్లడం లేదు. 2017–18 ధరల ప్రకారం అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు 2019 ఫిబ్రవరి 22వ తేదీన కేంద్ర జలసంఘం పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపింది. దీనిని కేంద్ర కమిటీ రూ.47,725.74 కోట్లకు సవరించింది. ఇందులో నుంచి.. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రూ.20,398.61 కోట్లు తీసేస్తే ఇంకా చేయాల్సిన వ్యయం మరో రూ.23,202.49 కోట్లు అని జలశక్తి శాఖ చెబుతోంది. కానీ దీనిని కేంద్ర కేబినెట్‌ ఆమోదానికి పంపడం లేదు. కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరిస్తేనే కేబినెట్‌ వరకు వెళ్తుంది. సవరించిన అంచనాలను మంత్రివర్గం ఆమోదిస్తే తప్ప.. ప్రాజెక్టుకు పైసా కూడా మంజూరయ్యే అవకాశం లేదు. అంటే.. రాష్ట్రం చేసిన వ్యయం కూడా రీయింబర్స్‌ కాదన్న మాటే. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లయినా కేంద్రంపై ఈ దిశగా ఒత్తిడి తేవడం లేదని సాగునీటి నిపుణులు విమర్శిస్తున్నారు. పైగా 41.15 మీటర్ల కాంటూరు వరకే నిర్మాణాన్ని పరిమితం చేసేందుకు తొలి దశ అని పేరు పెట్టారు. ఈ కాంటూరులో నిర్మాణ పనులు, భూసేకరణ సహాయ పునరావాసానికి ఎంత వ్యయమవుతుందో చెప్పాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. రూ.16,952.07 కోట్లుగా జల వనరుల శాఖ అంచనా వేసి మే 4న కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్రం వెలిబుచ్చిన సందేహాలకూ సమాధానాలు పంపింది. ఈ అంచనా వ్యయంపైనే షెకావత్‌ గురువారం సమీక్ష జరుపుతారు. దీనికి ఆమోదం లభిస్తే జలశక్తి శాఖ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే తొలిదశ అంచనాల వరకే కేబినెట్‌ ఆమోదం తీసుకోవడం ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రా జెక్టు మొత్తం వ్యయానికి కేబినెట్‌ ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. నిధులపై స్పష్టత ఇవ్వకుండా చేస్తున్న ఈ సమీక్షలన్నీ ఉత్తుత్తివేనని అంటున్నారు. గతంలోనూ షెకావత్‌ చేసిన సిఫారసులను కేంద్ర ఆర్థిక శాఖ పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు. సీఎం జగన్‌ అభ్యర్థన మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి అడ్‌హాక్‌ గా రూ.10,000 కోట్లు ముందస్తుగా మంజూరు చేయాలన్న ఆయన సూచనను ఆర్థిక శాఖ పక్కనపడేసిందని చెబుతున్నారు. సమీక్షల విన్యాసాలతో పోలవరాన్ని పూర్తిగా ముంచేశారని మండిపడుతున్నారు.

Updated Date - 2023-06-01T05:38:26+05:30 IST