Share News

Pawan Kalyan : గృహ నిర్మాణంలో భారీ అవినీతి

ABN , Publish Date - Dec 31 , 2023 | 04:20 AM

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణాల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని, దీనిపై వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ లేఖ రాశారు.

Pawan Kalyan : గృహ నిర్మాణంలో భారీ అవినీతి

ప్రజాధనం పక్కదారి.. వైసీపీ నేతలకు లబ్ధి

సీబీఐ, ఈడీలతో విచారణ చేయించండి

ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్‌ లేఖ

ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు

ఐదేళ్లల్లో ఖర్చు చేసింది రూ.11,358 కోట్లే

కానీ, 91,503 కోట్లని సర్కారు లెక్కలు

కేంద్ర పథకాల నిధులూ కలిపేసి దోపిడీ

అనేక సందేహాలున్నాయన్న పవన్‌

విచారణ చేయాలని విన్నపం

అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణాల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని, దీనిపై వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ లేఖ రాశారు. శనివారం ఉదయం ఈ లేఖను ప్రధాని మోదీకి పంపించారు. పేదలకు సొంతిల్లు పేరిట కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం రూ.35,141 కోట్ల నిధులను వెచ్చించిందని, ఇందులో భారీగా నిధులు పక్కదారి పట్టాయని లేఖలో పేర్కొన్నారు. ‘వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పింది. 29 లక్షల మంది మహిళల పేరుతో పట్టాలిచ్చేందుకు నిర్ణయించినా, 21 లక్షల మందినే లబ్ధిదారులగా గుర్తించింది. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు కాగా, ఈ ఐదేళ్లలో ప్రభుత్వం గృహనిర్మాణాలకు బడ్జెట్‌లో రూ.23,106 కోట్లే కేటాయించింది. అందులోనూ రూ.11,358 కోట్లే ఖర్చు చేసింది. కానీ.. రూ.91,503 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతోంది. ఇందులో అనేక సందేహాలున్నాయి’ అని పేర్కొన్నారు. ‘మొదట చెప్పినట్లుగా 30లక్షల గృహాలను నిర్మించకుండా 17,005 జగనన్న లేఅవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారు. ఈ మొత్తం పథకంలో ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించింది. పథకం పేరిట వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు. ప్రధానంగా.. పీఎంఏవై, జేజేఎం, ఎంజీఎన్‌ఆర్‌ఈజీపీ, ఎస్సీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారు’ అని ఆరోపించారు.

ఇవి ప్రభుత్వ లెక్కలే!

పేదలందరికీ ఇళ్ల పథకం నిర్వహణ ప్రక్రియలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన వివరాలను తేదీల వారీగా పవన్‌ తన లేఖలో పొందుపరిచారు. ‘2021 మే 29న 30 లక్షల ఇళ్ల స్థలాలను పేలందరికీ అందిస్తామన్నారు. 30.76 లక్షల ఇళ్ల స్థలాలను అందించేందుకు 68,381 ఎకరాల భూమిని సేకరించామని 2021 జూన్‌ 10వ తేదీన తెలిపారు. ఇళ్ల స్థలాలు, ఒక్కో స్థలం ఖరీదు రూ.5 నుంచి రూ.10 లక్షలు అని 2022 అక్టోబరు 7వ తేదీన తెలిపారు. 30.76 లక్షల ఇళ్లస్థలాలు, దీని కోసం 71,811 ఎకరాల భూసేకరణ, మార్కెట్‌ విలువ ప్రకారం రూ.25 వేల కోట్లతో సేకరించినట్లు 2022 మార్చి 17న వివరించారు. 2022 మే 29న 30 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ అని ప్రభుత్వం ప్రకటించింది. 2023 అక్టోబరు 12 వ తేదీన 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలంటూ పత్రికా ప్రకటన ఇచ్చారు.

ఇందులో భాగంగా భూసేకరణ కోసం రూ.56,102 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మొదటి చెప్పిన లెక్కలకూ దీనికీ చాలా వ్యత్యాసం ఉంది. మొదట్లో భూసేకరణ కోసం రూ.35,151 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పిన లెక్కకు, పత్రికా ప్రకటనలో చెప్పిన లెక్కకు చాలా తేడా ఉంది’ అని పవన్‌ లేఖలో వివరించారు. వాస్తవంగా.. గృహ నిర్మాణం కోసం గత ఐదు బడ్జెట్‌లలో వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.23,106 కోట్ల మేర కేటాయించిందని, దీనిలో ఖర్చు చేసింది మాత్రం కేవలం రూ.11,358.87 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పథకం ద్వారా రాష్ట్రానికి రూ.14,366.08 కోట్లు విడుదల చేసిందని వివరించారు. సీబీఐతో పాటు ఈడీ విచారణ చేపడితే పేదల గృహ నిర్మాణం పథకంలో చోటుచేసుకున్న మరింత లోతైన అవినీతి బయటపడే అవకాశం ఉందని, వేల కోట్ల ప్రజాధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో బయటపడుతుందని ప్రధానికి రాసిన లేఖలో పవన్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 04:25 AM