Share News

ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్డడం బాధాకరం

ABN , First Publish Date - 2023-11-29T04:10:41+05:30 IST

పేద, మధ్యతరగతి ప్రజలకు ఐదు కిలోల రేషన్‌ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంటే..

ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్డడం బాధాకరం

ఇసుక, మైనింగ్‌, మద్యంలో

ప్రభుత్వ ఆదాయానికి గండి

ఇది సీఎం అనుచరుల పనే: పురందేశ్వరి

విజయనగరం దాసన్నపేట, నవంబరు 28: పేద, మధ్యతరగతి ప్రజలకు ఐదు కిలోల రేషన్‌ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంటే.. ఆ బ్యాగులపై జగన్‌ ఫొటోను ముద్రించుకుంటున్నారని, ఇలాంటి స్టిక్కర్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పిలుపునిచ్చారు. మంగళవారం ఇక్కడ జరిగిన బీజేపీ బూత్‌ స్వశక్తికరణ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులు అయిన తోటపల్లి, జంఝావతి నేటికీ పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నాని పురందేశ్వరి గుర్తు చేశారు. గరివిడి సమీపంలో మైనింగ్‌ టెండర్లు పిలిచి.. వైసీపీ నాయకుల తమ అనుచరులకే కట్టబెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన ఇళ్లను రూ.50 వేల నుంచి రూ.లక్షకు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ఇసుక, మద్యం, మైనింగ్‌ వ్యాపారాల్లో ముఖ్యమంత్రి అనుచరులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారన్నారని ఆమె విమర్శించారు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టుపెట్టడం బాధకరమని అన్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేకపోవడం దారుణమన్నారు. సామాజిక సాధికారిత యాత్ర చేయడానికి వైసీపీకి ఏ అర్హత ఉందని పురందేశ్వరి నిలదీశారు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు ఎత్తివేశారని, బీసీలకు మొండి చేయి చూపించారని ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు తన చెల్లిని అల్లరిమూకలు గొడవ చేస్తున్నారని ప్రశ్నిస్తే.. బాలుడి కాళ్లు, చేతులు కట్టి సజీవ దహనం చేశారన్నారు. చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా, నేటికీ ఆ కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదన్నారు. వంశఽధార, నాగావళి నదుల్లో వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా ఇసుక తవ్వేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నడికుదిటి ఈశ్వరరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T04:10:42+05:30 IST