ఎక్సైజ్‌ కేసులకు పీడీ యాక్ట్‌ సరికాదు

ABN , First Publish Date - 2023-06-02T04:46:34+05:30 IST

ఎక్సైజ్‌ చట్టం, ఇతర సాధారణ కేసులు నమోదైనప్పుడు పీడీ యాక్ట్‌ను ప్రయోగించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రజా జీవనానికి విఘాతం కలిగించేలా చర్యలు ఉన్నప్పుడే

ఎక్సైజ్‌ కేసులకు పీడీ యాక్ట్‌ సరికాదు

● ప్రజా జీవనానికి భంగం కలిగించినప్పుడే నమోదు సాధ్యం

● పిటిషనర్‌ కుమారుడిపై నిర్బంధ ఉత్తర్వులు కొట్టేసిన హైకోర్టు

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ చట్టం, ఇతర సాధారణ కేసులు నమోదైనప్పుడు పీడీ యాక్ట్‌ను ప్రయోగించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రజా జీవనానికి విఘాతం కలిగించేలా చర్యలు ఉన్నప్పుడే వ్యక్తులపై ఈ చట్టం కింద కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఎక్సైజ్‌ చట్టం కింద కేసులు పెట్టినప్పుడు పీడీ యాక్ట్‌ నమోదు చేయడానికి వీల్లేదని గతంలోనే హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేసింది. ప్రస్తుత వ్యాజ్యంలో పిటిషనర్‌ కుమారుడిపై ఎక్సైజ్‌ చట్టం కింద కేసులు నమోదు చేశారని, ఆ కేసుల్లో ఇప్పటికే ఆయన బెయిల్‌ పొందారని పేర్కొంది. పీడీయాక్ట్‌ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుబట్టింది. నిర్బంధ ఉత్తర్వుల్లో లోపాలున్నాయని పేర్కొంటూ వాటిని కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురానికి చెందిన బాలిన సురేశ్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ సురేశ్‌ తండ్రి సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... సాధారణ చట్టాల ద్వారా నేరాలు నిరోధించలేమని భావించినప్పుడు, పబ్లిక్‌ ఆర్డర్‌కు భంగం కలిగించేలా చర్యలు ఉన్నప్పుడు మాత్రమే పీడీ యాక్ట్‌ నమోదు చేయాలన్నారు. ప్రస్తుత కేసులో పిటిషనర్‌ కుమారుడిపై ఎక్సైజ్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసినందున పీడీ యాక్ట్‌ వర్తించదని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... కల్తీ మద్యం విక్రయించడాన్ని సురేశ్‌ అలవాటుగా మార్చుకున్నారన్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలుగుతున్న నేపథ్యంలోనే పీడీ యాక్ట్‌ ప్రయోగించామన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... పిటిషనర్‌ కుమారుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించేందుకు తగిన కారణాలు లేవని పేర్కొంది. అతనిపై జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వులను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2023-06-02T04:46:34+05:30 IST