Share News

వైసీపీలో పీకే ఫీవర్‌!

ABN , Publish Date - Dec 26 , 2023 | 02:53 AM

తనకు జై కొడితే మంచోడు.. బై బై అంటే దుర్మార్గుడనేలా వ్యవహరించడం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి అలవాటుగా మారిందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.

వైసీపీలో పీకే ఫీవర్‌!

జగన్‌తో విభేదించడంతో ఎదురుదాడి

ఎమ్మెల్యేల తిట్ల దండకం

అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తనకు జై కొడితే మంచోడు.. బై బై అంటే దుర్మార్గుడనేలా వ్యవహరించడం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి అలవాటుగా మారిందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఆయన్ను ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలో కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే)ను సైతం వదల్లేదని అంటున్నాయి. పీకే పూర్తిగా జగన్‌కు దూరమవడమే గాక.. ఆయన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు గూటికి చేరారు. జగన్‌ అనుసరిస్తున్న విధానాలతో పీకే చాలా కాలంగా విభేదిస్తున్నారు. బాహాటంగా విమర్శలు కూడా సంధించారు. ఇకపై జగన్‌ కోసం రాజకీయ వ్యూహాలను అమలు చేయనని స్పష్టం చేశారు. అంతటితో కథ ముగిసిపోలేదు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో కలసి ఢిల్లీ నుంచి ఉండవల్లికి వచ్చారు. మాజీ సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ మంనాలు జరిపారు. దీనిపై జగన్‌ కన్నెర్ర చేశారు. తనతో విభేదించడమే గాక.. తన ప్రత్యర్థితో చేతులు కలపడం.. తన ఓటమికి రాజకీయ వ్యూహాలు అమలు చేసేందుకు పీకే సిద్ధమవడం.. ఆయనకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. పీకే వ్యూహరచన గురించి తెలిసి ఉండడంతో.. లాభం లేదని తన జట్టును ఎగదోశారు. ప్రశాంత్‌ కిశోర్‌పై వైసీపీ ఎమ్మెల్యేలు తిట్లదండకం మొదలెట్టారు. ఇంతకాలం ప్రత్యర్థి పార్టీల నేతలపై విషం చిమ్మిన జగన్‌ అండ్‌ కో.. ఇప్పుడు పీకేపై ఒకింత ఎక్కువగానే విరుచుకుపడుతున్నారు. పనిలోపనిగా గతంలో ఆయనపై టీడీపీ నేతలు చేసిన విమర్శలను గుర్తుచేస్తున్నారు. జగన్‌లో నానాటికీ పెరుగుతున్న నిస్పృహకు ఇది నిదర్శనమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Updated Date - Dec 26 , 2023 | 02:53 AM