Share News

Pawan Kalyan : నేను మారను.. నా పంథా మారదు

ABN , First Publish Date - 2023-12-03T03:10:57+05:30 IST

నేను బీసీలు, ఎస్సీల గురించి ఆలోచించే సమయంలో జగన్‌ బెంగళూరు అవినీతి లెక్కల్లో ఉండేవాడు.

Pawan Kalyan : నేను మారను.. నా పంథా మారదు

పదవుల కోసం వచ్చినవాడిని కాదు

జనసైనికులను కాపాడుకుంటాను

జగన్‌ మళ్లీ వస్తే వనరులు, వ్యవస్థలు మిగలవు

చాలా కులాలకు అధికారం, పదవులూ లేవు

ఒకే కులానికి 80ు నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చిన జగన్‌

వైసీపీకి కులాల గురించి మాట్లాడే అర్హత లేదు: పవన్‌

జనసేనాని సమక్షంలో కండువా కప్పుకొన్న వైసీపీ నేతలు

అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను బీసీలు, ఎస్సీల గురించి ఆలోచించే సమయంలో జగన్‌ బెంగళూరు అవినీతి లెక్కల్లో ఉండేవాడు. దోచుకున్న అన్ని వేలకోట్లు ఆయనకు సరిపోవడం లేదు. కల్తీ మద్యం రూపంలో ప్రజల ప్రాణాలు తీసి సంపాదిస్తున్నాడు. దోసేచిన ఇసుకలో ఆర్జిస్తున్నాడు’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. వైసీపీ చేస్తున్న అన్యాయాలను ఎవరైనా ఆడిగితే, ప్రశ్నిస్తే బెదిరించడం ప్రాణాలు తీయడం చాలా సులభం అయిపోయిందని, జగన్‌ అవినీతి గురించి ప్రజలు ఆలోచించడం మానేసి చాలా రోజులైందని వ్యాఖ్యానించారు. వామపక్ష భావజాలానికి, సనాతన ధర్మానికి దగ్గరగా ఉన్నవాళ్లు తనను అమితంగా ఇష్టపడతారని, ఈ రెండు భావజాలాలను ఏకతాటిపైకి తీసుకురావాలనేది నా ఆలోచన అని వివరించారు. శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పలువురు కీలక నేతలు ఆ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆయన సాదరంగా ఆహ్వానించారు. ‘‘సమాజంలో అణగారిన, వెనుకబడిన వర్గాలకు నిర్ణయాత్మక అధికారం కావాలి. ఇప్పటి వరకూ అఽధికారం చూడని కులాలకు నిజమైన అధికారం దక్కాలి. ఆయా వర్గాలు తమను తాము అభివృద్ధి చేసుకునేందుకు దారి చూపాలి. ఇదే జనసేన సిద్ధాంతం’’ అని పవన్‌ అన్నారు. 80 శాతం నామినేటెడ్‌ పోస్టులను, ఇతర పదవులను ఒకే కులానికి కట్టబెట్టిన వైసీపీకి అసలు కులాల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఆగ్రహించారు. ‘‘నా లక్ష్యం పదవులో, గెలవడమో కాదు.. మొదట నా కుటుంబం లాంటి మిమ్మల్ని రక్షించుకోవాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి.. నేను ఎవరికీ కొమ్ము కాసే రాజకీయాలు చేయడానికి రాలేదు. కష్టాల్లో ఉన్న వారికి, కడగండ్లు పాలైన వారికి మాత్రమే కొమ్ము కాయడానికి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాను.’’ అని సృష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఇంకా ఏమన్నారంటే..

అవినీతి చేస్తున్నా...

’’జగన్‌ అవినీతి గురించి ఎంత మాట్లాడినా ప్రజలు దాన్ని పెద్ద సీరియస్‌ విషయంగా తీసుకోవడం లేదు. ఈ రోజుల్లో ఎవరు తినడం లేదంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. నేను ఇవన్నీ కుణ్ణంగా గమనించే జగన్‌ అవినీతి మీద మాట్లాడటం మానేశాను. జగన్‌ దోపిడీపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేద్దామని ఆలోచించినప్పుడూ ఇదే సమస్య ఎదురవుతోంది. వారికి మాత్రం ఈ విషయాలు తెలీవా అనే సందేహం నాకు కలుగుతుంది. వైఎస్‌ 2004 ఎన్నికల్లో నిలబడటానికి డబ్బులేని పరిస్థితి నుంచి అధికారం వచ్చిన తరువాత పత్రిక నడిపే స్థాయికి వచ్చారంటే ఏం జరిగిందో ఈజీగా అర్థమవుతుంది’’

జనసేనలో చేరిన నాయకులు...

వివిధ జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులను పవన్‌ కల్యాణ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు జనసేనలో చేరారు. గ్రామ పంచాయతీల పట్ల వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాపారవేత్త చిక్కాల దొరబాబు, ఆ జిల్లా లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, వైసీపీ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు దుగ్గన నాగరాజు, డ్రైవర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కలగ పాల్‌ పురుషోత్తంతో పాటు మరికొంత మంది జనసేనలో చేరారు.

Updated Date - 2023-12-03T03:11:06+05:30 IST