Share News

కవి జూపల్లి ప్రేమ్‌చంద్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2023-10-20T04:43:20+05:30 IST

వి, బహుజనోద్యమ సాహిత్యకారుడు, సాహితీ విమర్శకుడు జూపల్లి ప్రేమ్‌చంద్‌ (66) ఇకలేరు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో

కవి జూపల్లి ప్రేమ్‌చంద్‌ కన్నుమూత

నేడు పటాన్‌చెరులో అంత్యక్రియలు

హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి/అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 19: కవి, బహుజనోద్యమ సాహిత్యకారుడు, సాహితీ విమర్శకుడు జూపల్లి ప్రేమ్‌చంద్‌ (66) ఇకలేరు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలో పద్మావతమ్మ, జూపల్లి వెంకట అప్పారావు దంపతులకు 1957 ఫిబ్రవరి 4న ప్రేమ్‌చంద్‌ జన్మించారు. అప్పారావు ఉద్యోగ నిర్వహణలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆయన విద్యా, ఉద్యోగ జీవితమంతా అనంతపురం జిల్లాలోనే గడిచింది. తెలుగు సాహిత్యంపై ఆసక్తితో ప్రేమ్‌చంద్‌ ఎంఏ తెలుగు, ఎంఫిల్‌, పీహెచ్‌డీని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. తొలినాళ్లలో తెలుగు అధ్యాపకుడిగా, ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 2015లో అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. అనంతరం సామాజిక, సాంస్కృతిక రంగాల్లో, సాహిత్య సేవలో మునిగిపోయారు. బోధనా వృత్తిని వదిలేశారు. ‘వాయిస్‌’ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనంతరం జిల్లా గ్రామీణ సమస్యల మీద, ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో సామాజికాభివృద్ది లక్ష్యంగా పనిచేశారు. అనంతపురం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా చాలాకాలం కొనసాగారు. 1981లో బరోడా ఆంరఽధ సమితివారు విశ్వవిద్యాలయాల స్థాయిలో నిర్వహించిన కథానిక పోటీల్లో ప్రేమ్‌చంద్‌ ‘ఓట్లన్నీ పోలయినాయి’ పేరుతో కథానిక రాసి, రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి అందుకున్నారు. ఎస్కేయూలో ప్రసిద్ధ రచయిత శ్రీరంగం నారాయణబాబు రచన ‘రుధిరజ్యోతి’పై ఎంఫిల్‌ చేశారు. ‘సామాజిక పరిణామాలు-వచన కవిత్వం’ మీద పీహెచ్‌డీ చేశారు.

బహుజన అస్తిత్వాన్ని చాటుతూ ప్రేమ్‌చంద్‌ ‘అవేదు, ‘నిచ్చెన మెట్ల లోకం’ కావ్యాలు రాశారు. 1987లో ‘మౌనశంఖం’ అనే సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. రాయలసీమ ఉద్యమంలోనూ బలమైన గొంతుకగా ప్రేమ్‌చంద్‌ నిలిచారు. 1999లో అవేద అనే కవితా సంకలనానికి కవితా విమర్శకులు లక్ష్మీనర్సయ్య, అఫ్సర్‌, రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డును ప్రేమ్‌చంద్‌ అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి రాయలసీమ కవి ఈయనే. 2017లో విజయవాడలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మాతృభాషా విశిష్ట సేవా పురస్కారం అందుకున్నారు. సాహిత్య విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, గుంటూరు లక్ష్మీనరసయ్య, శాంతి నారాయణ, గోవిందరాజులు, బండి నారాయణస్వామి, పసునూరి రవీంద్ర, కవులు యాకూబ్‌, తదితరులు సంతాపం తెలియజేశారు. ప్రేమ్‌చంద్‌ భౌతిక కాయాన్ని హైదరాబాద్‌ బీరంగూడలోని ఆయన కుమారుడు శంతన్‌ ఇంటి వద్ద ఉంచారు. శుక్రవారం ఉదయం 10గంటలకు పటాన్‌చెరులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - 2023-10-20T04:43:20+05:30 IST